Suryaa.co.in

Editorial

ఏపీ సీఎం సాయిరెడ్డేనట!

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో మాట్లాడి.. అమీ తుమీ తేల్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత మీరు హోదా ఇవ్వకపోతే ఇక సహించేది లేదని హెచ్చరించారట. హోదా ఇవ్వకపోతే ఢిల్లీని దద్దరిల్లచేస్తామని వార్నింగు ఇచ్చినంత పనిచేశారట. అన్నింటికీ ‘సిద్ధం’ అని బరాబర్ చెప్పేశారట. నాకు నా రాష్ట్ర ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారట. ఇన్నాళ్లూ ఊరుకున్నా.. ఇక గమ్మునుండే ప్రసక్తి లేదని గట్టిగా హూంకరించారట. నా మౌనాన్ని చేతకానితనంగా భావించవద్దని చెప్పేశారట. సింహం సింగిల్‌గానే వస్తుందని సినిమా డైలాగు వదిలారట. ఇవన్నీ ప్రత్యేక హోదా కోసం, జగనన్న మనసు నుంచి తన్నుకొచ్చిన భావోద్వేగం, భావావేశమేనట.

దానితో ప్రధానికి అంత ఏసీ రూమలోనూ చెమటలు పట్టాయట. జగన్ ఆగ్రహం చూసి అంతలావు మోదీ వణికిపోయారట. జగన్‌ను అంత కోపం చేయవద్దని బ్రతిమిలాడారట. ఈ వయసులో అంత ఆవేశం పనికిరాదని హితవు పలికి, టవల్‌తో చెమటలు తుడుచుకున్నారట.

సరే.. ఆ వినతిపత్రం ఇటివ్వు అని తీసుకున్నారట. వెంటనే ఇంటర్‌కమ్ ఫోన్ అందుకుని.. ‘రేపు సాయంత్రం లోగా ఇవన్నీ ప్రకటించేయండి’ అని ఎవరికో పురమాయించారట. ప్రత్యేక హోదాపై మా యుద్ధం ఆగలేదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపి విజయసాయిరెడ్డి మొన్నీమధ్యనే వెల్లడించారు. కాబట్టి.. మోదీ-జగన్ భేటీలో ఇలాంటి సంభాషణలే దొర్లి ఉంటాయన్నది వైసీపీ నేతల అంచనా.

సరే.. మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా జగన్ యుద్ధం చేస్తూనే ఉన్నారు. జగనన్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక.. మోదీ భయంతో నేలచూపులు చూస్తూనే ఉన్నారు. కాబట్టి దాన్నలా పక్కనపెడదాం. జగనన్న మోదీని కలసి పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. అక్కడే చకోరపక్షుల్లా వేచి ఉన్న, జాతీయ-తెలుగు మీడియా ప్రతినిధులు.. ‘పివి నరసింహారావుకు భారతరత్న వచ్చిన సందర్భంలో మీ కామెంట్’ ఏమిటని ప్రశ్నించారు.

దానికి జగనన్న షిక్కటి షిరునవ్వులు చిందిస్తూ ‘విజయసాయి చెబుతాడు’ అని కారెక్కి వెళ్లిపోయారు. దానితో అక్కడున్న జాతీయ మీడియా మహిళా ప్రతినిధి ‘ఏపీ సీఎం విజయసాయిరెడ్డా’ అని చేసిన కామెంట్‌కు సంబంధించిన వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయినా ఢిల్లీ మీడియా పిచ్చి కాకపోతే… రోజూ తాడేపల్లి క్యాంపు ఆఫీసు బయట కాళ్లరిగేలా కూర్చున్నా, జగనన్న ఇప్పటికి ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడిన ముచ్చట లేదు. సూటిగా చెప్పాలంటే.. ఏపీ మీడియాకే దిక్కులేదు. ఇక ఢిల్లీ మీడియాతో ఏం మాట్లాడతారు? ఆశకయినా హద్దు ఉండక్కర్లా?

ఇక దివంగత మాజీ ప్రధాని పివికి భారతరత్న ప్రకటించడంపై, తెలుగువారంతా సంతోషం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలో రాజకీయాలకు అతీతంగా ప్రధానికి కృతజ్ఞతలు, పివి కుటుంబానికి అభినందనలూ తెలిపారు. జగన్ తన తండ్రి వైఎస్‌తో పివికి ఉన్న బంధం ఏమిటో తెలుసు. నంద్యాల సభలో పివి పక్కనే ఉన్న కోట్లపై చెప్పులు వేయించిన వైనమూ తెలిసే తీరాలి. ఆరకంగానయినా కనీసం మీడియాకు రెండు ముక్కలు చెబితే బాగుండేదని వైసీపీ విభీషణుల ఉవాచ.

‘‘పివికి భారతరత్న ఇవ్వడం తెలుగువారిని గౌరవించడమే. పివికి అత్యున్నత అవార్డు ఇచ్చినందుకు ప్రధానికి నా కృతజ్ఞతలు. పివి కుటుంబసభ్యులకు అభినందనలు’’ అని చెప్పి ఉంటే, జగనన్న గౌరవం పెరిగి ఉండేది. అలా కాకుండా, ‘విజయసాయి చెబుతాడ’న్నారంటే…. జగనన్నకు పివిపై గౌరవం లేదా? లేక పివి లాంటి వారిపై వ్యాఖ్యానించే స్థాయి తనది కాదు. విజయసాయిది అని అర్ధమా?

సరే గానీ.. ఇప్పుడు ఏపీ సీఎం జగనా? సాయిరెడ్డా?.. ఇవీ సోషల్‌మీడియాలో సీమటపాకాయ్‌లా పేలుతున్న వెటకారపు కామెంట్లు. ఈ వ్యాఖ్య చేసిన మహిళా జర్నలిస్టు గొంతును వీడియోలో పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఆంధ్రా జాతిరత్నం జగన్‌తో పొగిడించుకునే అదృష్టం భారతరత్న పివికి లేకుండా పోయింది. బ్యాడ్‌లక్!

అయితే ఇక్కడ మరో విశేషం కూడా లేకపోలేదు. జగన్ తర్వాత సీఎం ఎవరవుతారన్న చర్చ ఇప్పటిదాకా పార్టీ వర్గాల్లో కలలో కూడా జరగనే లేదు.కానీ ఆలాంటి ఊహాగానాలకు సందేహాలకు, స్వయంగా జగనే సమాధానం ఇచ్చినట్టయింది. అవును. ఢిల్లీ జర్నలిస్టు మాటల్లో.. విజయసాయిరెడ్డే ఏపీ సీఎం అన్నమాట! మీకు అర్ధమవుతోందా?

ఇక సీన్ కట్ చేస్తే జగనన్న ఢిల్లీలో దిగినప్పుడు, ఆయనకు ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తర్వాత జగన్ కారులో కూర్చుంటే.. ఆయన వెనుక సీట్లో వియసాయిరెడ్డి.. మిధున్‌రెడ్డి కూర్చున్న మరొక వీడియో, సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదికూడా జగన్ మీడియాలో వచ్చిన వీడియో కావడంతో, మార్ఫింగ్ అనుమానాలకు ఆస్కారం లేకుండా పోయింది.

‘జగన్మోహన్‌రెడ్డి.. విజయసాయిరెడ్డి.. మిథున్‌రెడ్డి’ ఇలా ముగ్గురు రెడ్లూ ఒకేకారులో వెళితే.. కారు బయట బీసీ ఎంపీ మాధవ్, దళిత ఎంపీ సురేష్ నిలబడటమే బాధాకరం. సీఎం జగన్ చెప్పే నా బీసీలు.. నా ఎస్సీలకు అసలైన అర్ధం ఇదే’’నని నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

‘‘ సీఎం జగన్ వేదికలపై చెప్పే నా బీసీలు, నా ఎస్సీలనే మాటలకు అర్ధమేమిటో ఆయన ఢిల్లీ వెళ్లి బీసీ-ఎస్సీల కళ్లు తెరిపించారు. ముగ్గురు రెడ్లు ఒకే కారులో వెళుతుంటే, కింద ఉన్న బీసీ,ఎస్సీల మనోభావాలేమిటో ఒక దళితుడిగా నాకు తెలుసు. ఏం? ఎస్సీ-బీసీ ఎంపీలు సీఎం గారి కారులో కూర్చునే అర్హత లేదా? పార్టీలు వేరయినా.. సీఎం గారి కారులో చోటు దొరకని నా ఎస్సీ-బీసీ మిత్రులకు నా సానుభూతి’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇలాంటి అవమానం మరెవరికీ ఎదురుకాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE