Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది

– కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీశ్ రావు ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైంది. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇద్దరు బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే…

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 9 నెలల కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు.

గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించింది. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలి. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE