Suryaa.co.in

Editorial

మిస్‌ఫైర్ అవుతున్న కవిత స్లో‘గన్స్’

– కవితకు అక్కరకు రాని ‘తెలంగాణ’.. ‘ఆంధ్రా’..బీసీ’ కార్డు!
– బెడిసికొడుతున్న జ్యోతిరావు ఫూలే కార్డు
– రేవంత్ నియామకాలపై కవిత అభ్యంతరాలు
– ఆంధ్రావాళ్లను నియమిస్తున్నారంటూ ఆరోపణలు
– జై తెలంగాణ అనకపోవడంపైనా ఆగ్రహం
– మహేందర్‌రెడ్డి నియామకంపైనా కవిత విమర్శలు
– పార్టీలో మాయమైన ‘తెలంగాణై’పె కాంగ్రెస్ ఎదురుదాడి
– కేసీఆర్ జమానాలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు
– ‘మెగా’ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు ధారాదత్తం
– ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు సబ్ కాంట్రాక్టు పనులు
– పదేళ్లలో ఫూలే విగ్రహం ఎందుకు పెట్టడలేదని ప్రశ్నాస్త్రాలు
– అరిగిపోయిన రికార్డుపై ఆశలెందుకంటూ వ్యంగ్యాస్త్రాలు
– బీఆర్‌ఎస్ తెలంగాణ పార్టీ కాదుకదా అని ఎదురుదాడి
( మార్తి సుబ్రహ్మణ్యం)

కేసీఆర్ కూతురు కవిత వాగ్దాటి గల నాయకురాలు. ఏ అంశంపైనయినా అనర్గళంగా మాట్లాడే దిట్ట. మీడియాను ఎలా ఆకర్షించాలో ఆమెకు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియకపోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. సమస్యలు ఎదురైనప్పుడు, ఆమెకు ఒక కార్డు ఎవ‘రెడీ’గా ఉంటుంది. ఆ కార్డుతోనే ఆమె ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేస్తుంటారు. ఆ కార్డుతోనే బయటపడుతుంటారు. యూట్యూబ్‌లో ప్రముఖ జర్నలిస్టులతో ఆమె ఇంటర్వ్యూలు చూస్తే, ఆ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది.

అయితే కథ మారింది. కాలం మారిపోయింది. కార్డులు పనిచేయడం మానేశాయి. వాటికీ ఎక్సపైరీ డేట్లు వచ్చేశాయి. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లయి పోయాయి. పదేళ్లు తెలంగాణను రాజులా పరిపాలించిన కేసీఆర్, రెండు నెలల క్రితమే మాజీగా మారిపోయారు. రేవంత్‌రెడ్డి సీఎంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ఇప్పుడు 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షం. అందులో ఓ రెండు డజన్ల మంది ‘నియోజకవర్గ అభివృద్ధి’ కోసం.. అధికార నావలో పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక ఎంపి.. పార్టీ బాల్చీ తన్నేసి కాంగ్రెస్‌లోకి జంపయిపోయారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అది వేరే విషయం.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ తెలంగాణ కార్డు వాడేందుకు, కవిత చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ కార్డుతో తనను రక్షించుకోవడంతోపాటు, కాంగ్రెస్‌ను శిక్షించేందుకు చేస్తున్న ఆమె చేస్తున్న పోరాటం.. కేవలం ఆరాటంగానే కనిపిస్తోంది. అందుకోసం ఆమె జమిలిగా వాడుతున్న ఆంధ్రా-తెలంగాణ-బీసీ కార్డులు పనిచేయడం లేదు. పైగా కవిత వ్యాఖ్యలు బూమెరాంగయి, బీఆర్‌ఎస్‌నే ఇరుకున పెడుతున్నాయి. కారణం.. కేసీఆర్ పదేళ్ల రాజరికంలో ఆ ‘మూడు’ను అటకెక్కించారు కాబట్టి!

అసెంబ్లీ ప్రాంగణంలో బీసీ బాంధవుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం నెలకొల్పాలని, కవిత ఇటీవలి కాలంలో ఎలుగెత్తి నినదిస్తున్నారు. ఆ మేరకు స్పీకర్-శాసనమండలి చైర్మన్‌ను కలసి, వినతిపత్రాలు ఇచ్చారు. ఫూలే విగ్రహం ఎందుకు పెట్టరు? బీసీలంటే ఇదేనా మీ చిత్తశుద్ధి? అంటూ రేవంత్ సర్కారుపై ప్రశ్నలవర్షం కురిపించారు.

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం పక్కన, మహాత్మాఫూలే పెట్టాలని డిమాండ్ చేయడం మంచిదే. దానిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు, నిర్నిరోధంగా గద్దెమీద ఉన్నది కవిత కుటుంబమే. ఆ పదేళ్లలో కేసీఆర్ కత్తికి ఎదురేలేదు. అసలు ఆర్ధిక శాఖ అనుమతి లేకుండానే.. ఎన్నికలకు ముందు నిబంధనలకు పాతరేసి, 50 కోట్లకు పైగా అడ్డగోలుగా.. ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసేంతగా, అధికారం అనుభవించిన కుటుంబం కేసీఆర్‌ది.

ఆ కథ కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. చిన్న సారు చెబితేనే డబ్బు ఖర్చు పెట్టామని.. అప్పట్లో చిన్నసారుకు అన్నీ తానయి నడిపించిన ఓ ఐఏఎస్ ఆఫీసరు, ఎంచక్కా రాతపూర్వక వివరణ ఇచ్చి, చిన్నసారును అడ్డంగా ఇరికించారు. ఆ విచారణ ఏమవుతుందన్నది వేరే కథ.

పాత సచివాలయాన్ని కూలగొట్టి, రాజుల కాలాన్ని గుర్తుకు తెచ్చేలా వందల కోట్లతో కొత్త సచివాలయం నిర్మించారు. వేల కోట్ల అంచనా నుంచి, లక్ష కోట్లకు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఆధునిక మోక్షగుండం విశ్వేశ్వరయ్య కేసీఆర్. అలాంటి మహాశక్తి అందులోనూ బోలెడు బొక్కలను రేవంత్ సర్కారు రంధ్రాన్వేషణ చేసి జనంలోకి వదులుతోంది. అది వేరే విషయం.

అప్పట్లో సంపన్న రాజ్యాధిపతి కేసీఆర్ తలచుకుంటే, అసెంబ్లీలో ఫూలే విగ్రహ నిర్మాణం పదిరోజుల పని. అవసరమైతే కాళేశ్వరం మాదిరిగా, ఫూలే విగ్రహానికీ ఆయనే డిజైన్లు ఇచ్చేవారు. ఒకవేళ ఆయన ఫూలే విగ్రహాన్ని వందకోట్లతో కట్టినా, అప్పుడు అడిగే మొనగాడెవరూ లేరు. ఇదేమని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు.

మరి అప్పుడు ఇదే కవిత.. తండ్రి వద్దకు వెళ్లి, ‘‘నాన్నారూ.. నాన్నారూ.. అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టి బీసీలను ఎందుకు ఉద్ధరించరు? బీసీ బంధు పెట్టిన మీరు బీసీ బాంధవుడైన ఫూలే విగ్రహం ఎందుకు ప్రతిష్ఠించలేద ’’ని, ఎందుకు అడగలేదనేది మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రశ్న. అధికారంలో ఉన్న పదేళ్లూ ఫూలే విగ్రహం పెట్టకుండా ఎవరు అడ్డుపడ్డారు? మరి ఆ పదేళ్లూ కవిత ఏం చేస్తుంది? గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా అంటూ మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రశ్నలతో కవితక్కను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రశ్నలతోనే ఊపిరాడకపోతున్న నేపథ్యంలో, అటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ‘‘మీకు బీసీలపై అంత ప్రేమ ఉంటే కేసీఆర్‌ను తప్పించి పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వొచ్చు కదా? పోనీ పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవైనా ఇప్పించాలి కదా? నువ్వెందుకు ఆ పని చేయలేవు? అని, తన శైలిలో అనర్గళంగా ప్రశ్నల వర్షం కురిపించి, కవితమ్మను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.

ఇక కొత్తగా కవిత సంధించిన ఆంధ్రా కార్డు ఏమైనా, పార్టీకి అక్కరకు వచ్చిందా అంటే అది కూడా అడ్డం తిరిగింది. తెలంగాణ సర్వీస్ కమిషన్‌లో ఆంధ్రాకు చెందిన వ్యక్తిని ఎలా నియమిస్తారు? విద్యుత్తు సంస్థలో ముగ్గురు ఆంధ్రా అధికారులను డైరక్టర్లుగా ఎలా నియమిస్తారు? ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి కోసం వాదించిన లాయర్‌ను ప్రభుత్వ లాయర్‌గా ఎలా నియమించారు? వీళ్లంతా తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడతారు? ఇవీ సీఎం రేవంత్‌పై కవితక్క సంధించిన ప్రశ్నలు.

అంతేనా? ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని, సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమిస్తారు? ఆయనపై జ్యుడిషియల్ ఎంక్వెరీ వేయాలి కదా? బీఆర్‌ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డిపై, రేవంత్ ఆరోపణలు చేశారు కదా? ఇప్పుడు చైర్మన్ పదవి ఎలా ఇచ్చారన్నది కవిత లాజిక్ పాయింట్. ఇక హరీష్‌రావు అయితే… అసెంబ్లీలో మీ బడ్జెట్‌ను ఆంధ్రాలో రిటైరన ముగ్గురు అధికారులతో తయారు చేయించారు. వాళ్ల పేర్లు చెప్పమంటే చెబుతా అంటూ మరో రహస్యం విప్పారు.

ఇందులో కవిత వాదనను తప్పుపట్టాల్సిందేమీ లేదు. అయితే పదేళ్ల కేసీఆర్ రాచరికపు పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో సింహభాగం పనులు దక్కించుకున్న వాళ్లంతా, ఆంధ్రా బడా కాంట్రాక్టర్లేనన్న విషయం బహుశా కవిత మర్చిపోయి ఉండాలి. మేఘా ఇంజనీరింగ్, పీఎల్‌ఆర్ వంటి అరడజను కంపెనీలు అనేక ప్యాకేజీల్లో కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టు పనలు దక్కించుకున్నాయి. బస్వాపూర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రా కాంట్రాక్టరుకే అప్పగించారట. ఆంధ్రా మంత్రులు-వైసీపీ ఎమ్మెల్యేలు-సీమ నేతలకు, నాటి కేసీఆర్ సర్కారు జగనన్న మాట మీద ఉదారంగా కాంట్రాక్టులిచ్చారు.

రేవంత్‌రెడ్డి సర్కారుకు తెలివిలేదుకాబట్టి సరిపోయింది. ఉంటే కేసీఆర్ జమానాలో లబ్థిపొందిన ఆంధ్రా కాంట్రాక్టర్ల జాబితా- కేసీఆర్ హయాంలో లబ్థిపొందిన ఇతర రాష్ట్రాల కంపెనీల జాబితా విడుదల చేసి ఉంటే, కవిత అండ్ కో పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో ఇలాంటి పనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. ఆయన తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్న ఆంధ్రా కాంట్రాక్టు కంపెనీల బాగోతం బయటపెట్టారు.

రేవంత్ సర్కారుకు ఇంకా అంత తెలివి వచ్చినట్లు లేదు. రాష్ట్రంలో అనేకమంది తెలంగాణ కాంట్రాక్టర్లు.. జీహెచ్‌ఎంసీ సహా అనేక శాఖల్లో వేల కోట్లరూపాయల పనులు చేస్తే, వారికి ఈనాటికీ బిల్లులలకు తెరవు లేదు.వారంతా తెలంగాణకు చెందిన మధ్య తరహా కాంట్రాక్టర్లే. కానీ ‘మెగా’ కాంట్రాక్టర్లకు మాత్రం, ఠంచనుగా బిల్లులిచ్చిన ఘనత బీఆర్‌ఎస్ పాలకులది.

జీహెచ్‌ఎంసీలో 1000 కోట్ల రూపాయల పనులు చేసిన తెలంగాణ కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిన కేసీఆర్ సర్కారు.. ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకు మాత్రం పువ్వుల్లో పెట్టి అప్పగించిన విషయం కవిత మర్చిపోవడమే ఆశ్చర్యం. ఫలితంగా గ్రేటర్‌లో పనులు చేస్తున్న చిన్నా చితకా తెలంగాణ సబ్ కాంట్రాక్టర్లలో, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది. దానికి బాధ్యులెవరన్నది ప్రశ్న.

తెలంగాణలో ఆంధ్రా వాళ్ల నియామకాలపై, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కవిత.. ఉత్సాహంలో మరో కోణం మర్చిపోయినట్లున్నారు. టీఆర్‌ఎస్ పేరులో ఉన్న తెలంగాణ పదం తీసేసి, బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సందర్భంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి సీఎం ఓఎస్‌డి పదవి ఇచ్చిన విషయం కవిత మర్చిపోవడమే వింత. ఆంధ్రాకు చెందిన అధికారులను జగన్ సిఫార్సుతో డెప్యుటేషన్‌పై తీసుకున్న విషయం కూడా కవిత విస్మరించడమే వింత.

అధికారం కోల్పోయిన తర్వాత ఆంధ్రాకార్డును, ఇంతగా వాడుతున్న కవిత.. తన బీఆర్‌ఎస్ పార్టీకి ఏకంగా ఆంధ్రాకు ఒక రాష్ట్ర అధ్యక్షుడినే నియమించడమే ఆశ్చర్యం. పోనీ అధికారం కోల్పోయిన తర్వాత, ఆంధ్రా-మహారాష్ట్ర శాఖలు రద్దు చేశారా అంటే అదీ లేదు. జాతీయ పార్టీగా కొనసాగుతూ… తన పేరులోని తెలంగాణ పదాన్ని తొలగించిన బీఆర్‌ఎస్, మళ్లీ ఆంధ్రా-తెలంగాణ కార్డు వాడటం నవ్వులపాలవుతోంది.

తెలంగాణ ఏర్పడి పదేళ్లయిపోయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో, తెలంగాణ పేరుతో పార్టీ పేరు పెట్టిన టీఆర్‌ఎస్, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. ఆ తర్వాత తెలంగాణ పేరు తొలగించి ‘భారత’ అని చేర్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే తెలంగాణ కోసం జరిగిన పోరాటానికి తెరపడి, పదేళ్ల పైనయిపోయింది. స్వయం పాలన మొదలయి కూడా అన్నే ఏళ్లయిపోయింది. అయినా ఇంకా రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అనడం లేదని ఆక్షేపించడమే వింత.

ఇప్పుడు ఉద్యమాలు లేవు. నినాదాలు లేవు. అయినా ఏ ముఖ్యమంత్రి కూడా, తన రాష్ట్రానికి జై కొడుతూ మాట్లాడరు. పక్కనే ఉన్న ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ జై ఆంధ్ర అనలేదు. అటు పక్కనే ఉన్న మహారాష్ట్ర సీఎం కూడా జై మహారాష్ట్ర అన్న దాఖలాలు లేవు. పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్ సీఎం గానీ, సరిహద్దుకు ఆనుకుని ఉన్న కర్నాటక సీఎం గానీ, వారి రాష్ట్రాల పేర్లు చెప్పి ఎప్పుడూ జై కొట్టలేదు.

ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు ఆ కార్డు అక్కరకొచ్చింది కాబట్టి, దానికి ఆ నినాదమే మనుగడ. జాతీయ పార్టీలకు అలాంటి అవసరం ఉండదు. పోనీ ఇప్పుడు బీఆర్‌ఎస్ పేరులో, తెలంగాణ ఉందా అంటే అదీ లేదు. మరి కవిత లేవనెత్తే ఈ కార్డులన్నీ, రాజకీయ మనుగడ కోసమేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చిన తర్వాత.. జాతీయవాది అవతారమెత్తిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను, రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు తిరిగి కవితపైనే ఎక్కు పెట్టడం ఆసక్తికరం. బేసిన్లు లేవు. భేషజాలు లేవు. ఈ నీళ్ల పంచాయితీలేంది? కేంద్రమే రాష్ట్రాల మధ్య కుక్కల పంచాయితీ పెడుతోంది. మనం ఇప్పుడు జాతీయ కోణంలో ఆలోచించాల’’ని, ‘జాతీయనేత’ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను.. సీఎం రేవంత్ స్వయంగా సభలోనే గుర్తు చేయడం, కవితను మరింత ఇరుకున పెట్టాయి.

మొత్తంగా అధికారం కోల్పోయిన తర్వాత… కవిత లేవనెత్తుతున్న ఆంధ్రా-తెలంగాణ-బీసీ కార్డులేవీ పనిచేయకపోగా, బూమెరాంగవుతున్నాయన్నది సుస్పష్టం. బీజేపీ నేత రఘునందన్‌రావు డిమాండ్ చేసినట్లు.. ఇప్పుడు టీఆర్‌ఎస్ తనకు వచ్చే ఒక రాజ్యసభ సీటును, బీసీ అయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇస్తుందా? లేకపోతే అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవి ఇస్తుందా? అదీ కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తుందా అన్నదే కవిత విప్పాల్సిన చిక్కు ప్రశ్న.

‘ఒక నారీ వందతుపాకులు’ సినిమా తరహాలో.. ఒక డిమాండ్.. వంద ప్రశ్నలన్నమాట! చూడాలి.. కవిత తన పలుకుబడి ఉపయోగించి, బీసీలకు పార్టీలో ఏ పదవి ఇప్పిస్తారో?!

LEAVE A RESPONSE