-అంబేద్కర్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన ప్రవచించిన ప్రాథమిక హక్కులనే నిషేధించాం
-లేకపోతే…భారత స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాల సమయంలో ఒక ఎంపీ పై దొంగ కేసు పెట్టి కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేస్తారు?
-కేబినెట్ చేసిన సి ఆర్ డి ఏ చట్ట సవరణ కోర్టు ధిక్కరనే అవుతుంది
-అమరావతిని గతంలో కంపు చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు
-బూతులు తిట్టే వారికి మంత్రి పదవి ఇస్తానని సిఎం వార్నింగ్ ఇచ్చారట..??
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులన్నవి ఆంధ్ర ప్రదేశ్ లో అమలులో లేవని, రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను నిషేధించడం జరిగిందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు అన్నవి అమలు లో ఉంటే, దేశమంతా స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఒక ఎంపీపై దొంగ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొని, లాకప్ లో చిత్రహింసలకు గురి చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ అంటే తమ ప్రభుత్వ పెద్దలకు గౌరవం ఉందని అందుకే ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్న రఘురామకృష్ణం రాజు, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని… స్మృతి వనాన్ని నిర్మిస్తామని చెప్పి నిర్మించలేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆయన ప్రవచించిన ఆర్టికల్ 14 నుంచి 22 వరకు కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగంగా ఎంపీ అయినా కూడా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలను తమ ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తారని చెప్పారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు ఎప్పటికప్పుడు అమరావతి కి తూట్లు పొడిచే ప్రయత్నాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి భూసేకరణ చేయడానికి ముందే, సి ఆర్ డి ఏ చట్టాన్ని గత ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. ఈ చట్టం ప్రకారం 30 ఏళ్ల పాటు మాస్టర్ ప్లాన్ లోని జోనల్ వ్యవస్థను మార్చడానికి వీలు లేదన్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , సి ఆర్ డి ఏ చట్టాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాన్ని చేశారన్నారు.
జీవో నెంబర్ 107 జారీ ద్వారా జగనన్న కాలనీలకు రాజధాని నగరంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని, దాని ద్వారా తానొక్కడినే బీదల మనిషినని చెప్పుకునే ప్రయత్నాన్ని చేశారంటూ ఎద్దేవా చేశారు. అమరావతి నైసర్గిక స్వరూపాన్ని మార్చి, కంపు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107 ను సవాల్ చేస్తూ, రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా… హైకోర్టు సకాలంలో సజావుగా స్పందించి, సి ఆర్ డి ఏ చట్టాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందన్నారు. దానితో చట్టాన్ని మారిస్తే పోలా? అన్న చెత్త ఆలోచనతో ఏకంగా క్యాబినెట్ సమావేశంలో సి ఆర్ డి ఏ చట్టానికి సవరణలు చేస్తూ, తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తాను విశాల హృదయముతో పేదలకు పట్టెడు స్థలం, గుప్పెడు అన్నం పెట్టాలనుకుంటే, దుష్ట చతుష్టయం కలిసి అడ్డుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారని గతంలో ప్రచారం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అమరావతిని చెడదొబ్బడానికే ఇలా చేస్తున్నారని, వీళ్ళ అసలు ఉద్దేశం వేరేనని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని కోరారు. రాజమండ్రి, విశాఖపట్నం, కడప నగరాలలో నివసించే వారికి అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు ఎందుకని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, వారు నివసిస్తున్న నగరాలలోనే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇల్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాజధాని నగరంలో నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలను కేటాయించాలనుకుంటే సి ఆర్ డి ఏ చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రామసభ తీర్మానం మేరకు, ఇళ్ల స్థలాలను కేటాయించవచ్చునని తెలిపారు. సి ఆర్ డి ఏ పరిధిలోని గ్రామాలకు ఎన్నికలను నిర్వహించకుండా, ప్రత్యేక అధికారుల నియమించి వారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గ్రామస్తుల అభిప్రాయాన్ని తెలుసుకుంటారట.. అంటూ ఎద్దేవా చేశారు.
క్యాబినెట్ తీర్మానం… హైకోర్టు తీర్పుకు వ్యతిరేకం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో సి ఆర్ డి ఏ చట్ట సవరణ, మార్పులు, చేర్పులు హైకోర్టు తీర్పు కు పూర్తిగా వ్యతిరేకమని, ఈ తీర్మానం… కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. సి ఆర్ డి ఏ చట్టాన్ని దొడ్డిదారిలో అడ్డుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్న ప్రయత్నం ఇదని పేర్కొన్న ఆయన, ఈ చట్ట సవరణకు న్యాయపరంగా ఎటువంటి హేతుబద్ధత లేదని చెప్పారు. ఇటువంటి ప్రభుత్వాలు తడిగుడ్డతో గొంతు కోసే ప్రయత్నాలను చేస్తున్నప్పుడు మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇక న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వెంటనే, పేదలకు మళ్లీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాను సి ఆర్ డి ఏ చట్ట సవరణ చేస్తే, దుష్ట చతుష్టయం కలిసి అడ్డుపడుతున్నారని దొంగ క్యాంపెయిన్ మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు. ప్రజలు వారి ట్రాప్ లో పడవద్దని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని చేపడతామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటివరకు ఎన్ని ఇండ్లను మొదలు పెట్టారని ప్రశ్నించారు. గతంలో లాగానే తమ ప్రభుత్వం అమరావతిపై కుట్రతో సొంత లాభం చూసుకునే సి ఆర్ డి ఏ చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిలో కొంతమంది తమ అనుయాయులకు ఇళ్ల స్థలాలను కేటాయించి, రేపు అమరావతి పనులు చురుకుగా జరిగే సమయంలో అమ్ముకోవచ్చు అన్నది వారి ఎత్తుగడ అయి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజా కంటక ప్రభుత్వం దిగిపోవడం ఖాయం
ఇవాళ కాకపోతే రేపు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ ప్రజా కంటక ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఆర్డిఏ చట్ట సవరణ తీర్మానాన్ని గవర్నర్ ఎలాగూ ఆమోదిస్తారని, ఇటువంటి విషయాలలో చట్ట సవరణ చెల్లదని న్యాయస్థానం తీర్పు ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తన కుటుంబం పై కామెంట్ చేసిన టిడిపి నేతలను కార్నర్ చేయకపోవడం పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టాలని, బూతులు తిట్టగలిగే వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పినట్లు తెలిసిందన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి రాజ్యాంగ పాఠాలను చెబుతారని కానీ తమ ప్రభుత్వంలో బూతు మాస్టర్ ను పెట్టి, ఎమ్మెల్యేలకు పరీక్ష నిర్వహించి ఎవరైతే తమ ముఖ్యమంత్రి మాదిరిగా ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులవుతారో వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రాష్ట్ర ప్రముఖుల మూలాలు ఉన్నాయని టిడిపి నేతలు అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ సభ్యత సంస్కారంతోనే మాట్లాడారని పేర్కొన్నారు. 108 లిక్కర్ షాపులకు 200 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ట్రైడెంట్ కంపెనీ పేరిట ఇచ్చింది నిజమేనని, ఒక వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, వాళ్లు కలిసి చేసే మరో వ్యాపారంలో కూడా భాగస్వాములే మోనని టిడిపి నేతలు అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేశారన్నారు. అసెంబ్లీలో అసభ్యంగా, యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే రీతిలో మంత్రులు, తమ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినట్లుగా టిడిపి నేతలు అవమానకరంగా మాట్లాడలేదని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు, తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి, అరబిందో ఫార్మా యజమాని స్వయాన వియ్యంకుడని గుర్తు చేశారు. కాకినాడ పోర్టులో 50 శాతం వాటాను పాత యజమాని విక్రయించగా అరబిందో ఫార్మా సంస్థ దక్కించుకున్నదని, అలాగే పక్కనే ఉన్న జిఎంఆర్ ఎస్సీ జెడ్ లోను వాటాను అరబిందో ఫార్మా కు వారికి విక్రయించారన్నారు. ఈ రెండు వ్యవహారాలలో అరబిందో ఫార్మా పేరిట వాటా మార్పిడికి సహకరించింది ఎవరని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, సజావుగా సదరు వాటాలను అరబిందో ఫార్మా పేరిట బదిలీ చేసింది ఎవరని నిలదీశారు. అదాన్ డిస్టలరి విజయసాయి అల్లుడిది అయితే, ఎస్పీవై రెడ్డి డిస్టలరీని, ఢిల్లీలో పదవులు పంచుకున్న ఇంకొక నేత కనుసన్నల్లో కొనసాగుతుందన్నారు. ఆంధ్ర లిక్కర్ వ్యాపారం అంత అరబిందో ఫార్మా, మరొకరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
జిపిఎస్ ఇస్తాం … ఓపిఎస్ కుదరదని తేల్చి చెప్పిన ప్రభుత్వం
జిపిఎస్ ఇస్తామని, ఓ పి ఎస్ ఇవ్వడం కుదరదని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఉపాధ్యాయులకు తేల్చి చెప్పారని రఘురామకృష్ణం రాజు అన్నారు. జిపిఎస్ ను ఓ పి ఎస్ కంటే మెరుగ్గా ఇస్తామని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని, ఓ పి ఎస్ ఇవ్వమని ఉద్యోగులు అడుగుతుంటే, జిపిఎస్ ను ఓ పి ఎస్ కంటే మెరుగ్గా ఇస్తామనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఓ పి ఎస్ ను అమలు చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్యోగులు నమ్మలేదని, ఆయన కమిటీ కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనని పేర్కొన్న ఆయన, సిపిఎస్ ను వారం రోజుల వ్యవధిలో రద్దుచేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ఉద్యోగులు నమ్మి మోస పోయారన్నారు.