-ప్రజా న్యాయస్థానంలో మాత్రం న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది
-ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది అక్షరాలా నిజం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
న్యాయస్థానాలు, లోక్ సభ తనకు అండగా లేకపోయినా … ప్రజలు తనకు అండగా ఉన్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనకు జరిగిన అన్యాయానికి లోక్ సభ ద్వారా పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకం తనకైతే లేదన్నారు. ప్రజా న్యాయస్థానంలో మాత్రం న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు జరిగిన అన్యాయం గురించి పలుమార్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పింది అక్షరాల నిజమని ఆయన పేర్కొన్నారు. పక్కవారిని హింసిస్తుంటే, ఫోనులో తిలకించి ఆనందించే వికృత మనస్తత్వం కలిగిన వారికి ఓటు అనే ఆయుధం ద్వారానే బుద్ధి చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఎన్నికల సందర్భంగా వాళ్లు ఇచ్చే ఐదు వేలు, పదివేల రూపాయలకు ఆశపడి మోసపోవద్దన్నారు. ఒకవేళ మోసపోతే… మళ్లీ గొడ్డలి బాధలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. పోలీస్ కస్టడీ తాను ఎదుర్కొన్న చిత్రహింసలను రఘురామకృష్ణం రాజు పూసగుచ్చినట్లుగా మీడియా ప్రతినిధులకు వివరించారు. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి మరొకసారి లేఖ రూపంలో తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి పై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని… న్యాయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రధానితోపాటు ఎనిమిది వందల మంది ఎంపీలకు మళ్లీ లేఖ రాస్తా
పోలీస్ కస్టడీలో తాను ఎదుర్కొన్న చిత్రహింసలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, మరొకసారి దేశంలోని ఎనిమిది వందల మంది ఎంపీలకు తన కష్టాన్ని వివరిస్తూ లేఖలు రాయనున్నట్లు తెలిపారు. గతంలో పోలీసు కస్టడీలో చిత్రహింసలు ఎదుర్కొన్న వెంటనే దేశంలోని ఎంపీలందరికీ లేఖలను రాశానని గుర్తు చేశారు. న్యాయం జరుగుతుందా?, లేదా?? అన్నది తర్వాతి అంశమని మరొక మారు ఎంపీలందరికీ లేఖలు రాయనున్నట్లు తెలిపారు. పోలీస్ కస్టడీలో తనని చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తన కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. పిటీషన్ దాఖలు చేసే 19 మాసాలు పూర్తి కావొస్తుందన్నారు. ఈ 19 మాసాల వ్యవధిలో 30 సార్లు మెన్షన్ చేసినప్పటికీ, కేసు విచారణ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తకళ ప్రదర్శన ద్వారానే ఇలా జరిగి ఉండవచ్చునన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ విత్ డ్రా చేసుకొని హైకోర్టుకు వెళ్తారా? అని ప్రశ్నించడం జరిగిందని… దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు కనీసం 20 నెలల తర్వాత అయిన హైకోర్టుకు వెళ్ళమని చెప్పిందని, పార్లమెంట్ ప్రివలేజీ కమిటీ మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసు అధికారుల పేర్లు ప్రివిలేజ్ కమిటీ ముందు తాను వెల్లడించానన్నారు. అయినా సదరు అధికారులను పిలిచి విచారించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రివలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగానే, సంబంధిత అధికారులను పిలిచి విచారించారని గుర్తు చేశారు. తనని పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మిలటరీ ఆసుపత్రిలో అప్పటి హైకోర్టు రిజిస్టార్ జనరల్, ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం వల్ల తీవ్ర గాయాలు, తన వేలు విరిగిపోయిందన్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పోలీసు కస్టడీలో తనని చిత్రహింసలకు గురిచేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ, మెజిస్ట్రేట్ ముందు తాను వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, ఎవ్వరి పైన కేసులు నమోదు చేయలేదన్నారు.
ఏపీ వరకు 66A సెక్షన్ అమలు చేయమని అడగాలేమో
ఐపిసి 66 A సెక్షన్ కింద కేసులు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అయినా ఇంకా 66A సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని ప్రశ్నించిందన్నారు. 66 A కింద సుప్రీంకోర్టు కేసులు నమోదు చేయడాన్ని నిషేధించడంతో, రాష్ట్ర సిఐడి పోలీసులు ఐపీసీ 153A సెక్షన్ కింద అమాయకులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు పై 153A కింద కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి భార్య అక్రమంగా బంగారం కొనుగోలు చేసిన విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దాన్ని అంకబాబు మరొక వాట్సాప్ గ్రూప్ లోకి ఫార్వర్డ్ చేసినంత మాత్రాన రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తినట్లుగా సిఐడి పోలీసులు భావించి 153A సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 66 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అంటే, చిన్న న్యూసెన్స్ కేసు మాత్రమేనని… అదే 153 ఏ కింద కేసు నమోదు చేయడం అంటే రెండు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 153 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్న సిఐడి పోలీసులు, భవిష్యత్తులో 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన అతిశయోక్తి లేదని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ వరకు సెక్షన్ 66 ఏను అమలు చేయమని సుప్రీంకోర్టును కోరుదామన్నారు.
రాయలసీమ మహిళ స్ఫూర్తిని మిగతా జిల్లాల మహిళలు అందిపుచ్చుకోవాలి
రాయలసీమ మహిళా చైతన్య స్ఫూర్తిని, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మహిళలు అందిపుచ్చుకోవాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు. డ్వాక్రా మహిళలను బలవంతంగా ప్రభుత్వ బహిరంగ సభలకు తరలించడం పరిపాటిగా మారిందన్నారు. ఒకవేళ బహిరంగ సభలకు హాజరు కాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామని గ్రామ వాలంటీర్లు బెదిరించడం సర్వసాధారణమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు డబ్బులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జేబులో నుంచి, గ్రామ వాలంటీర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని అన్నారు. గ్రామ వాలంటీర్ల బెదిరింపులకు మహిళలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో డ్వాక్రా మహిళలను గ్రామ వాలంటీర్లు బెదిరించినప్పటికీ, ప్రభుత్వ బహిరంగ సభలకు వారు హాజరు కావడం లేదన్నారు. ఇష్టం ఉన్నవారు ఎవరైనా స్వచ్ఛందంగా వెళితే వెళ్లవచ్చునని… అంతేకానీ అది తీసివేస్తాం… ఇది తీసివేస్తామని బెదిరిస్తే బహిరంగ సభలకు హాజరు కావొద్దు అంటూ రఘురామకృష్ణం రాజు కోరారు.
ఉద్యమంలా ఏపీలో అవినీతి కార్యక్రమం
రాష్ట్రంలో అవినీతి కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ల్యాండ్, శాండ్, మైన్ వైన్ లలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు. గృహ నిర్మాణ పథకంలో లెక్కకు మించి అవినీతి జరిగిందన్న ఆయన, అయితే కొండల్లో, లేదంటే గోతుల్లో స్థలాలను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఐదు లక్షలు విలువ చేయని స్థలాన్ని కూడా 50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ పెద్దలు కొట్టేశారన్నారు.. ఇక రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు పడిన తిప్పలు అన్ని ఇన్ని కావని తెలిపారు. ఇక రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో అవినీతి పతాక స్థాయిలో కొనసాగిందని వెల్లడించారు. అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన శరత్ చంద్రారెడ్డి గురించి తమ పార్టీ పెద్దలు గొప్పలు చెప్పారని, ఇప్పుడు అదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితునిగా జైలులో ఉన్నారన్నారు. రాష్ట్రంలో మద్యం డిస్టలరీలన్నీ తమ పార్టీ, ప్రభుత్వ పెద్దలను సన్నల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో అన్ని చెత్త బ్రాండ్లను మాత్రమే తయారు చేస్తున్నారని తెలిపారు. మద్యం ఫార్ములా ఒకటేనని, బ్రాండ్లు మాత్రమే వేరేనన్నారు. ప్రజా ఆరోగ్యం తో చెలగాటం ఆడడం వల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవ కన్ను తెరిచి ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చారని, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతికి విరామం ప్రకటించడం వినూత్న పథకమేనని ఎద్దేవా చేశారు. ఎవరైనా అవినీతి నిర్మూలన కోసం కృషి చేస్తారని, అంతేకానీ క్రాప్ హాలిడేగా మాదిరిగా… అవినీతికి హాలిడే ప్రకటించరని అన్నారు. ఈ ఏడాది కాలం పాటు అవినీతికి హాలిడే ప్రకటించాలని మంత్రి వర్గ సమావేశంలో తన సహచర మంత్రులకు ముఖ్యమంత్రి సూచించడం అభినందనీయమని తెలిపారు. అవినీతి విరామం తమకు మాత్రమేనా? అని ప్రశ్నిస్తున్న మంత్రులు… ల్యాండ్, శాండ్, మైన్, వైన్లలో అవినీతికి కూడా విరామాన్ని ప్రకటించాలని కోరుతున్నట్లుగా తెలిసిందన్నారు.
పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కోసం తన ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణం రాజుగారు ఘనంగా నివాళులు అర్పించారు. గొడ్డలి బ్యాచ్ వల్ల రాష్ట్రంలో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని, ఆ అమరజీవి ఆత్మకు శాంతి కలిగే విధంగా రాష్ట్ర ప్రజలు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.