-సత్య కుమార్ పై దాడిని పార్లమెంటులో నిరసిస్తా
-ప్రతిపక్ష పార్టీలపై దాడులు రాష్ట్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ టెర్రరిజమే
-అక్కడేమో రుణం… ఇక్కడేమో రణం
-దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
-మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మోసగించిన మమ్మల్ని నిలదీయండి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
ప్రతిపక్షాల పార్టీల నాయకుల పై దాడులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని, పోలీసు స్వామ్యం మాత్రమే నడుస్తుందన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో తన నివాసంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…బిజెపి జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ కో కన్వీనర్ సత్య కుమార్ వంటి నాయకుడిపై దాడి చేయాలనేది స్థానిక టుంబ్రీ నేతలు తీసుకున్న నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి అయినా ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి. లేదంటే, ముఖ్యమంత్రి కంటే ఉన్నత పదవిలో ఉన్న సకల శాఖ మంత్రి అయినా ఈ నిర్ణయం తీసుకొని ఉండాలి. రాష్ట్ర రాజధాని గా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, గత 1200 రోజులుగా దీక్ష చేస్తున్న అమరావతి రైతు కుటుంబాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుహాజరు కాకపోయినప్పటికీ , తమ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చే ప్రయత్నాన్ని సత్య కుమార్ చేశారు. అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి తిరుగు ప్రయాణమైన సత్య కుమార్ వాహనాన్ని పోలీసులే ఆపి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది.
పోలీసుల సమక్షంలోనే సత్య కుమార్ వాహనంపై దున్నా నితిన్ అలియాస్ జక్రయ్య రాయితో దాడికి ప్రయత్నించగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి అధికార పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు అనరాని మాటలు అన్నారు. పోలీసులే వాహనాలను ఆపి ఆదినారాయణ రెడ్డి అనుచరులపై దాడులు చేయించారు. లిక్కర్ తాగి నిక్కర్ వేసుకున్న బ్యాచ్ ఆదినారాయణ రెడ్డి అనుచరుడు యాదవ్ పై దాడి చేశారు. నిక్కర్ బ్యాచ్ దాడి నుంచి బాధితులని రక్షిస్తున్నట్లుగా పోలీసులు కూడా అద్భుతంగా నటించారు. బుద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేష్ పై దాడి చేసి, చొక్కాను నిక్కర్ బ్యాచ్ చింపి వేశారు. ఆదినారాయణ రెడ్డి గనుక వారి కంటపడి ఉంటే చంపి వేసి ఉండేవారేమో?. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, తెలుగుదేశం పార్టీలో చేరినందుకే ఆయనపై దాడి చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. అయితే, గతంలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తే మాత్రం మంచివారు… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, టిడిపికి మద్దతునిస్తే మాత్రం చెడ్డవారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
అమరావతి మద్దతు తెలిపిన కేంద్రం
రాజధానిగా అమరావతికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం,ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేసింది. సత్య కుమార్ పై వాహనంపై రాళ్ల దాడి అనంతరం ఒక మంత్రి మాట్లాడుతూ ప్రజల మనోభావాలను తెలుసుకోవలసిన అవసరం లేదా? అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అమరావతి ప్రాంతంలో కిరాయి దీక్షా శిబిరాన్ని నడుపుతూ ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుంచి పది మందిని తీసుకువచ్చి ఆ శిబిరంలో కూర్చోబెడుతున్నారు. మూడు రాజధానుల కోసం దీక్ష చేయాలి అంటే, విశాఖపట్నంలో, కర్నూల్ లో చేయాలి. అంతేకానీ అమరావతిలో కిరాయి దీక్షా శిబిరం ఏర్పాటు చేయడం సరి కాదని సదరు మంత్రి గుర్తించాలి. అమరావతి నుంచి సచివాలయాన్ని ఎత్తివేసి, విశాఖపట్నంలో నిర్మించాలని స్థానికులు ఎవరైనా కోరుకుంటారా?, రాష్ట్ర హైకోర్టును అమరావతిలో కాదని కర్నూల్లో ఏర్పాటు చేయమని అడుగుతారా?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు లేకపోగా, కిరాయి వ్యక్తుల దీక్షా శిబిరం వద్ద డీఎస్పీ నేతృత్వంలో 100 మంది పోలీసులు ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలకు వివరిస్తూ, విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఆయన అభిమానులకు కోపం రాదా అని దిక్కుమాలిన మంత్రి కానీ ఓ మంత్రి అనడం హాస్యాస్పదంగా ఉంది. సత్య కుమార్ తో పాటు, ఆ పార్టీ నేతలపై జరిగిన రాళ్ల దాడిని అధికార పార్టీ నేతలు సమర్థించడం సిగ్గుచేటు. దానికి సాక్షి మీడియా వంత పాడడం దారుణం. మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, ఎవరు అడ్డుకోలేరని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. రాజధాని అంశంపై న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? ఆ విషయాన్ని న్యాయస్థానమే తేలుస్తుంది. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతియే రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి రాష్ట్ర ప్రజలను మోసం, దగా చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడకు మకాం మార్చుకోవచ్చు. అంతేకానీ రాజధాని మారుస్తానంటే చట్టము అంగీకరించదు. రాష్ట్ర రాజధాని అమరావతియేనని ఎన్నికలకు ముందు తమ పార్టీ నాయకులు, తనతో సహా అందరూ చెప్పిన వారే. ఈ వయసులో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కు పదవీ కాంక్ష ఏమిటో అర్థం కావడం లేదు.
గతంలో, ముఖ్యమంత్రి ఏమి మాట్లాడారో ఆయన కూడా, ఇప్పుడు చెప్పడం లేదు. రాష్ట్ర ప్రజలు తమ నెంబర్ వన్ కూలీగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. అంతేకానీ, ఆయన తనకి ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై కేసులు పెట్టి, చంపి వేస్తారా?,. గతంలో మంచి చెప్పినందుకు తనపై దాడి చేశారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలపై దాడికి ఎత్తుగడవేశారు. మేకపాటి విక్రం రెడ్డి చాలెంజ్ చేస్తే పారిపోయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని సాక్షి మీడియా వార్తా కథనాన్ని రాయడం హాస్యాస్పదంగా ఉంది. అదే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చౌరస్తాలో కూర్చున్నప్పుడు ఎందుకు సాక్షి దినపత్రికలో ఆ వార్తా కథనాన్ని ప్రచురించలేదని రఘురామకృష్ణం రాజు నిలదీశారు.
అవకాశం దొరికితే జీరో అవర్లో ప్రస్తావిస్తా
సత్య కుమార్ పై దాడి ఘటనను అవకాశం దొరికితే పార్లమెంట్ జీరో అవర్లో ప్రస్తావించి తన నిరసనను వ్యక్తం చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గతంలో తనపై దాడి జరిగిందని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు విచారించలేదు. అదే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ఈగ వాలిన, దోమ వాలిన స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వెళుతుంది.
ఇతర విషయాలు ఏమైనా మాట్లాడండి కానీ దాడి విషయం గురించి మాట్లాడవద్దని తనపై ఆంక్షలు విధిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనని కొట్టినప్పుడు వదిలివేశారు. ఇప్పుడు మిమ్మల్ని కొట్టడానికి చంపడానికి రెడీ అయ్యారు. పాముకు పాలు పోయవద్దని పెద్దలు చెబుతూనే ఉంటారు. పాలు పోసిన చేతినే పాము కాటు వేస్తుందన్నట్లుగా శాంపిల్ కు మావాడు రుచి చూపించాడని జగన్మోహన్ రెడ్డి పై పరోక్షంగా రఘురామకృష్ణం రాజు విమర్శలు చేశారు.
ఇప్పటివరకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 96, 273 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 96, 273 కోట్ల రూపాయల అప్పులు చేసింది. దేశంలోనే అప్పులు చేసిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఆర్బిఐ బాండ్లు 60, 478 కోట్లు, లిక్కర్ బాండ్లు 8, 305 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నాబార్డ్ నుంచి 40 కోట్లు కోట్లు, కార్పొరేషన్ల పేరిట 19,695 కోట్లు, ఆసరా సంక్షేమ పథకం అమలు కోసం విద్యుత్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులకు లిక్కర్ బాండ్లను గ్యారెంటీగా చూపించి 3600 కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 155 కోట్ల రూపాయల ఈ ఎస్ఐ నిధులను విడుదల చేయగా, వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే నాలుగు రెట్లు పెద్ద రాష్ట్రం అయినా ఉత్తరప్రదేశ్ కేవలం 32వేల కోట్ల రూపాయల అప్పులు చేయగా, ఆంధ్ర ప్రదేశ్ మాత్రం అంతకు మూడింతల ఎక్కువ అప్పులు చేయడం సిగ్గుచేటు. అప్పు చేసిన డబ్బులు ఏమి చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. బటను నొక్కాను… బటన్ నొక్కాను అని చెబుతున్న ముఖ్యమంత్రి, గత నాలుగేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలను మాత్రమే బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా విడుదల చేశారు. అందులోనూ 60 వేల కోట్ల రూపాయల వృద్ధాప్య పింఛన్లను బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా అందజేయలేదు. ముఖ్యమంత్రి నేరుగా బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా నిధులను విడుదల చేస్తున్నప్పుడు, జిల్లాల వారిగా మంత్రులు బటన్ నొక్కి నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
విజయవంతంగా కొనసాగుతున్న జగనన్న డ్రామా కంపెనీ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన డ్రామాలతో ప్రజలను విజయవంతంగా మభ్యపెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పర్యటనలో భాగంగా చుట్టూ పూర్తి రక్షణ వలయం ఉండగా, ఎక్కడ నుంచో అంబులెన్స్ వచ్చినట్లు, దానికి ఆయన దారి ఇచ్చినట్లు నటించడం… దాన్ని సాక్షి మీడియా మానవత్వాన్ని చాటుకున్న జగన్ అని ప్రచారం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇక కాన్వాయ్ ఆయన వెళ్తుండగానే వీల్ చైర్ లో ఒక వికలాంగుడు, మానసిక వికలాంగుడు ముందుకు రావడం, వారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఆప్యాయంగా మాట్లాడినట్లు నటించడం, విసిటింగ్ కార్డును వారి చేతిలో పెట్టడం ఎన్నో చూశాము. గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేశారు. ఈ సందర్భంగా వీల్ చైర్ లో కూర్చున్న వారిని జగన్మోహన్ రెడ్డి , పలకరించిన వీడియోను రఘు రామకృష్ణంరాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు తీరేది కాదు
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీరేవి కావు. ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే ముఖ్యమంత్రి అస్తవ్యస్తం చేశారు. రేపు మరొక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ అప్పులను తీర్చడం అంత ఆషామాషీ ఏమీ కాదు. అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 15 శాతం మున్సిపల్, ఆస్తి పన్నులను పెంచుతుంది. హైదరాబాదు వంటి నగరంలో ఆస్తుల విలువ పెరిగిందని పన్నులు పెంచడం పరిపాటి. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30 నుంచి 50 శాతం ఆస్తుల విలువ పడిపోయింది. అయినా ఆస్తి పన్ను పెంచుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రికి రుణ, రణదాహం ఎక్కువయింది. పుట్టపర్తిలో రఘునాధ రెడ్డి పై తమ పార్టీ నాయకులు దాడి చేయగా, ఆయన స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న లను ప్రభుత్వమే హత్య చేసింది. హత్య చేశారని సిబిఐ అభియోగం ఎదుర్కొంటున్న వారి గురించి అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న మరణాల గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్య కృత్యమయ్యాయి. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లని అంగట్లో సరుకు లాగా కొనుగోలు చేయాలన్నది మన ఫిలాసఫీయా?, అందుకే, మనకు ఓట్లు వేసినా దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడడం లేదా?? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
రియల్ లైఫ్ నేచురల్ స్టార్ జగన్ అయితే… రీల్ లైఫ్ లో మాత్రమే నాని నేచురల్ స్టార్
రియల్ లైఫ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేచురల్ స్టార్ అయితే , రీల్ లైఫ్ లో మాత్రమే కథానాయకుడు నాని నేచురల్ స్టార్ అని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. ఎన్నికలకు ముందు మధ్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, గత నాలుగేళ్లలో మద్యం ధరలను విపరీతంగా పెంచి, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు. నాసిరకం మద్యం సేవించి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంలో రసాయనాల అవశేషాలు ఉన్నాయని తేలింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అదే చెత్త మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయించడం వల్ల మద్యపాన ప్రియుల జేబులు గుల్ల అవుతున్నాయి., ప్రాణాలు పోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే విక్రయించేవారు.
కానీ ప్రస్తుతం అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా ఒక కుటుంబానికి పాతిక వేల రూపాయలు అందజేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, మరొక పక్కా మద్యపాన ప్రియుల జేబుల్లో నుంచి ఏడాదికి 72 వేల రూపాయలను లాగేస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాను మహిళా లోకం అంతా చూడాలి. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, చేయకుండా హామీని తుంగలో తొక్కిన తమ ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇంటికి ఎంత నగదు లబ్ధి చేకూర్చామో వివరించేందుకు ప్రజాప్రతినిధులు త్వరలోనే ఇంటింటికి రానున్నారు. అమ్మ ఒడి, ఆసరా ద్వారా వారు ఇచ్చింది ఎంతో చెబుతూనే, మద్యం ద్వారా పెరిగిన విద్యుత్తు, ఆస్తి పన్నుల ద్వారా ఎంత వసూలు చేస్తున్నారో కౌంటర్ బిల్లులను ఇచ్చి తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు జ్ఞానోదయం, కనువిప్పు కలిగించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ప్రశ్నించడం ద్వారానే మార్పు సాధ్యం. బోయవాడు వాల్మీకి గా మారినట్లు, ప్రజలు ప్రశ్నించడంతో జగన్మోహన్ రెడ్డి ఏమైనా మారుతారేమో చూడాలని అన్నారు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అరెస్టు చేస్తామని చెప్పిన వారిని అరెస్టు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది.
వారిద్దరి అరెస్టులను ఎవరు ఆపలేకపోవచ్చు. వాస్తవాలను వెలుగులోకి తీసుకు వస్తున్న ఈనాడు దినపత్రిక పై రాష్ట్ర ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుంది. ఈనాడు, మార్గదర్శి కంపెనీల ఆడిటర్ కు నోటీసు ఇచ్చి, కేవలం సమాచారం తెలుసుకుంటామని పిలిపించి, కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేశారు. ఆ చిత్రహింసలను తాళలేక బాత్రూమ్ లోకి వెళ్లి గాజు ముక్కతో గొంతు కోసుకునే ప్రయత్నాన్ని ఆయన చేశారు. అయితే సకాలంలో, కానిస్టేబుల్ అతన్ని చూసి అడ్డు కోవడంతో ప్రాణాపాయం తప్పింది . దేశవ్యాప్తంగా ఆడిటర్లు అంతా స్పందించి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరాలి. మార్గదర్శి సంస్థ పై ఇప్పటివరకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. తమకు వచ్చిన లాభాలను ఆ సంస్థ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే నీలాప నిందలు వేస్తూ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు పై, మార్గదర్శి ఎండి శైలజ పై కేసులు నమోదు చేయాలని చూడడం దుర్మార్గం. ఇతరులను మానసికంగా వేధించడమే మన రాజకీయమా?. నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రాసిక్యూటర్లలో బీసీ, ఎస్సీలను ఎందుకు నియమించలేదు. ఎక్కడ చూసినా రెడ్ల ను మాత్రమే పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎందుకు నియమించారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.