– మదిగుబ్బలో ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి
– రెవెన్యూ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించాలని ఆదేశం
– సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన
– రూ.5.29 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆత్మకూరు: గ్రామంలో పొలాలకు వెళ్లే దారులను మూసేస్తున్నారని తగిన న్యాయం చేయాలని రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె మదిగుబ్బ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకి ముందుగా ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఇంటింటికి వెళ్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పథకాల విషయంలో గ్రామస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ గోడ లేదని స్థానిక నాయకులు మల్లికార్జున రెడ్డి తదితరులు ఎమ్మెల్యే సునీత సృష్టికి తీసుకొచ్చారు. వెంటనే దీనికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కొత్తగా పంచాయతీ నిధులతో వేసిన బోరును ఆమె ప్రారంభించారు.
గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు గ్రామంలో పొలాలకు వెళ్లే దారులను ఆక్రమించారని… తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఎమ్మెల్యే సునీత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె రెవెన్యూ అధికారులతో మాట్లాడి సర్వే చేయించి పొలాలకు దారులు ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రీ సర్వే పేరుతో గ్రామాల్లో లేని సమస్యలు సృష్టించారన్నారు. దీనివలన రైతులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోందన్నారు. సంక్షేమ పథకాల విషయంలో అన్నిచోట్ల తమకు మంచి స్పందన వస్తోందని.. గత ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాది కాలంలోనే చేసి చూపిస్తున్నామన్నారు. సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించడమే కాకుండా.. ప్రజా సమస్యల పరిష్కరించే దిశగా కూడా పనిచేస్తున్నామని చెప్పారు.
రూ.5.29 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రాప్తాడు నియోజకవర్గంలో పలువురికి ఎమ్మెల్యే పరిటాల సునీత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో 5మందికి, ఆత్మకూరు మండలం మదిగుబ్బ పర్యటనలో మరో ముగ్గరికి మొత్తం 5 లక్షల 59 వేల రూపాయల చెక్కులు అందజేశారు.