Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు

-కడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు
-గతంలో చేసిన తప్పు మళ్ళీ ప్రజలు చేయరు
-ఇప్పటికే ఎంతో పశ్చాత్తాప పడుతున్న రాష్ట్ర ప్రజానీకం
-ఈ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం
-అతని పీడ ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న 60 శాతం మంది ప్రజలు
-ప్రజాస్పందన తగ్గట్లే సర్వేల అంచనాలు
-అన్ని సర్వే రిపోర్టుల్లోనూ కూటమిదే అప్రహతిత విజయమన్న సంకేతాలు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు అతడి పీడను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. అందుకు తగ్గట్లే పలు సంస్థల సర్వే అంచనాలు వెలువడుతున్నాయని, ఏ సర్వే సంస్థ నివేదికను పరిశీలించిన కూటమిదే అప్రహతీత విజయమని స్పష్టమవుతోందన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అరాచకాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఆయన ఎన్ని టక్కు టమారా, గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించిన ప్రయోజనం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అప్రహతీత, అద్భుత విజయాన్ని సాధిస్తుందని, ఇది పచ్చి నిజమని పేర్కొన్నారు.

మళ్లీ తప్పు చేసేందుకు సిద్ధంగా లేని ప్రజలు… గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం
రాష్ట్ర ప్రజలు మళ్లీ తప్పును చేసేందుకు సిద్ధంగా లేరని, గతంలో చేసిన తప్పును రానున్న ఎన్నికల్లో సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ఒక్క ఛాన్స్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినందుకు, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారన్నారు . అంతేకానీ మళ్లీ తప్పు చేసే మూడ్ లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రాన్ని వదిలించుకునేందుకు రాష్ట్రంలోని 60 శాతం మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఆయన, 60 శాతం మంది ప్రజలు ఆదరిస్తే కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అద్భుత విజయాన్ని సాధించడం ఖాయమని తెలిపారు.

ప్రీ పోల్ సర్వేలను ఎలా విశ్లేషిస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నపై రఘు రామ కృష్ణంరాజు స్పందిస్తూ… ప్రీ పోల్ సర్వేలను విశ్లేషించడమే కాదని, నేను, నా స్నేహితులు కూడా సర్వేలను చేయిస్తుంటామని చెప్పారు. ఒకరితో ఒకరం సర్వే నోట్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవడంతోపాటు, సర్వేలను నిర్వహించడానికి అనుసరించిన పద్ధతుల్లో ఎక్కడ తేడా వచ్చిందో అంచనా వేసుకుని, తరువాత చేయించే సర్వేలో సరి చేసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల మూడ్ చాలా స్పష్టంగా ఉందన్న ఆయన, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ని ఇంటికి పంపాలనుకునే వారే ఎక్కువ
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎన్నికల్లో ఇంటికి పంపాలని భావిస్తున్న ప్రజలే ఎక్కువగా కనిపిస్తున్నారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. రానున్న ఎన్నికలు జగన్, యాంటీ జగన్ అనే విధంగా జరగనున్నాయన్నారు. జగన్ ను వ్యతిరేకించే వారంతా నారా చంద్రబాబునాయుడు సారథ్యం లోని కూటమికి ఓటు వేస్తారన్నారు. జగన్ కు అనుకూలంగా ఉన్నవారు ఆయనకు, ఆయన పార్టీ సానుభూతిపరులకు ఓటు వేస్తారని తెలిపారు . జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే సామాజిక వర్గం, ఆయన ప్రేమిస్తున్నానని చెప్పే సామాజిక వర్గం తో పాటు మీకు మంచి జరిగిందంటేనే ఓటు వేయమని మహిళలను మభ్య పెట్టడం ద్వారా ఓట్లను సంపాదించాలని చూస్తున్నారన్నారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 15 రోజుల వ్యవధిలో ప్రజలకు జరిగిన మేలు కొంతైతే, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది కొండంత అని ప్రజలకు సవివరంగా వివరించగలిగితే 40 స్థానాలు కాస్తా 30 కి పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మహిళలకు మీ వద్ద మీ భర్తలు లాగేసిన సొమ్మును, జగన్మోహన్ రెడ్డి నకిలీ మద్యం రూపంలో ఎలా కొట్టేశారో వివరించాలన్నారు.

ఉండి ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం కల్పించింది
నరసాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా, బిజెపి నాయకత్వం అంగీకరించలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని తెలిపారు. నర్సాపురం పార్లమెంటు స్థానం కోసం నేను గతంలో ప్రయత్నించాను. ఎంపీ టికెట్ నాకు దక్కకుండా చేసింది బిజెపి నాయకులు కాదని తెలిసి,తెర వెనుక ఉన్నదేవరో తెలుసుకున్న తర్వాత ప్రయత్నం చేయడం మానేశానన్నారు.

శత్రువు బలవంతుడని, అతని బలాన్ని చూపెట్టే అవకాశం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెనక్కి జరిగానన్నారు. రానున్న ఎన్నికల్లో నేను రామరాజు, శివరామరాజు ల సంపూర్ణ సహకారంతో గెలవబోతున్నానని తెలిపారు. త్వరలోనే వారిద్దరినీ కలిసి నా గెలుపుకు సహకరించాలని అభ్యర్థిస్తాను. వారు ఖచ్చితంగా సహకరిస్తారని, రానున్న ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధిస్తాననే నమ్మకం నాకుందన్న రఘురామకృష్ణం రాజు, ఇది నిజమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అప్రహతీత విజయాన్ని సాధిస్తే, ఉండిలో నేను విజయం సాధించకుండా ఉంటానా? అని మీడియా ప్రతినిధులను రఘురామకృష్ణం రాజు ఎదురు ప్రశ్నించారు.

కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, నెల్లూరు వరకు తెదేపా, పవన్ పవనాలు వీస్తున్నాయన్నారు. రాయలసీమలో మాత్రం నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి ఉందని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో రాజకీయంగా సహకరించేవారు ఎంతోమంది ఉన్నారన్న ఆయన, వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వారు కూడా లేకపోలేదని పేర్కొన్నారు. వారంతా ఆర్థికంగా సహకరించడం నిబంధనలకు విరుద్ధమని, కాకపోతే రాజకీయంగా సహకరిస్తారనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అంజి బాబుతో కలిసి ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు.

ఉండి లో ఉన్నప్పుడు ఎప్పుడు సమయం దొరికినా స్నేహితులను కలుస్తూనే ఉంటానని తెలిపారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు, జిల్లాలకు వచ్చినప్పుడు కచ్చితంగా కలుస్తానని చెప్పిన రఘురామ కృష్ణంరాజు, భీమవరం లో జరిగే ఎన్నికల సభలో పాల్గొనే పవన్ కళ్యాణ్ కూడా కలుసుకుంటానని తెలిపారు. రామరాజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. రామరాజు నాతో కలిసి నడవవలసిన అవసరం లేదని, నేనే ఆయనతో కలిసి నడుస్తానని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రామరాజు మంచి వ్యక్తి అన్నారు. నరసాపురం లోక్ సభ టికెట్ దక్కకపోవడం వల్లే, నేను పోటీ చేయాల్సిన అవసరం ఉందని భావించడం వల్లే నా సొంత ఊరైన ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. ఉండి అసెంబ్లీ స్థానానికి నా అభ్యర్థిత్వం కరెక్ట్ అని, రామరాజు అభ్యర్థిత్వం కరెక్ట్ కాదని కాదు . కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. రామరాజును పార్టీ నాయకత్వం నా కంటే ఎక్కువగా గౌరవిస్తుందని నమ్మకం నాకు ఉందన్నారు. ఉండి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా రేపు అధికారికంగా ప్రకటించనున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ నెల 21వ తేదీన విజయవాడలో పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ అందజేయనున్నారని తెలిపారు. శుక్రవారం నాడు ఒక సెట్ నామినేషన్ పత్రాలను మా అబ్బాయి రిటర్నింగ్ అధికారికి సమర్పించారని, ఈనెల 22వ తేదీన అధికారికంగా నామినేషన్ దాఖలు చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి నన్ను వ్యక్తిగతంగా అభిమానించే ప్రతి ఒక్కరు, తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేని వారు ఇళ్లల్లో నుంచే దీవించాలని ఆకాంక్షించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారాన్ని కొండేపూడి నుంచి ప్రారంభించాలని పలువురు సూచించినట్లుగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రచార పర్వాన్ని ప్రారంభించడానికి ముందు ద్వారకాతిరుమలను దర్శించుకుని, తిరుమలకు వెళ్లి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకుంటానని తెలిపారు . నన్ను కస్టడీలో ఈ ప్రభుత్వ పెద్దలు ఎన్ని చిత్రహింసలకు గురిచేసిన నన్ను కాపాడింది ఆ శ్రీనివాసుడేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

సి ఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ ను తక్షణమే బదిలీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సి ఎస్ ), ఇన్చార్జి డిజిపి, ఇంటలిజెన్స్ చీఫ్ ను తక్షణమే బదిలీ చేయాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటే ప్రస్తుతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక అడుగు ముందుకు వేసి, ఆరోపణలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాజీవ్ కుమార్ కు నివేదిస్తామని తెలిపారన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్లు కనిపించాలన్న తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని, ఇన్చార్జి డీజీపీ ని, ఇంటలిజెన్స్ చీఫ్ అధికారిని బదిలీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం అని ఆయన పేర్కొన్నారు. నా అంచనా ప్రకారం రేపు ఉదయం దినపత్రికలలో బదిలీ వార్త వెలువడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం అధికారులు కూడా బిజీగా ఉండి ఉంటారని, నిర్ణయం తీసుకోవడానికి కాసింత ఆలస్యం జరగవచ్చునని అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం కూడా కట్టుబడి ఉంటుందనే ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులను ఇటీవల బదిలీ చేసినప్పటికీ, పోలీసుల పనితీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదన్నారు. వెంకట్ రెడ్డి, వాసుదేవ రెడ్డి వంటి కింది స్థాయి అధికారులను బదిలీ చేయడం కాదని, ఎన్నికల సమయంలో పూర్తిస్థాయి ఇన్చార్జిగా కొనసాగుతున్న డీజీపీ ని నిబంధనల ప్రకారం బదిలీ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనను కొనసాగించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. , డీజీపీ మంచివారా కాదా అన్నది పక్కన పెట్టి, నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి ఇన్చార్జి హోదాలో పనిచేస్తున్న డీజీపీ ని బదిలీ చేస్తారని భావిస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

వెల వెలబోతున్న జగన్మోహన్ రెడ్డి సభలు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల సభలు ప్రజలతో కళ, కళలాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలు ప్రజలు లేక వెల, వెల బోతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . భీమవరంలో మొన్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభకు ఆరు నుంచి ఏడు వేల మంది కూడా హాజరు కాలేదన్నారు. ఈ సభ కోసం ప్రజలను తరలించడానికి 980 ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి జనాలను తరలించడానికి ఏర్పాటు చేశారన్నారు. ఒక్కొక్క బస్సుకు పదిమంది చొప్పున వేసుకున్న 9800 మంది పొరుగుర్ల నుంచే హాజరు కావాలన్నారు.

కానీ సభాస్థలిలో వేళ్ళ మీద లెక్కపెట్టే జనం మాత్రమే ఉన్నారన్నారు. భీమవరంలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన పేర్కొన్నారు. బస్సులు ఎక్కువ, జనం తక్కువ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే మనుషులతో పాటు పక్షులకు గూడునిచ్చే, జీవకోటికి ప్రాణవాయువునిచ్చే చెట్లు కూడా భయంతో విలవిలలాడిపోతున్నాయన్నారు. ప్రజలనే కాదు, పక్షులకు గూడుని ఇచ్చే చెట్లను కొట్టి వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఎన్నుకోవడమా? అని ప్రజలు ఆలోచిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఓపెన్ అయి మాట్లాడుతున్నారని, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు.

ఇదే విషయాన్ని వారు బాహాటంగా చెబుతున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రావులపాలెంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తే కనీసం 2000 మంది కూడా జంక్షన్ వద్ద జనం లేరని, నన్ను కలవడానికి వచ్చిన స్థానికులు తెలిపారు. జంక్షన్ వద్ద జనం లేని ఫోటోలను నాకు చూపించారని, కానీ పత్రికల్లో జగన్ మాయతో వచ్చే ఫోటోలలో జనం కిక్కిరిసినట్టుగా కనిపిస్తారన్నారు. జనవరిలో నేను నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చినప్పుడు రావులపాలెం జంక్షన్ మొత్తం జనంతో నిండిపోయి, ట్రాఫిక్ రద్దీ నెలకొందని గుర్తు చేశారు. అందులో సగం మంది కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కి హాజరు కాలేదని, స్థానికులు చూపించిన ఫోటోల ద్వారా స్పష్టం అయ్యిందని తెలిపారు.

దీన్నిబట్టి, ప్రజలు ఒక వ్యక్తి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదని అర్థం చేసుకోవచ్చునని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా మూడు సినిమాలను తీశారన్నారు. ఏ ఒక్క సినిమా కూడా ప్రజాదరణకు నోచుకోలేదన్నారు. ఒక సినిమా నైతే కనీసం విడుదల కూడా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేసి బలవంతంగా ప్రజల నుంచి 100 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రజలు అవసరమైతే వంద రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ సినిమాను చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదని పేర్కొన్నారు.

చివరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇకపై పనికిమాలిన వారి బయోపిక్ లు సినిమాలు గా తీయనని, ఇకపై మంచి సినిమాలను రూపొందిస్తానని పేర్కొన్నారని గుర్తు చేశారు . రోడ్ షోలను జనం ఎవరూ లేకపోవడంతో ట్రాఫిక్ కూడళ్ల వద్ద పోలీసుల చేత, వచ్చి పోయే వారిని నిలుపుదల చేసి పరదాల మధ్య జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారన్నారు . రోడ్డుపై రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు వైకాపా జెండా రంగులతో కూడిన పరదాలను పోలీసులు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదన్నారు.

రాయితో ఎవరో దాడి చేసినట్టుగా నాటకం ఆడి సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇంత చీప్ గా డ్రామాలు ఆడుతున్నందువల్ల జగన్మోహన్ రెడ్డి విలువ తగ్గిపోయిందన్నారు. జనం లేక సభలు వెలవెల పోతున్న, కవరింగ్ ఇచ్చుకుంటూ జనాలు నీరాజనం పడుతున్నారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగనన్నకు ‘నీరా’జనం పట్టేందుకు ఆయన సారా బ్యాచ్ ఉండి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలలో ఎక్కడ కూడా మహిళలు కనిపించడం లేదని గుర్తు చేశారు.

నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు పురుషులతో సమానంగా 50 శాతం మంది మహిళలు, లేదంటే పురుషులు 55% హాజరైతే, మహిళలు హీనపక్షంగా 45 శాతం మంది అయినా హాజరవుతున్నారన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలలో మహిళలు కనిపించడమే లేద న్నారు. పురుషులు మాత్రం బిర్యాని, మద్యం కు ఆశపడి హాజరవుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ మార్పు చూస్తే, జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని స్పష్టమవుతోందన్నారు.

గులక రాయి డ్రామా బుమరాంగ్ అయ్యాక 6 నుంచి 8 స్థానాలు గల్లంతు
జగన్మోహన్ రెడ్డి ఆడిన గులకరాయి డ్రామా బుమరాంగ్ అయ్యాక, గోదావరి జిల్లాలో నిర్వహించిన సభ డిజాస్టర్ అయిన తర్వాత 6 నుంచి 8 స్థానాలలో వైకాపా గల్లంతు అయ్యిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సట్టా మార్కెట్ ద్వారా అందిన సూచనల మేరకు ఈ పతనం దినదినాభివృద్ధి కాదని, క్షణక్షణాభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడిందని, నా ఆస్తి నాది కాదన్న భయం ప్రజల్లో కనిపిస్తోందన్నారు.

ఎక్కడైనా రీసర్వే చేసి కొత్త డాక్యుమెంట్ ఇస్తే చాలు ఒక బోసి మొహంతో ఫోటో ఉంటుందని, భూమి పత్రాలపై భూ యజమాని ఫోటో మాత్రం ఉండదన్నారు. ఒరిజినల్ పేపర్లు తమ వద్దే పెట్టుకుని జిరాక్స్ కాగితాలను భూ యజమానికి అందజేయడం విడ్డూరంగా ఉందన్నారు. బర్త్ సర్టిఫికెట్ పై కూడా దరఖాస్తుదారుడి ఫోటో ఉంటుందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఉంటుందన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత ఎక్కడ ఉంటాడో తెలియని జగన్మోహన్ రెడ్డి ఫోటో తో కూడిన సర్టిఫికెట్ ఎవరైనా తమ వద్ద ఉంచుకోగలరా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

మనకు ఇష్టం లేదని తిరస్కరించిన వ్యక్తి మొహంతో కూడిన ఫోటో వంటిపై తప్ప అన్నీ సర్టిఫికెట్లలో ఉంటే సహించగలమా అని నిలదీశారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి కి ఓటు వేస్తే… నా ముఖాన్ని ఇంతగా ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పి భవిష్యత్తులో మగ పిల్లవాడు పుడితే వారికి జగన్ రెడ్డి, జగన్ రాజు, జగన్ శాస్త్రి, జగన్ యాదవ్, జగన్ గౌడ్ అంటూ వారి వారి కులాలను బట్టి పేర్లు పెట్టాలని ఆదేశిస్తారన్నారు. ఇక ఆడపిల్లలకైతే భారతి రెడ్డి, భారతి వర్మ, భారతి శాస్త్రి వర్షా రాజు హర్షిని రాజు అంటూ పేర్లు పెట్టుకునే అవకాశాన్ని ఇస్తారన్నారు.

ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైకాపా నాయకత్వం పక్కన పెట్టేసిందని, ఆయన ఫోటోను కూడా వాడడం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే ఏర్పడనున్న పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చిన ప్రజలు ఆయన్ని ఓడించాలని డిసైడ్ అయ్యారన్నారు.

కడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టును ఎవరైనా ఆశ్రయిస్తే కొట్టి వేయవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రతివాదిగా నా పేరు చేర్చి ఉంటే, కచ్చితంగా నేను హైకోర్టును ఆశ్రయించి ఉండేవారినన్నారు . పబ్లిక్ డొమైన్ లో ఉన్న అంశంపై మాట్లాడవద్దని కడప కోర్టు ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సిబిఐ దాఖలు చేసినా చార్జిషీట్లోని అంశాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టేనని గుర్తు చేశారు.

ఈ అంశాలపై మాట్లాడకూడదని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, షర్మిలా రెడ్డి, సునీత రెడ్డి లను కోర్టు ఆదేశించినట్లుగా తెలిసిందన్నారు. నేను, ఇతరులు మాట్లాడడంపై ఈ ఆంక్షలు చెల్లవని పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఎవరైనా అభ్యర్థులు తమపై ఉన్న కేసులను ప్రస్తావించినప్పుడు వాటిపై మాట్లాడకూడదని పేర్కొనడం ఎలాగైతే సహేతుకం కాదో, ఇది కూడా అలాగే సహేతుకం కాదన్నారు.

21న భీమవరంలో జరిగే సభను విజయవంతం చేయండి
ఈనెల 21వ తేదీన భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొననున్న సభను భీమవరం, ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ సభకు ఇతర ప్రాంతాలను జనాలను తీసుకు రావలసిన అవసరం లేదని, పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తారన్నారు.

LEAVE A RESPONSE