Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని మోడీ ప్రభావం అధికమే

-ఊహించని విజయం సాధించనున్న కూటమి
-మరోసారి ప్రధాని మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన ప్రజలు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరుగుతుండడం వల్ల కూటమి ఊహించని విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. తెదేపా, జనసేన కలయికతోనే పెను మార్పులు వచ్చాయని, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని బిజెపి ఆహ్వానించడం వల్ల, కూటమిలో బిజెపి కూడా చేరితే అద్వితీయ విజయం ఖాయమని పేర్కొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆజ్ తక్ , సి ఓటర్ సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాల వెల్లడి ద్వారా , వైకాపా నాయకత్వం వెన్నులో అణు బాంబు పేలినట్టయిందన్నారు. ఇటీవల తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైరాగ్యంతో పోతే పోతాం అని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఆజ్ తక్, సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీ బలంగా పుంజుకున్నట్టు పేర్కొనడం జరిగింది. తెదేపా తన ఓటు బ్యాంకును 45 శాతానికి పెంచుకుంది. జనసేనతో కలిసి ఆ పార్టీ 52 శాతం ఓటు షేర్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు . ఇక వైకాపా తన ఓటు బ్యాంకును తీవ్రంగా నష్టపోయింది . 50 శాతం కలిగిన ఆ పార్టీ ఓటు బ్యాంకు 41 శాతానికి పడిపోయింది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో, వైకాపా ఓటు బ్యాంకు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి.

గత మూడు నెలల క్రితం ఆజ్ తక్, సి ఓటర్ నిర్వహించిన మూడు ఆఫ్ ది నేషన్ సర్వేకు, ప్రస్తుత సర్వే ఫలితాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇంకొక రెండు నెలలు అయితే వైకాపా పరిస్థితి మరింత అద్వానం కానుంది. తెదేపా, జనసేన కూటమికి 17 పార్లమెంట్ స్థానాలు, వైకాపాకు 8 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆజ్ తక్, సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. తెదేపా, జనసేన కూటమితో బిజెపి కూడా జత కడితే కచ్చితంగా 21 స్థానాలకు పైగానే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.

ప్రతి ఏటా తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ ల రూపంలో టైమ్స్ నౌకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తున్నందుకు ప్రతిఫలంగా ప్రతిసారి సర్వేలలో ఆ సంస్థ యాజమాన్యం వైకాపాకు 25కు 25 స్థానాలు, లేదంటే 24 స్థానాలను కేటాయిస్తూ వచ్చేది. ఈసారి టైమ్స్ నౌ యాజమాన్యం కూడా మొహమాట పడినట్లు కనిపిస్తుంది. అందుకే ఈసారి సర్వే ఫలితాలలో వైకాపాకు 19 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది. భవిష్యత్తులో వాళ్లు కూడా ఆ సంఖ్యను తొమ్మిదికి కుదించే అవకాశాలు లేకపోలేదు. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది.

గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రజలు తాము చేసిన తప్పుకు కుమిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు వంటి అభివృద్ధి కాముకుడిని, కార్యదీక్షపరుడిని ఈసారి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే పోల్ స్టాటజిస్ట్ సర్వే సంస్థ తమ సర్వే ఫలితాలలో తెదేపా 19 నుంచి 20 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది.

తెదేపా కు నా దృష్టిలో కచ్చితంగా 21 స్థానాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకంటే తగ్గే అవకాశాలు లేవు. గతంలో ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా 140 అసెంబ్లీ స్థానాలు దక్కనున్నాయి. గత ఆరేడు నెలల క్రితం ప్రజలు నిర్భయంగా మాట్లాడే పరిస్థితిని కల్పించినప్పుడు వారి నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. ప్రజలు ఇప్పుడు బాహాటంగానే తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు నేకృత్వంలోని కూటమి ఈసారి ఒక అద్వితీయమైన విజయాన్ని సాధించబోతుందని రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు.

గతంలో పొగడడానికి పోటీపడేవారు… ఇప్పుడు ముఖం చాటేశారు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడడానికి పోటీపడే ఆయన వందిమాగాదులు ఈ ఈసారి ముఖం చాటేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోరం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే… వాస్తవ పరిస్థితి ఏమిటో వై కాపా నాయకత్వానికి ఈపాటి కే అర్థమై ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఈగలను తోలుకోవాల్సిందే.

ఎమ్మెల్యేలలో ఇంతలోనే ఎంత మార్పు వచ్చిందన్న ఆయన, ఇంట్లో కూర్చుని ఇన్నాళ్లు వీడియో గేమ్స్ ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇకపై పర్మినెంట్ గా వీడియో గేమ్స్ ఆడుకోవాల్సిందేనని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి వైపు కన్నెత్తి చూసేవారు ఉండరు. అసెంబ్లీలో పలకరించేవారు లేక, అటుగా వెళుతున్న వారిని పిలిచి అన్నా కాఫీ తాగుదామా? అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే మ్యాటర్ అర్థమయ్యే ఉంటుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

సీఎం లు అందరికీ రొటీన్ గానే అపాయింట్మెంట్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
పార్లమెంట్ ఆఖరి సమావేశాల సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిలకు రొటీన్ గానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇప్పటికే ప్రధానమంత్రి తో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు కూడా నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ అదేమంతా ప్రాధాన్యత ఉన్న అంశం కాదు.

కానీ బిల్డప్ ఇవ్వడానికి నీలి చానల్స్, సాక్షి మీడియా ఉండనే ఉంది. ప్రధానితో భేటీ అనంతరం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి భవతి భిక్షాందేహి అన్నట్లుగా అడుక్కోనున్నారు. ఆమె కూడా పెద్ద మనసు చేసుకొని కనికరించే అవకాశం ఉంది. దీనితో రానున్న రెండు, మూడు వారాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ లభించనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి నిన్న రోజంతా పడిగాపులు పడ్డారు. అయినా అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

బహుశా ఈ రోజు ప్రధానమంత్రి కలవమని చెబితే, హోం శాఖ మంత్రి అమిత్ షా, జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. లేకపోతే కలవకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వచ్చారో మాకు తెలియదా? అంటూ ప్రశ్నించిన ఆయన… ఎప్పుడూ చెప్పేది ఇదే కదా అంటూ మండిపడ్డారు .

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ కి వస్తే ప్రధానమంత్రిని కలవాలి కానీ హోం మంత్రిని ఎందుకు కలుస్తారని నిలదీశారు. ప్రధానమంత్రిని లేకపోతే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించాలి. అంతేకానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెంపర్లాడకూడదన్నారు. అయినా కేంద్రం హోం మంత్రి అపాయింట్మెంట్ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు . అయినా మీరు చెప్పే సొల్లు ఎవరు వినరని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

కాళ్లకు దండం పెట్టి కోరికలెన్ని కోరుకున్న ఏమీ జరగదు
ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభించడంతో జగన్మోహన్ రెడ్డి ఆయన కాళ్లకు దండం పెట్టుకుని తన మనసులోని కోరికలను కోరే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . అయినా, జగన్మోహన్ రెడ్డి కోరికలు తీరే అవకాశం లేదన్నారు. ఒక వ్యక్తిని జనాలు పట్టించుకోవడం లేదంటే అప్పుడే శకునాలు కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ 20 నిమిషాల పాటు టైం ఇచ్చారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు కలిసేందుకు కూడా
20 నిమిషాల పాటు సమయం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చిన సమయంలో ప్రధానమంత్రితో , కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా లు సమావేశం కావడం వల్ల దాదాపు అరగంటకు పైగానే జగన్మోహన్ రెడ్డి వేచి చూడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కి 11 గంటల సమయంలో అపాయింట్మెంట్ ఇవ్వగా, 11 గంటల యాభై నిమిషాలకు ప్రధానమంత్రి తో భేటీ అయ్యే అవకాశాన్ని ఇచ్చారన్నారు.

ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనపై ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెళ్ళువెత్తడానికి కారణం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేకపోవడమేనని రఘు రామ కృష్ణంరాజు సమాధానం ఇచ్చారు . జగన్మోహన్ రెడ్డి పాలనలో స్త్రీలు దారుణంగా మోసపోయారు. 50 రూపాయల కు లభించే క్వార్టర్ మద్యం సీసా ధరను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత , 200 రూపాయలకు పెంచేశారు. దీనితో మహిళలు దాచుకున్న డబ్బును వారి భర్తలు బలవంతంగా లాక్కునేలా చేశారు.

ఇక పురుషులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాసిరకం మద్యాన్ని సేవించి, ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక అవస్థలు పడ్డారు. ఉద్యోగస్తులకు 31 వేల 800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది . ఎంతమందికి తెలంగాణలోని హెచ్ఎండిఏ మాజీ అధికారి బాలకృష్ణకు ఉన్నట్లుగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రెక్కాడితే కానీ డొక్కనిండని ఉద్యోగులేనని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. అంగన్వాడీలను చావగొట్టి చెవులు మూశారు. ఆశా వర్కర్లను నిరాశకు గురి చేశారు. ముఖ్యమంత్రి కొంపలో కూర్చొని వెధవ వేషాలు వేయకుండా, ఆందోళనలు చేసేవారితో పిలిపించుకొని మాట్లాడితే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

సినిమాలో మాత్రం అర్ధరాత్రి కళ్ళు లేని వ్యక్తిని కలిసి ఆయన బాధలను వింటారు కానీ నిజ జీవితములో ఇచ్చిన హామీలు అమలు చేయమని ఆందోళనలు చేసే వారిపై పోలీసులను ప్రయోగిస్తారని మండిపడ్డారు. పోలీసులు కూడా ప్రభుత్వ వైఖరితో కడుపు మండి ఉన్నారు. వారికి డి ఏ లను పెండింగ్లో పెట్టారు.. ఒకవైపు ఆస్తి విలువలు తగ్గితే, మరొకవైపు ఆస్తి పన్ను ఇష్టారాజ్యంగా పెంచారు. సొంత మతాన్ని ప్రోత్సహించడానికి కొంతమంది పాస్టర్లకు జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చారు. ఆ పాస్టర్లు, ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టిన సలహాదారులు, ఇంట్లోని భార్యాపిల్లలు తప్ప తల్లి, చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంతోషంగా లేరన్నారు.

ఉచితంగా టికెట్లు ఇచ్చి, కూల్ డ్రింక్స్ కొనిపెట్టినా యాత్ర 2 సినిమా చూసేందుకు థియేటర్లలో జనమే లేరు
జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా రూపొందించిన యాత్ర 2 సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చి, కూల్ డ్రింక్స్ కొనిపెట్టిన థియేటర్లలో జనమే కనిపించడం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. యాత్ర సినిమా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కావడంతో, చనిపోయిన మంచి వ్యక్తి అని … ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. దానితో పెట్టిన పెట్టుబడి రికవరీ అయింది. జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లో పొడుగ్గా ఉన్న వ్యక్తి చేత ఆయన క్యారెక్టర్ వేయించినప్పటికీ, కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటనలను వక్రీకరించడం వల్ల ప్రేక్షకాదరణకు నోచుకోవడం లేదన్నారు.

సినిమాను చూడడానికి థియేటర్ కు ఒక్కరూ కూడా రావడంలేదని చెప్పారు. తిరుపతిలోని ఒక థియేటర్లో కేవలం ఒకే ఒక టికెట్ తెగినట్లు నాకు పరిచయం ఉన్న డిస్ట్రిబ్యూటర్ చెప్పారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కనీసం జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగా 175 స్థానాలకు గాను 175 సీట్లు కూడా యాత్ర 2 సినిమా కోసం థియేటర్లలో నిండడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొని ప్రేక్షకులకు ఉచితంగా అందజేసి , కూల్ డ్రింక్స్ కొనుగోలు కోసం వంద రూపాయలు కవర్లో పెట్టి ఇస్తున్నప్పటికీ, థియేటర్లలోకి జనం వెళ్లడం లేదన్నారు.

చివరకు, సినిమా మొత్తం చూస్తే 500 రూపాయల ప్యాకేజీ ప్రకటించిన, థియేటర్లోకి వెళ్లేవారే ఉండరన్నారు. జగన్మోహన్ రెడ్డి భక్తులు సినిమా తిలకించడానికి తెగ వచ్చేస్తారనుకుంటే, సినిమా హాళ్లలో సింగల్ పర్సన్ లేకపోవడం వల్ల మ్యాట్నీ షోలను రద్దు చేసినట్లు తెలిసిందన్నారు. కలెక్షన్లు లేవు, టికెట్లు అమ్ముడు పోయిన థియేటర్లలో జనం లేరు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో అందరికీ తెలియక పోయినప్పటికీ, నాలాంటి కొంతమందికి తెలుసు . కలకత్తాలో ఉంటే వెతికి వెతికి పట్టుకొని విషయం చెబితే, రాజశేఖర్ రెడ్డి దుర్మరణానికి గురైన సంఘటనా స్థలానికి ఆయన వెళ్లలేదు.

ఎమ్మెల్యేలను పోగేసి తానే సీఎం అని సంతకాలను చేయించుకున్నారు. యాత్ర 2 సినిమాలో మాత్రం రాజశేఖర్ రెడ్డి దుర్మరణానికి గురైన సంఘటనా స్థలానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లినట్లుగా, అక్కడ ఆయన చేతికి ఒక కాగితం దొరికినట్లుగా చూపించారు. ఆ కాగితములో ఇచ్చిన మాట తప్పవద్దని రాసి ఉన్నట్లుగా చూపించారు. మావాడు మాట తప్పే టైపు అనుకొని, రాజశేఖర్ రెడ్డి కాగితంపై అలా రాసిపెట్టి వెళ్లిపోయారేమోనన్న ఆయన, ఆ కాగితం చూసి జగన్మోహన్ రెడ్డిలో పెను మార్పు వచ్చిందంట అని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడం పనిగా పెట్టుకున్నారేమోనని రఘురామకృష్ణం రాజు అపహస్యం చేశారు.

ఈ చిత్రంలో జగనన్న వదిలిన చెల్లి బాణం గురించి ప్రస్తావన లేనేలేదు. పాదయాత్ర ఎపిసోడ్ అంతా విజయమ్మ పైనే చూపించారు. అలాగే కోడి కత్తి శ్రీను ఎపిసోడ్ కూడా ఎత్తివేశారు. కోడి కత్తితో శ్రీను పొడిచినట్లుగా నైనా చూపించాలి కదా అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, ఎందుకులే కాంట్రవర్సీ అని వదిలేసి ఉంటారన్నారు . జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించినట్లుగా చూపించారు కానీ ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన గొడ్డలితో బాబాయ్ హత్య, కోడి కత్తి ఎపిసోడ్ లేకుండా చేశారన్నారు . వ్యూహం సినిమా సెన్సార్ ఎట్టకేలకు క్లియర్ అయింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఈ చిత్రం టైం పాస్ కు చూడడానికి బాగా ఉన్నప్పటికీ, ప్రేక్షకాదరణకు నోచుకోదు. దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. శివ, రంగీలా, క్షణక్షణం , సర్కార్ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఆయన వ్యూహం సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ సరికాదు. యాత్ర 2 డిజాస్టర్ గా థియేటర్ లో నుంచి వెళ్లే సమయానికి, వ్యూహం ప్రేక్షకుల ముందుకు వస్తుందేమోనన్నారు.

పీవీకి భారతరత్న… వచ్చే ఏడాదిలోనైనా ఎన్టీ రామారావుకు భారతరత్న వస్తుందని ఆశిద్దాం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావుకు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు లకు భారతరత్న అవార్డు ప్రకటించాలని ప్రతి ఒక్క తెలుగు వారు కోరుకున్నారు. తెలుగువారి ఆకాంక్ష మేరకు పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు లభించినప్పటికీ, వచ్చే ఏడాదిలోనైనా ఎన్టీ రామారావు ను భారతరత్న అవార్డు వరిస్తుందని ఆశిద్దాం.

జీవిత కాలం అంతా వ్యవసాయరంగ అభివృద్ధికి, రైతులకు మద్దతు ధరకు , వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం పరితపించిన ఎమ్మెస్ స్వామినాథన్ తో పాటు, రైతు పక్షపాతి అయిన చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ పరిణామమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఇటీవల కర్పూరి ఠాగూర్, బిజెపి అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు

LEAVE A RESPONSE