Suryaa.co.in

Editorial

సిస్టర్స్‌కు ‘పులి’వెందుల భయపడుతోందా?

– అప్పుడు వివేకా హత్యపై వార్తలు రాయవద్దని గ్యాగ్ ఆర్డర్
– ఇప్పుడు ఫలానావాళ్లు ఆ హత్యపై ప్రసంగించవద్దని మరో ఆర్డర్
– గతంలో సంజన ఆడియోపై అంబటి గ్యాగ్ ఆర్డర్
– వాస్తవాలు చెబితే వయికిపోతున్నారంటూ విపక్షాల వ్యంగాస్త్రాలు
– మరి జగన్ మీడియాలో ప్రత్యర్థులపై రాసే రాతల సంగతేమిటని ప్రశ్న
– వివేకా హత్యపై ఆర్డరు తర్వాత తొలిసారి గళం విప్పిన ఎంపి రాజు
– సిస్టర్స్ సెంటి‘మంట’ ‘పులి’వెందుల సింహాన్ని భయపెడుతోందా?
– మహిళా ఓట్లు మాయమవుతాయని వైసీపీ మధనపడుతోందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

సింహం సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి.. మీరెంతమంది వచ్చినా మా జగనన్న సింగిల్‌గానే వస్తారు.. పులివెందుల పులిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి… సింహం ఎప్పుడూ సింహమే. వాళ్లే గుంటనక్కల్లా వస్తున్నారు.. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున్నాడు. వాళ్లంతా ఒకవైపున్నారు… ఇవీ మంత్రి రోజక్క నుంచి సీఎం జగనన్న వరకూ తరచూ వినిపించే డైలాగులు.

కానీ సింహం సింగిలయిపోయి సిక్కయిపోయిందా? సివంగుల నోటి ధాటికి సింహం మరో మార్గం చూసుకుంటుందా? పులికి బెదురుభయం పట్టుకుందా? ఆడపులలను చూసి ‘పులి’వెందుల వణికిపోతోందా? ఏమో.. అందుకే.. ఫలానా వాళ్లంతా హూకిల్డ్ బాబాయ్? అనిగానీ… గొడ్డలిపోటెవరిది అనిగానీ అనకుండా.. కట్టడి చేసుకునే ఆర్డరు తెచ్చుకుందన్నది జనాభిప్రాయం. జనాభిప్రాయమైతే సరే. కానీ జగనన్నను పులి, సింహాలుగా కీర్తించే పులివెందుల కూడా, ఈ రకమైన అభిప్రాయంతో ఉండటమే విచిత్రం.

ఇప్పటిదాకా హూకిల్డ్‌బాబాయ్? గొడ్డలి పోటెవరిది అంటూ సోషల్‌మీడియాలో హోరెత్తిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి, ఇకపై ఆయన సొంత బిడ్డ డాక్టర్ సునీతగానీ, ఆయన అన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డిగానీ.. వారితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, టీడీపీ యువనేత లోకేష్, టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవిగానీ ఎవరూ మాట్లాడకుండా వైసీపీ ఇంజక్షన్ ఆర్డరు తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

‘‘అవతలి పార్టీ స్టేట్‌మెంటు కూడా వినకుండా ఏకపక్షంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని వైసీపీ వారు రూల్స్ గురించి వింతగా ఉంది. అయినా సరే వివేకా హంతకులకు ఓటువేయకుండా, వైఎస్ బిడ్డ షర్మిలను పార్లమెంటుకు పంపించాలన్నది వివేకా బిడ్డ సునీత వ్యాఖ్య.

గతంలో మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంజన అనే మహిళతో మాట్లాడిన ఆడియో ఒకటి, ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో సంచలనం సృష్టించింది. అది సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. దానితో ఆయన హైకోర్టుకు వెళ్లి, దానిని ప్రచురించి-ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు.

ఆ తర్వాత పులివెందులలోని తన సొంత ఇంట్లో మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద దారుణహత్యకు గురయ్యారు. జగన్‌కు చెందిన సొంత మీడియాతోపాటు, ఎంపి విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు.. అప్పుడు దానిని గుండెపోటు అని ప్రకటించారు. తర్వాత రక్తపువాంతులన్నారు. ఆ తర్వాత హత్య అన్నారు. చివరకు దానిని చంద్రబాబునాయుడు చేయించారని ఆరోపించారు. వైసీపీ మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత దానిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తి టీడీపీ నాయకులు, తెలుగు మీడియా చర్చించడం ప్రారంభించింది. దానితో భయపడిన వైసీపీ వివేకా హత్యపై ఎవరూ రాయవద్దని గ్యాగ్ ఆర్డరు తెచ్చుకుంది. దానితో ఆ ఎన్నికల్లో వివేకా హత్య సానుభూతితో వైసీపీ ఓట్లు కొల్లగొట్టింది.

చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ తన తండ్రి-చిన్నాయన హత్యపై, సునీత-షర్మిల సమ్మక్క-సారక్క మాదిరిగా.. కడప పార్లమెంటు పరిథిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గళం విప్పుతున్నారు. నేరుగా అవినాషే హంతకుడు.. హంతకుడికి ఓటేస్తారా? రాజన్న బిడ్డకు ఓటేస్తారా? కొంగుచాచి అడుగుతున్నా.. నాకు న్యాయం చేయండి.. ఈ జగనన్న ఎవరో మాకు పరిచయం లేదు.. అనే భారీ సెంటిమెంటు డైలాగుతోనే, మహిళా ఓటర్ల కంట కన్నీరు తెప్పిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంంద్రబాబు, జనసేన దళపతి పవన్ ఇద్దరో చెరోవైపు నిలబడి… చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పు జగన్.. సొంత చెల్లెళ్లే తమకు రక్షణ లేదంటే, ఇక మహిళల రక్షణ సంగతి ఏమిటి? అన్న ప్రచారంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ సహజంగానే పార్లమెంటు, దాని పరిథిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై పడే ప్రమాదం కనిపిస్తోంది.

ఇది సహజంగానే కడప లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రధానంగా వైఎస్ కుటుంబంతో బాగా అనుబంధం ఉన్న కడప-పులివెందుల- జమ్మలమడుగు-కమలాపురం నియోజకవర్గాల మహిళలల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రిలేని ఆడబిడ్డలు రోడ్డున పడ్డారంటూ, వారిపై మహిళాలోకం విపరీతమైన సానుభూతి చూపిస్తోంది. పైగా షర్మిల-సునీత సభలకు మహిళలు పోటెత్తుతున్నారు. ఆమె బస్సు దిగిన వెంటనే మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి, సానుభూతి-మద్దతు ప్రకటించటం వారిలో ఆత్మస్థైర్యం పెంచుతోంది.

ఈ మధ్యలో వైఎస్ సోదరి విమలారెడ్డిని, వైసీపీ వ్యూహబృందం రంగంలోకి దింపడంతో కథ కొత్త మలుపు తిరిగింది. అవినాష్‌రెడ్డిని అమాయకుడు, చిన్నపిల్లాడిగా అభివ ర్ణిస్తూ.. తన మేనకోడళ్లయిన షర్మిల-సునీత తప్పు చేస్తున్నారని ఒక వీడియో విడుదల చేశారు. అయితే దానిపై షర్మిల విరుచుపడి, మేనత్తపై సంధించిన వ్యంగ్యాస్త్రాలతో విమలారెడ్డి మళ్లీ మాట్లాడకుండా నిష్క్రమించారు.

ఈ దశలో కడప జిల్లా వైసీపీ నేత సురేష్, కడప జిల్లా కోర్టులో ఒక పిటిషన్ వేశారు. వివేకా హత్యపై షర్మిల-సునీత-చంద్రబాబు-పవన్-పురందేశ్వరి- లోకేష్- బీటెక్ రవి మాట్లాడకుండా ఉత్తర్వులివ్వాలని పిటిషన్ వేయడం, జిల్లా కోర్టు న్యాయాధికారి వెంటనే ఆమేరకు ఉత్తర్వులివ్వడం చకచకా జరిగిపోయాయి.

అయితే దీనిపై న్యాయవాద వర్గాల్లో ఆసక్తికరమైన చ ర్చ జరుగుతోంది. కోర్టుకు వెళ్లడం వారి హక్కంటూనే.. వివేకా హత్యపై కొందరినయితే ఇంజక్షన్ ఆర్డరుతో నిలువరించారు గానీ, దానిపై మిగిలిన నాయకులు, సంఘాలు, వ్యక్తులు మాట్లాడితే ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది. ‘రేపు ఏ దళిత సంఘాలో, ఏ క్రైస్తవ సంఘాలో, ఏ మహిళా సంఘాలో కడప లేదా పులివెందులతోపాటు 7 నియోజకవర్గాల్లో సభలు, ప్రెస్‌మీట్లు పెట్టి వివేకా హత్యపై సందేహాలు, సీబీఐ విచారణ గురించి చర్చిస్తే ఎవరూ చేసేదేమీ ఉండదు. వారిని ఆవిధంగా మాట్లాడవద్దని ఏ కోర్టు ఆదేశించలేదు’’ ఒక సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. బాధితులు మరొక రూపంలో వెళతారని, అప్పుడు వారిని ఎలా అడ్డుకుంటారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

అందుకు తగ్గట్టే.. నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు తాజాగా వివేకా హత్యపై ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వివేకా హత్యపై వాళ్లను మాట్లాడవ ద్దని మాత్రమే కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను, నాతో పాటు చాలామంది మాట్లాడవచ్చు. అయినా పబ్లిక్‌డొమైన్‌లో ఉన్న అంశం గురించి మాట్లాడవద్దని చెప్పడం సరైంది కాదు. అభ్యర్ధుల నేర చరిత్రను ఈసీకి ఇవ్వాలి. దానిపై చర్చ జరపవద్దనడం ఎంత న్యాయమో, ఇదీ అంతే. అయినా ఈ కేసు హైకోర్టులో వీగిపోతుంది’’ అని విశ్లేషించడం ప్రస్తావనార్హం.

అయితే ఫలానా నాయకులు వివేకా హత్య గురించి మాట్లాడకూడదని కోర్టుతో కట్టడి చేయించిన వైసీపీ నాయకుల వ్యవహారంపై ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. జగన్ ఎవరికీ భయపడరంటూ ఇప్పటివరకూ చేసిన ప్రచారనమంతా ఉత్తిదేనని, వైసీపీది మేకపోతు గాంభీర్యమేనని తేలిందన్న వ్యాఖ్యలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘నిజంగా షర్మిల అండ్ కో ఆరోపణలు అబద్ధమైతే ప్రజలే వారిని ఓడిస్తారు కదా? జగనన్నను రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, మేనకోడళ్లు అభిమానిస్తూ 175కి 175 సీట్లు కట్టబెట్టబోతున్నప్పుడు ఈ భయమెందుకు’’? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

ఇక వైఎస్ తన రాజకీయ జీవితంలో ఏనాడూ పులివెందులలో పరదాలు కట్టించి పర్యటించలేదన్న వ్యాఖ్యలు, పులివెందుల ప్రజల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. కానీ జగన్ ఒక్కరే తొలిసారి తమ ఊరు వచ్చినప్పుడు పరదాల కట్టుకోవడంపై విస్మయం వ్యక్తమయింది.

‘పెద్దాయన కొన్ని వేలసార్లు హైదరాబాద్ నుంచి పులివెందుల వచ్చారు. సీఎం అయినప్పుడు కూడా స్వేచ్ఛగా తిరిగారు. ఆయనొచ్చారని పోలీసులు మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. అసలు ఆయనెప్పుడూ ఇట్లా పరదాలు కట్టుకోవడం మేం మా జీవితంలో చూడలేదు. కానీ జగన్‌బాబు వస్తే పరదాలు కడతారు. మమ్మల్ని కట్టడి చేస్తున్నార’’ని పులివెందుల ప్రజలు అప్పుడే వ్యాఖ్యానించిన వైనం సోషల్‌మీడియాలో ప్రముఖంగా వచ్చిన విషయం తెలిసిందే.

కాగా ఫలానా వ్యక్తులు వివేకా హత్యపై మాట్లాడవద్దని ఆర్డరు తెచ్చుకున్న వైసీపీ.. మరి తన మీడియాలో అదే వ్యక్తులపై చల్లుతున్న బురద-చేస్తున్న విమర్శల సంగతేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడు వివేకా హత్యపై నారాసురరక్త చరిత్ర, ఇప్పుడు బెజవాడ రాయి దాడిపై చేస్తున్న ఆరోపణలపైనా.. ఇలాగే కోర్టుకు వెళ్లి ఆర్డరు తెచ్చుకోవ చ్చా? అని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.

LEAVE A RESPONSE