Suryaa.co.in

Telangana

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు

– దాడులతో అధికారులు, ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయొద్దు
– కొడంగల్ ప్రాంతంలో వికారాబాద్ కలెక్టర్, ఉద్యోగులపై నిన్న జరిగిన
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
– సమస్యల పరిష్కారానికి ‘ ప్రజావాణి ‘ వేదికను సద్వినియోగం చేసుకోవాలి
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, ఎలాంటి సమస్యలు అయినా సామరస్య పూర్వకంగా చర్చల ద్వారానే పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై నిన్న జరిగిన భౌతిక దాడులపై చిన్నారెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.

ఎలాంటి సమస్యలు అయినా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, అందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం రోజున జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు.

అత్యంత వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు ప్రజలు తమ సహకారాన్ని అందించాలని చిన్నారెడ్డి కోరారు.

కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమలను స్థాపించడం ద్వారా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక సంస్థలను కొడంగల్ ప్రాంతానికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

ప్రశాంత వాతావరణంలో సంప్రదింపులు చర్చల ద్వారా అభివృద్ధి మార్గంలో పయనించే అవకాశాలను ప్రజలు అందిపుచ్చుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE