– పుంగనూరులో వైసీపీ నేతల దాదాగిరి
– టీడీపీ కార్యకర్త చొక్కా విప్పించిన అధికార అహంకారం
– మీడియాలో వచ్చినా చలనం లేని నిర్లక్ష్యం
– మానవ హక్కుల హననంపై సర్వత్రా ఆగ్రహం
– ఇప్పటిదాకా చర్యలు తీసుకోని పోలీసులు
– మందడంలో ఓ మహిళపై 23 క్రిమినల్ కేసులా?
– కళ్లు మూసుకున్న ఖాకీ వ్యవస్థ
– నమ్మకం పోతే నష్టం పోలీసు వ్యవస్థకే
– పాలకపక్షమైతే పలచనయ్యేది పోలీసు వ్యవస్థే
( మార్తి సుబ్రహ్మణ్యం)
మొన్ననే పోలీసుల అమరవీరుల సంస్మరణదినం ఘనంగా జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ.. విధి నిర్వహణలో అశవులుబాసిన పోలీసు అమరుల సేవలను పాలకులు, పోలీసు ఉన్నతాధికారులు జమిలిగా కొనియాడారు. వారి త్యాగాలు స్మరించుకున్నారు. అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి, మరణించిన పోలీసు సింహాలకు నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి జగన్ అయితే ఒక అడుగుముందుకేసి.. ‘‘పోలీసులు విధినిర్వహణలోప్రమత్తంగా ఉండాలి. అసాంఘిక శక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలుచేయాలి. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకపోతే సమాజంలో రక్షణ ఉండదని’’ గంభీరంగా మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడింది.. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న విపక్షాలనుద్దేశించేనని, బుర్ర-బుద్ధీ ఉన్న అందరికీ తెలుసు. కానీ శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం ఇచ్చిన పిలుపు-ఆయన కవిహృదయం మాత్రం మెచ్చదగ్గదే.
అయితే సీఎంగారి పిలుపును పోలీసులు, పెద్దగా పట్టించుకున్నట్లు లేకపోవడమే విచారకరం. పోలీసు సంస్మరణ వేదికపై సీఎం గారి ప్రసంగాన్ని ప్రజలు పూర్తిగా అర్ధం చేసుకోకముందే… చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఓ దౌర్జన్యకాండ, పోలీసు వ్యవస్థ కాపాడుకుంటూ వస్తున్న పరువును పలచన చేసింది.
అక్కడ ఓ టీడీపీ కార్యకర్త పచ్చ చొక్కా వేసుకుని, సైకిల్‌పై వెళుతూ టీ తాగేందుకు ఆగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు, తమ సామ్రాజ్యంలో పచ్చ చొక్కాలు వేసుకునేందుకు వీల్లేందంటూ, దౌర్జన్యంగా సదరు టీడీపీ కార్యకర్త వేసుకున్న పచ్చ చొక్కాను బలవంతంగా తీయించారు. ఉన్నది ఒక్కడు. ఎదురుగా ఉన్నది అధికార పార్టీ సైనికులు. పైగా అది పుంగనూరు. కాబట్టి బాధితుడు వారి ఆదేశాలు అమలుచేసినట్లున్నాడు.
తమ సంస్థానమైన పుంగనూరులో, పచ్చచొక్కాలు వేసుకుని తిరగడానికి నీది గుండెనా? చెరువా? అని తిట్ల పురాణం అందుకున్నారు. తాను సైకిల్‌పై చంద్రబాబును చూసేందుకు రాజమండ్రి వెళుతున్నానని, ఆ వెర్రి వెంగళప్ప చెప్పడమే ఇంత దాదాగిరీకి దారితీసింది. ఇదంతా ఎవరో చెబితేనో.. లేదా ‘ట’ అని అనుకునేందుకు లేదు. ఎంచక్కా వైసీపీ భక్తులు తమ ఘనకార్యాన్ని వీడియో, ఫొటో తీసి సోషల్‌మీడియాలోకి వదిలిన సచిత్ర దృశ్యాలే. అయినా చర్యలు శూన్యం.
ఈ వార్త మీడియాలో వచ్చి, రచ్చయింది. టీడీపీ-జనసేన పార్టీలు విరుచుకుపడ్డాయి. తొలిసారి చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఈ రాజకీయ ప్రేరేపిత ఘటనపై స్పందించి ట్వీట్ చేశారు. అయినా బాధితుడి చొక్కా బలవంతంగా తీయించిన వైసీపీ వీరులపై, ఎలాంటి చర్యలు లేకపోవడమే ఆశ్చర్యం. ఇలాంటి అమానవీయ-హక్కుల హననంపై పోలీసు అధికారులు మౌనంగా ఉండటం, పోలీసు వ్యవస్థకు ఏమాత్రం గౌరవప్రదం కాదన్నది పౌరసమాజ హితవు.
నిజానికి ఈ ఘటనపై నిందితులకు పెద్ద శిక్ష కూడా ఉండదు. అన్నీ బెయిలబుల్ కేసులే. ఆ పనేదో అప్పుడే చేసి ఉంటే, పోలీసులపై పౌరసమాజంలో గౌరవం పెరిగేది. ఆ చిన్న లాజిక్కును కూడా మిస్సవడమే వింత. అంటే అది ఒకరకంగా పోలీసులు అంత ఒత్తిళ్లలో పనిచేస్తున్నారన్న సంకేతం పంపించడమేనన్నది మాజీ పోలీసు అధికారుల విశ్లేషణ.
పచ్చ చొక్కా వేసుకున్న సదరు వ్యక్తి , టీడీపీ అనే ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కావచ్చు.
కానీ దానికంటే ముందు అతను ఒక పౌరుడు. ఎవరు ఏ దుస్తులైనా వేసుకోవచ్చు. అది వారి వ్యక్తిగతం. కానీ అతని చొక్కా తీయించడమనేది కండకావరమే కాదు. నిస్సందేహంగా మానవ హక్కుల ఉల్లంఘన కూడా. మరి ఆ ఉల్లం‘ఘనులను’ సీఎం జగన్ సారు చెప్పినట్లు, ఖాకీలు అక్కడికక్కడే.. అప్పటికప్పుడే తాటతీయాలి! జగనన్న ఆదేశించినట్లు, దుష్టశక్తులకు గుణపాఠం చెప్పి తీరాలి.
మరి ఘటన జరిగి, అది రచ్చగా మారిన ఇప్పటికీ తీయలేదే?! మరిక ముఖ్యమంత్రి పిలుపునకు విలువేమిటన్నది బుద్ధి జీవుల ప్రశ్న. సీఎం గారు ‘ తప్పు చేసిన తమ పార్టీ వారినయినా వద్దలవద్దు’ అని ఆదేశించి ఉంటే, బహుశా ఆ దాష్టీకంపై చర్యలు తీసుకునేవారేమో అన్నది బుద్ధిజీవుల సందేహం!
సహజంగా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా, అది నిఘా నేత్రాల ద్వారా పాలకులకు, పోలీసు బాసులకు ఆగమేఘాలపై చేరిపోతుంది. పొద్దున్నే వచ్చే పత్రికల్లో ఏయే సంఘటనలు జరిగాయన్న దానిపై సమీక్ష, వాటికి సంబంధించిన క్లిప్పింగులు, వీడియో విజువల్స్ అన్నీ పోలీసు బాసుల బల్లలపై వాలిపోతాయి.
ఐజీలు, ఎస్పీలతో జరిగే టెలీ-వీడియా కాన్ఫరెన్సులు, జిల్లా స్థాయిలో ఎస్పీలు నిర్వహించే సెట్ కాన్ఫరెన్సుల్లో.. అంతకుముందు రోజు, లేదా ఆరోజు ఉదయం జరిగిన ఘటనల గురించి చర్చిస్తారు. ఏమేం చర్యలు తీసకోవాలో ఆదేశిస్తారు. వెంటనే ఆ ఘటన తెరవెనుక వాస్తవాలను తమ పైఅధికారులకు నివేదిస్తారు.
మరి పుంగనూరు వైసీపీ నేతల దాష్టీకంపై పత్రికలు సచిత్రంగా ఘోషించినా, చానెళ్లలో నోరెత్తి అరిచినా పోలీసు బాసులు దానిపై ఆగమేఘాలపై చర్యలు తీసుకోలేదంటే.. వారికి పుంగనూరు హక్కుల హననం గురించి, సమాచారం తెలియకపోయి ఉండాలి. లేదా తెలిసినా వారి చేతులు నిస్సహాయంగా కట్టివేయబడయినా ఉండాలి. ఈ రెంటిలో ఏది నిజమో వారికే ఎరుక.
ఇక రాజధాని నగరంలో మందడం అనే గ్రామంలో.. వరలక్ష్మి అనే రెండెకరాల మహిళ, ఓ నాలుగు సెంట్లలో రేకుల ఇంట్లో నివసిస్తోంది. రాజధానికి భూమి ఇచ్చి, కౌలు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది రైతుబిడ్డల్లో ఆమె ఒకరు కావచ్చు. అయితే ఆమెపై ఆక్షరాలా 23 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న వార్త, సోషల్‌మీడియాలో చూసిన వారు నిశ్చేష్టులయ్యారు.
ఒక సాధారణ మహిళపై అన్నేసి కేసులు బనాయించారంటే పోలీసు వ్యవస్థపై ఎలా గౌరవం ఉంటుంది? ఇటీవల సీఎం జగన్, జనసేనాధిపతి పవన్ నాలుగుపెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను సదరు వరలక్ష్మి ఏదో యూట్యూబ్‌లో ఏకేసింది. ఆ సందర్భంగా తన మాండలీకంలో చేసిన విమర్శలు, పాలకులకు ములుక్కుల్లా గుచ్చుకోవడం సహజం.
‘ఏమైతుంది? ఇంకా నాలుగు కేసులు పెట్టుకోమనండి.అంతకంటే ఏం చేస్తారు’ అంటూ, ఒక మహిళా రైతు తిరగబడిందంటే.. పోలీసు వ్యవస్థపై ఆమె నమ్మకం ఎంతన్నది ఆమె మాటలే చెబుతున్నాయి. ఇది పోలీసు వ్యవస్థకు శోభనిస్తుందా? క్షోభపెడుతుందా? అన్నది పోలీసుల ఆత్మసాక్షికి సంబంధించిన ప్రశ్న.
ఇలాంటి ఘటనలు రోజూ రాష్ట్రంలో, ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నట్లు మీడియాలో వస్తున్నాయి. నిజానికి ఇలాంటి వ్యవహారాలను పోలీసులు సహజంగా సహించరు. పార్టీలు- వ్యక్తులను పక్కనపెట్టి చర్యల కొరడా ఝళిపిస్తారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థపై నమ్మకం కోసం! పోలీసులపై గౌరవం-భయభక్తులు సన్నగిల్లకూడదన్న ముందుచూపు!! పౌర సమాజంలో ఆ నమ్మకం-గౌరవం కోల్పోయినప్పుడు సహజంగా పోలీసు వ్యవస్థ జనం దృష్టిలో చిన్నదవుతుంది.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా ఇప్పటి నిఘా దళపతి ఎస్పీగా పనిచేశారు. విధినిర్వహణలో ముక్కుసూటి- నిర్మొహమాటంగా ఉండే ఆయన పనితీరు అప్పటి జిల్లా టీడీపీ నేతలకు నచ్చలేదు. దానితో వారంతా తమ మధ్య ఉన్న విబేధాలు అటకెక్కించి, ఆ ఎస్పీని బదిలీ చేయాలని బాబును కలసి అభ్యర్ధించారు. అన్నీ విన్న బాబు.. ‘ఆయనతో పనిచేయించుకోండి. లా అండ్ ఆర్డర్ చెడిపోతే మన ప్రభుత్వానికే నష్టం. అంతేకానీ పనిచేసే అధికారులను మార్చమని అడగకండి’ అని క్లాసు ఇచ్చి పంపించారు. అప్పట్లో ఒక ఇంగ్లీషు పత్రిక జర్నలిస్టు, వారి వెనుక ఉండేవారు.
మళ్లీ అదే అధికారి కర్నూలు బదిలీ అయితే, అక్కడ తమ్ముళ్ల ఫిర్యాదు కూడా డిటో. దివంగత భూమా నాగిరెడ్డి ఓసారి హైదరాబాద్ టీడీపీ ఆఫీసులో బాబును కలిసి, బయట ఉన్న మీడియా ప్రతినిధుల వద్ద చిట్‌చాట్ చేశారు. ఆ సందర్భంలో ‘ఆ ఎస్పీ మా మాట వినడం లేదు. మార్చమని బాబును అడిగితే ఆయనా వినడం లేదు. అధికారంలో ఉన్నా మాకు విలువలేదు’’ అని వాపోయారు.
ఇక రాజధాని హైదరాబాద్‌లో అయితే, మంత్రులు-ఎమ్మెల్యేలకు సీఐల పోస్టింగుల్లో కూడా అధికారం ఉండేది కాదు. కమిషనర్లకు బదిలీలలో అంత స్వేచ్ఛ ఉండేది. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా వినవద్దని, స్వయంగా నాటి సీఎం చంద్రబాబు పోలీసు కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చేవారు. ఎందుకంటే రాజధాని నగరంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో లేకపోతే, దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుంది కాబట్టి! అయితే ఇదంతా ఒకప్పటి మాట.
పోలీసు వ్యవస్థను అంత బలోపేతం చేసిన టీడీపీ కూడా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత, కాంగ్రెస్ దారిలో నడిచింది. గత టీడీపీ సర్కారు ఎమ్మెల్యే లేఖల ప్రాతిపదికన బదిలీలకు తెరలేపింది. విజయవాడలో సీనియర్ ఐపిఎస్ బాలసుబ్రహ్మణ్యం… ట్రాన్సుపోర్టు అధికారిగా ఉన్నప్పుడు ఆయనపై జులుం చేసి, టీడీపీ అప్రతిష్ఠపాలయింది. అది వేరే కథ.
ఇక గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో నిర్నిరోధంగా- విచ్చలవిడితనంగా జరుగుతున్న దాదాగిరి-వ్యక్తుల దౌర్జన్యకాండను మొగ్గలోనే తుంచివేయకపోవడమే, ఇప్పటి దారుణాలన్నది మేధావుల మనోగతం. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవలసింది పోలీసులే. చీరాలలో వైసీపీ నేత ఆమంచి సోదరుడు స్వాములు, వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి పోలీసులను బండబూతులు తిట్టిన ఆడియోను జనమంతా ఆలకించారు.
మంత్రి రోజా ఓ పోలీసు అధికారిని, బూతులు తిట్టిన వీడియోను కూడా ఆంధ్రా ప్రజలు దర్శించారు. ఉండవల్లి శ్రీదేవి అనే తాజా మాజీ వైసీపీ ఎమ్మెల్యే పోలీసు పోస్టింగుల గురించి మాట్లాడిన ఆడియో విన్నారు. కుప్పం సీఐ సాదిక్ చొక్కాను, వైసీపీ నేత కోదండరెడ్డి నడిరోడ్డుమీద పట్టుకున్న చిత్రాన్నీ జనం చూశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి, నిరంతరం పౌరసేవలో ఉండే పోలీసుల రక్షణకే దిక్కు లేకపోతే.. ఇక పౌరులు పోలీసుల నుంచి రక్షణ ఆశిస్తారా? అన్నది ప్రశ్న.
ఇక తమ అధికారులపై విపక్షాలు విమర్శించినప్పుడల్లా, పోలీసు అధికారుల సంఘ నేతల తెరపైకి వచ్చి, వారిపై సవాళ్లు చేసి తొడలు కొడుతుంటారు. అయితే అదే పాలక పార్టీ నేతలు.. తమ సొంత శాఖ అధికారులను బండబూతులు తిడితే మాత్రం, నిలదీయకుండా నిశబ్దంగా ఉండటం మరో ఆశ్చర్యం. ఈ తరహా ‘సర్కారీ విధేయత’ అన్ని ప్రభుతాల్లో చూసినవే. ఇదే మొదలు కాదు. చివరా కాదు! అదొక ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంతే!!
రెండేళ్ల క్రితం హైకోర్టు జడ్జిలపై వైసీపీ సోషల్‌మీడియా సైనికులు, దారుణమైన పోస్టింగులు పెట్టి ట్రోలింగ్ చేశారు. దానిపై విచారించాలని సీఐడీకి ఆదేశిస్తే తమ వల్ల కాదన్న, పోలీసుల నిస్సహాయతనూ పౌరసమాజం చూసింది. ఇక మహిళలు, వృద్ధులు పోస్టింగులు పెట్టారని, ఫార్వార్డ్ చేశారంటూ కేసులు పెడుతున్న ఘనకార్యాలూ జనం చూస్తున్నారు.
అంతకుమించి..పోలీసు హెడ్‌క్వార్టర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న, ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయాన్ని..అధికార పార్టీ శ్రేణులు పట్టపగలు కర్రలు-రాడ్లతో ధ్వంసం చేసి, స్వైరవిహారం సృష్టిస్తే నివారించలేని.. నిస్సహాయ పరిస్థితిని కూడా మేధావి వర్గం చూసింది. మరి ఇన్ని ఘటనలు కళ్లెదుటే జరుగుతున్నా పట్టింకోకుండా, తామరాకుమీద నీటిబొట్టులా ఉంటే విమర్శలు రావడం సహజం. విమర్శలు రాకూడదని ఆశించడం అత్యాశ!
నిజానికి ఇవన్నీ.. అసాంఘికశక్తులు-ఉగ్రవాదులు-తీవ్రవాదులను ఏరివేసి, గూండాల ఆటకట్టించి సగర్వంగా తలెత్తుకున్న పోలీసు వ్యవస్థకు, నిస్సందేహంగా తలవంపులే అన్నది ఒకప్పటి పోలీసు అధికారుల ఆవేదన. నేరం జరిగినప్పుడే చర్యలు తీసుకుంటే, కొత్త తప్పులకు అవకాశం ఉండదు.
ఎందుకంటే..ఒక కేఎస్ వ్యాస్-ఇంకో పరదేశీనాయుడు-మరో ఉమేష్‌చంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే, పోలీసు వీరుల జాబితాకు అంతు ఉండదు. నక్సల్స్ ల్యాండ్‌మైన్లకు నేలకొరిగిన పోలీసులు, ఎన్‌కౌంటర్లలో తలవాల్చిన సిపాయిలు, విధినిర్వహణలో రౌడీషీటర్ల చేతిలో మృతి చెందిన పోలీసులు, గూండాలను ఎదిరించే క్రమంలో వారి చేతుల్లో బలైన పోలీసు హీరోలు..పాలక పార్టీల ఆదేశాలు బేఖాతరు చేసి, తాము అనుకున్నదే అమలుచేసి, బదిలీలకు సిద్ధపడిన నిఖార్సయిన అధికారులు పనిచేసిన ప్రజాసేవా వ్యవస్థ…ఇలా నిస్తేజంగా.. నిస్సహాయంగా.. నిర్వేదంగా.. చేష్టలుడిగి.. పాలకపక్షం కావటమే విచారకరమన్నది పౌరుల ఆవేదన. అందరికీ ఆత్మపరిశీలన అవసరమే. అందుకు లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు.. చివరకు పోలీసులూ మినహాయింపు కాదు! ఎందుకంటే ఇవన్నీ పౌరసమాజం గౌరవించే వ్యవస్థలు కాబట్టి!!
కొసమెరుపు: ఘటన జరిగిన మూడురోజుల తర్వాత.. తమపై వస్తున్న విమర్శలకు స్పందించి.. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం చేసిన ప్రకటన బట్టి అర్ధమవుతోంది. ఆ పనేదో ఘటన జరిగిన వెంటనే చేసి ఉంటే.. ఖా‘కీర్తి’ మరింత పెరిగి ఉండేది కదా? ఇంతకూ బాధితుడిని బలవంత ంగా చొక్కా విప్పించిన ఘనుడిపై , ‘రౌడీషీటర్ బిరుదు’తో పాటు.. ‘కేవలం ఆరు కేసులు మాత్రమే ఉన్నాయట!