Suryaa.co.in

Political News

అభ్యర్థి ఎంపికలో ఇన్ని గూడుపుఠాణీలు!!ఇవీ ఓటు బ్యాంకు రాజకీయాలు!

పుట్టక మునుపే జరిగినా కాస్త జ్ఞానం వచ్చే పాటికి విన్న కొన్ని పేర్లు..బాబూ రాజేంద్రప్రసాద్..సర్వేపల్లి రాధాకృష్ణ..జకీర్ హుస్సేన్.. వి వి గిరి.. ఫకృద్దిన్ ఆలీ అహ్మద్..!వీరంతా 1977 కి ముందు సువిశాల భారతావనికి రాష్ట్రపతిగా పని చేసి..ఆ పదవి చేపట్టక మునుపే ప్రఖ్యాతి గాంచిన విశిష్ట వ్యక్తులు..!!
ఆ తర్వాత ఫలానా వ్యక్తి రాష్ట్రపతి..ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన పౌరుడు అవుతున్నాడని తెలుస్తుండగానే..ఔను.. ఆయనే కదా అని వెంటనే అనిపించేది.అలాంటి వారిలో
నీలం సంజీవరెడ్డి..
జ్ఞాని జైల్ సింగ్..
ఆర్ వెంకట్రామన్..
శంకర్ దయాళ్ శర్మ..
కె ఆర్ నారాయణన్..
అబ్దుల్ కలాం..
ప్రతిభా పాటిల్..
ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు.
అయితే..2017 లో రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం..దానికి సారథ్యం వహిస్తున్న బిజెపి రాంనాథ్ కోవింద్ పేరు తెరపైకి తెచ్చే వరకు ఈ దేశంలో చాలా మందికి..చదువుకున్న వారికి..మేధావులకు సైతం ఆయన ఎవరో తెలియదు..
ఏవో లెక్కలు..అలాంటి కార్యక్రమాలకు బాటలు వేస్తుంటాయి.మరో మాట..పదవీ కాలం పూర్తి కావస్తున్న దశలో సైతం కోవింద్ పేరు ఇంకా తెలియని వారు ఈ దేశంలో చాలా మంది ఉన్నారంటే ఆశ్చర్యం కాదు.ఇదిగో ఇప్పుడు మళ్లీ తాజాగా బిజెపి అదే పని చేసింది.

రాష్ట్రపతి అభ్యర్థిగా దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా ప్రజలకు పరిచయమే లేని వ్యక్తి..ద్రౌపది ముర్మును తెరపైకి తెచ్చింది.ఒడిశాలోని బైడపోసి గ్రామంలో జన్మించిన ముర్ము ఒకనాడు టీచర్..ఆ తర్వాత ఎమ్మెల్యే..మంత్రి..ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్..జాతికి పెద్దగా పరిచయమే లేని ఒక వ్యక్తిని అత్యున్నత పీఠంపై కూర్చోబెడుతున్నారు..ఇది మహిళా లోకం గర్వించదగ్గ విషయమే.. దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కూడా ఆదివాసీ..షెడ్యూల్ కులాలు..ఇలాంటి పదాలు వాడే దుస్థితి మన దేశంలోనే ..అది కూడా ఇంకా కొనసాగుతుండడం దురదృష్టమే..పైగా..ఒక ఆదివాసీ మహిళను తొలిసారిగా ఉన్నత స్థానంపై ప్రతిష్టిస్తున్నామని గొప్పలు పోవడం మరీ దౌర్భాగ్యం.ఇలా కులమత వర్గవర్ణ ప్రసక్తి లేకుండా కనీసం అత్యున్నత పదవి కోసమైనా అభ్యర్థి ఎంపిక జరిగితే ఎంత బాగుండు. సరే..ఆ విషయమే ఇబ్బందిగా అనిపిస్తే తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయనే వార్తలు మరీ అసహనం కలిగిస్తున్నాయి.

వెంకయ్యకు పదేపదే దెబ్బ
ఈ తరహా రాజకీయాలే ముప్పవరపు వెంకయ్య నాయుడు అనే కీర్తి శిఖరాన్ని దేశ అత్యున్నత పదవికి అడుగు దూరంలో ఆపేస్తున్నాయి.నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకయ్య నాయుడిని మించిన అభ్యర్థి ఇంకెవరు ఉంటారు.అపారమైన రాజకీయ అనుభవం..అద్వితీయమైన విషయ పరిజ్ఞానం..బహుభాషాvenkaiah-naidu పరిచయం..దేశ ప్రజలందరికీ తెలిసిన పేరు..ఎరిగిన మొహం.. కేంద్రమంత్రి..బిజెపి జాతీయ అధ్యక్షుడు.. పరాకాష్టగా ఉపరాష్ట్రపతి పదవి..ఇన్ని అర్హతలు ఉన్న కేవలం కొన్ని రాజకీయ ప్రయోజనాలు ప్రాతిపదికగా పక్కన పెడుతున్నారంటే అదెంత దారుణం.వెంకయ్య నాయుడికి ఇదే భంగపాటు 2017లో కూడా ఎదురైంది.రాజకీయ కారణాలతో పాటు వ్యక్తిగత ఈర్ష్యలు కూడా నాయుడికి వ్యతిరేకంగా పని చేశాయని చెప్పక తప్పదు.రాష్ట్రపతి లేదా ప్రధాని..ఏ పదవినైనా చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉండడమే వెంకయ్యకు మైనస్ పాయింట్ అయిందేమో..!?

ఓటు బ్యాంకు రాజకీయాలు
తాజాగా దేశ అత్యున్నత పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటే దేశమే గతి బాగుపడునోయ్ అనిపించక మానదు. త్వరలోనే ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్ తో సహా మధ్యప్రదేశ్..రాజస్థాన్..ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నాలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలు 128 ఉండగా బిజెపికి 35 స్థానాల్లో మాత్రమే ప్రాతినిధ్యం ఉంది.ఇక తరువాయి..అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంట్ ఎన్నికలకు 2024..అంతకంటే ముందుగా వెళ్ళవలసిన దశలో ఈ నాలుగు రాష్ట్రాల్లో గెలుపు బిజెపికి అవసరం. ఆ విజయం సిద్ధించాలంటే ఎస్టీ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది..అందుకు ఆలంబనగానే ఇంచుమించు రాజకీయ కోణంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరిగిందంటే
హవ్వ…అదెంత విడ్డూరం.. శోచనీయం..ఇలాంటి పదాలు ఇంకొన్ని కూడా కలపాలేమో..!
బ్రూటల్ మెజారిటీ అంటారు..అది ఎంతయినా.. ఎన్నయినా చేయిస్తుంది..!

-సురేష్ కుమార్ ఇ
9948546286

LEAVE A RESPONSE