Suryaa.co.in

Editorial

వాళ్లు సెటిలర్లు కాదు.. హైదరాబాదీ బిడ్డలు!

– ఈ పదేళ్లలో వారిని కంటికి రెప్పలా కాపాడిన ఘనత మాది
– అప్పుడు మాది ఉద్యమపార్టీ
– ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ
– ఆ విషయం కేసీఆర్ ఎప్పుడో చెప్పారు
– కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి స్థిరపడిన వారికి టికెట్లు ఇచ్చాం
– చంద్రబాబును అరెస్టు చేయాల్సింది కాదు
– ఆయన నాకు అన్న లాంటివాడు
– నా తల్లి ఆయనను పెద్ద కొడుకు అని చెప్పడం మరిచారా?
– రాజకీయాల్లో కక్ష సాధింపు మంచిదికాదు
– అధికారం శాశ్వతం కాదు
– బీజేపీ ఆదేశాలతోనే బాబు అరెస్టు
– ఓటర్లుగా నాకు అన్ని ప్రాంతాల ప్రజలూ సమానమే
– నేను ఈ మట్టిలో పుట్టి ఇదే మట్టిలో కలిసేవాడిని
– పదవి ఉన్నా లేకున్నా జనంతోనే ఉండటమే నా నైజం
– కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మాదిరిగా నేను గెస్టు ఆర్టిస్టును కాదు
– సనత్‌నగర్ నియోజకవర్గం మినీ ఇండియా
– ఆంధ్రా, రాజస్థానీ, గుజరాతీ, సింధీ, మార్వాడీ, పంజాబీలకు కేంద్రం
– అన్ని ప్రాంతాల వారూ నా సోదరులే
– నాకంటే పెద్ద హిందువు ఎవరున్నారు?
– అలాగని ముస్లిం-క్రైస్తవులకు ఎందుకు వ్యతిరేకించాలి?
– ఎవరి మతం వారిది.. ఎవరి ఎవరి నమ్మకం వారిది
– వారు కూడా భారతీయులే కదా?
-ప్రజాప్రతినిధులు కులం-మతం చూడకూడదు
– నేను బీజేపీ కళ్లతో సమాజాన్ని చూడను
– కేసీఆర్‌ను మించిన భక్తుడెవరు?
– నాకు బొట్టుపెట్టుకోమని బీజేపీ చెప్పనవసరం లేదు
– గాంధీ ఆసుపత్రి, ఒలిఫెంటా బ్రిడ్జి నా పోరాట ఫలితమే
– నా నియోజకవర్గం నుంచే రాష్ట్రంలో డబుల్‌బెడ్‌రూములు ప్రారంభం
– వంద కోట్లతో అండర్‌పాస్ నిర్మాణం, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు
– బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం చారిత్రక అవసరం
– సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన ఎక్కడున్నా.. ఏ పార్టీలో ఉన్నా సంచలనమే. పదునైన మాటలతో చెలరేగే ఫైర్‌బ్రాండ్. ఎక్కడ నెగ్గాలో కాదు. తన పనితోనే ప్రత్యర్ధులకు సమాధానం ఇస్తారు. ఎదురుదాడికి వెరవరు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన పబ్లిక్ పల్సు పట్టిన పొలిటికల్ డాక్టర్. అదే ఆయనకు గుర్తింపు. అందుకే ఆయన చుట్టూ జనం. పక్క రాష్ట్రానికి వెళ్లినా అదే ఫాలోయింగ్. నిరంతం జనంతోనే ఆయన అనుబంధం. పదవి ఉన్నా లేకున్నా అదే శ్రమ. అదే పలకరింపు. అదే ఆప్యాయత. చెప్పారంతే చేస్తారంతే! అదే ఆయనను రాజధాని నగరంలో ఓ మాస్ లీడర్‌గా నిలబెట్టింది. అప్పుడు పీజేఆర్.. ఇప్పుడు ఈయన!

కేటీఆర్ మాటల్లోనే చెప్పాలంటే.. అలాంటి వాళ్లు ఒక 50 మంది ఉంటే పార్టీ నిశ్చింతగా ఉండవచ్చు. మరి ఆయనది పొలిటికల్ ఫ్యామిలీనా అంటే కాదు. సొంత రెక్కల కష్టంతో, ఆటుపోట్లు అధిగమించి తెచ్చుకున్న ఇమేజ్ అది. రాజధాని నగరంలో ప్రతిష్ఠాత్మక గాంధీ ఆసుపత్రి ఆయన పోరాట ఫలితమే. ఏ నియోజకవర్గానికి వెళ్లినా తనదైన అభివృద్ధి ముద్ర. ఆయనే సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.

సనత్‌నగర్‌లో తాను గెస్టు ఆర్టిస్టును కాదని, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసే తనకు, జనమే బలం-బలహీనత అంటున్న తలసాని.. బీఆర్‌ఎస్‌ కు ఓటు వేయడం చారిత్రక అవసరం అని స్పష్టం చేస్తున్నారు. సెటిలర్లు- హిందుత్వం- అభివృద్ధి-చంద్రబాబు అరెస్టు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు, తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. అవన్నీ ఆయన మాటల్లోనే…

సెటిలర్లు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. చంద్రబాబు అరెస్టు ప్రభావం బీఆర్‌ఎస్‌పై ఉందంటున్నారు. నిజమేనా?
అసలు సెటిలర్లు అన్న పదమే త ప్పు. వారంతా హైదరాబాదీలు. దశాబ్దాల క్రి తమే ఇక్కడకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పరుచుకున్న వారిని సెటిలర్లు ఎలా అంటారు? అలా అనడం వారిని అవమానించమే. వాళ్లు ఏపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌కు చెందిన వారు కావచ్చు. వాళ్లంతా నా దృష్టిలో సెటిలర్లు కాదు. బరాబర్ హైదరాబాదీ బిడ్డలే.

బాబు గారి అరెస్టుకూ-బీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ సంబంధం ఏమిటి? బీజేపీ కుట్ర చేసి ఆయనను అరెస్టు చేయించింది. అప్పుడు బాబు గారి అరెస్టుకు బీజేపీ-వైసీపీ కదా బాధ్యులు? మధ్యలో మాకేం సంబంధం? బీజేపీ అనుమతి-ఆదేశాలు లేకుండా జగన్ ప్రభుత్వం బాబు గారిని అరెస్టు చేసే ధైర్యం చేస్తుందా?

ఇక ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ ఉద్యమపార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ. కేసీఆర్ చాలాసార్లు దానిని స్పష్టం చేశారు. ఇప్పుడు మాది జాతీయ పార్టీ. మేం ఏపీ, మహారాష్ట్రలో కూడా శాఖలు తెరిచాం. ఎవరు ఎవరి భావాలను వారు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు.

నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా.. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడిన హైదరాబాదీ బిడ్డలపై, ఎప్పుడైనా చిన్న రాయి వేయడం చూశారా? మహారాష్ట్రలో శివసేన తరహాలో ఎవరినైనా వెళ్లిపొమ్మని బెదిరించటం చూశారా? మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ నుంచి స్థిరపడిన వారికి, సీట్లు ఇచ్చిన ఘనత మాది. అసెంబ్లీ సీట్లు కూడా ఇచ్చారు కదా? మరి కాంగ్రెస్-బీజేపీలు అలా ఎవరికైనా ఇచ్చాయా చెప్పండి?

మీకో విషయం చెబుతా. ఉద్యమ సమయం నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ఏపీ నుంచి స్థిరపడిన వారికి అండగా నిలిచింది నేను. మీరు గమనించారో లేదో.. నా సనత్‌నగర్ నియోజకవర్గం మినీ ఇండియా. ఇక్కడ ఏపీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మార్వాడీ, సింధీలు కొన్ని దశాబ్దాల నుంచి నివసిస్తున్నారు. నేను ఇక్కడే పుట్టినందువల్ల వారితో నాకున్నది వ్యక్తిగత బంధం. నా ద గ్గర ఎప్పుడూ ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులే ఉంటారు. నేను ఒక ప్రజాప్రతినిధిని. నాకు అంతా సమానమే. పక్షపాతం చూపిస్తే నాకే నష్టం కదా? నాకు ఓటు వేయకపోయినా వారందరికీ నేను బాధ్యత వహించాల్సిందే.

మీరు గత పదిరోజుల నుంచి చూస్తున్నారు. నన్ను కమ్మ-కాపు-బ్రాహ్మణ-పంజాబీ-మార్వాడీ-రాజస్థానీ-గుజరాతీ సంఘాలు పిలిచి వారంతట వారే మద్దతు ప్రకటించారు. జమాతే ఇస్లామీ హింద్ కూడా నాకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. అంటే వారికి నా పనితీరుపై నమ్మకం ఉండబట్టే కదా? అసలు ఏమీ చేయకపోతే నాకు మద్దతు ఇవ్వరు కదా?

ప్రధానంగా ఏపీ నుంచి స్థిరపడిన కమ్మ-కాపు-బ్రాహ్మణ వర్గాలు నాకు స్వచ్ఛందంగా మద్దతునీయడం సంతోషం. నేను ప్రజలను ఎప్పుడూ కులాలు-మతాల వారీగా చూడను. వారంతా నా ఓటర్లుగానే చూస్తా. ఒక ప్రజాప్రతినిధే ప్రజలపై పక్షపాత ం చూపిస్తే ఎలా? కమ్మ సంఘాల కోరిక మేరకు అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తా. నాకు రాజకీయ భిక్ష పెట్టిందే అన్నగారు. ఆ కృతజ్ఞత నాకుంది. ఆయనకోసం ఏం చేసినా తక్కువే.

ఇక చంద్రబాబు అరెస్టుకూ-సెటిలర్ల ఓట్లకూ ముడిపెడుతున్నారు. నిజానికి బాబు గారు అరెస్టును, మొదట ఖండించిన వ్యక్తిని నేను. నేను ఆయనతో 1994 నుంచీ పనిచేశా. ఆయన నాకు పెద్దన్న లాంటివాడు. సిద్ధాంతాలు, వ్యవహారాల్లో విబేధాలు ఉండవచ్చు. నన్ను ఆయన ఎంత ప్రోత్సహించారో, నేను కూడా పార్టీకి అంతే పనిచేశా. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు పనికిరావని చెప్పా.

ఈ వయసులో బాబు గారిని అరెస్టు చేసి, జైలుకు పంపించడం మంచిది కాదని చెప్పిన వాడిని నేను. ఏదేమైనా కోర్టు ఇచ్చిన తీర్పు శుభపరిణామం. అయినా జగన్ ప్రభుత్వం బాబు గారిపై కేసు పెట్టి అరెస్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? మనకు ఇక్కడ సమస్యలు, బీజేపీతో పోరాటంతోనే సమయం సరిపోవడం లేదు.

మీకో విషయం గుర్తు చేస్తా. నేను స్థానిక-రాష్ట్ర రాజకీయ సమీకరణల నేపథ్యంలో, పార్టీ మారిన రోజు.. నా తల్లి నా పెద్దకొడుకు చంద్రబాబునాయుడేనని మీడియాకు చెప్పింది. ఆమె ఇప్పటికీ నా పెద్ద కొడుకు బాబుగారేనని చెబుతుంది. రాజకీయాల్లో సైద్ధాంతిక విబేధాలుంటాయి. కానీ నేను వ్యక్తిగత దాడులకు వ్యతిరేకం.

నేను 1994 నుంచీ రాజకీయాలో ఉన్నా. సికింద్రాబాద్-సనత్‌నగర్ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా, నా ప్రత్యర్ధులపై ఎప్పుడూ కక్ష సాధించలేదు. అది నా నైజం కాదు. బాబు గారి అరెస్టును కూడా అదే కోణంలో ఖండించా. ఇప్పుడు కొన్ని పార్టీలు నా పాత వ్యాఖ్యల వీడియోలు రిలీజ్ చేసి శునకానందం పొందుతున్నారు. వారిని చూసి జాలి పడటం తప్ప నేనేమీ చేయలేను.

బాబు గారి అరెస్టు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్య ముమ్మాటికి తప్పు. రాజకీయాలు వేరు. వ్యక్తిగతం వేరు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు నన్ను కలసి మద్దతు ప్రకటిస్తున్నారు. కాల్పుల సమయంలో బాలకృష్ణ గారు నిమ్స్‌లో ఉన్నప్పుడు నేను మహంకాళి-గణపతి ఆలయ అర్చకులను తీసుకువెళ్లి, ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేయించా.

నేను ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసేవాడిని. అప్పట్లో పరిస్థితులు కలిసి రాక.. సనత్‌న గర్ బదులు, అన్నగారు నాకు సికింద్రాబాద్ సీటు ఇచ్చారు. సనత్‌నగర్ నా సొంత గడ్డ. ఇప్పుడు కాంగ్రెస్-బీజేపీ అభ్యర్ధులు గెస్టు ఆర్టిస్టులు. ఎన్నికలప్పుడే వాళ్లు కనిపిస్తారు. కాంగ్రెస్ అభ్యర్ధి పేరు మీరెప్పుడైనా విన్నారా? మర్రి శశిధర్‌రెడ్డి సనత్‌నగర్ ప్రజలకు దూరమయి ఎన్నేళ్లయింది? వీళ్లంతా ఇప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి ఏదేదో చెబితే వినడానికి ప్రజలు అమాయకులు కాదు కదా?

కానీ నా శ్వాస ఇక్కడే. గెలిచినా ఓడినా ఇక్కడ ఉండేవాడిని. కానీ వాళ్లు ఎన్నికల తర్వాత కనిపించరు. కాంగ్రెస్ అభ్యర్ధి ఢిల్లీకి, బీజేపీ అభ్యర్ధి తార్నాకకు వెళతారు. ఎందుకంటే వాళ్లిద్దరూ గెస్టు ఆర్టిస్టులు. ఆ తేడా సనత్‌నగర్ ప్రజలు గమనిస్తున్నారు. సంతోషం. నేను ఉదయం పది గంటల వరకూ ఇంట్లోనే అందరినీ కలుస్తా. మళ్లీ మధ్యాహ్నం వరకూ సెక్రటేరియేట్‌లో అందరినీ కలుస్తా. మళ్లీ సాయంత్రం వరకూ ఎమ్మెల్వే క్వార్టర్స్‌లో అందరినీ కలుస్తా. అంటే నేనెక్కడ ఉంటానో అందరికీ తెలుసు. ఇప్పుడు నాపై పోటీ చేస్తున్న వాళ్లు ఎక్కడ ఉంటారో ఎవరికైనా తెలుసా?

ప్ర: కానీ ఈ ఎన్నికల్లో హిందూత్వం కూడా బాగా పనిచేస్తున్నట్లుంది కదా?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నా. మరి బొట్టు గురించి బీజేపీ మాలాంటి వాళ్లకు చెబితే ఎలా? బీజేపీ నుంచి హిందువులు హిందుత్వం గురించి నేర్చుకోవాలా? బీజేపీ పుట్టకముందే హిందుత్వం ఉంది. అసలు నాకంటే భక్తుడెవరో చెప్పండి. అనేక చిన్న-పెద్ద ఆలయాలకు విరాళాలు ఇచ్చినవాడిని నేను. అలాగని ఏ ఆలయంలోనూ కనీసం ఫ్యాను రెక్కల మీద కూడా నా పేరు వేసుకోలేదు. నా తండ్రి పేరు మీద అనేక ఆలయాలకు విరాళాలిచ్చా. మహంకాళి ఆలయ ఆర్చిని నా సొంత ఖర్చుతో నిర్మించా. నేను హిందువును. అలాగని ముస్లిం-క్రైస్తవులకు వ్యతిరేకం ఎలా అవుతా? ఎవరి నమ్మకం వారిది. నేను హిందువునైంత మాత్రాన మిగిలిన మతాలను ఎందుకు వ్యతిరేకించాలి? వారు కూడా మనుషులే కదా? మతం అంటే మానవత్వం కదా? పైగా నేను ప్రజాప్రతినిధిని. నాకు ప్రజలంతా సమానమే కదా? నేను బీజేపీ కళ్లతో సమాజాన్ని చూడను.

కంచి స్వామి విజయేంద్రసరస్వతి స్కందగిరి ఆలయానికి వచ్చినప్పడు నన్ను పిలిచారు. వారి సూచనలను సీఎం కేసీఆర్ గారికి వివరించా. అసలు కేసీఆర్ కంటే నిజమైన భక్తుడు బీజేపీలో ఉన్నారా? నేను సవాల్ చేస్తున్నా. కేసీఆర్‌కు వచ్చిన శ్లోకాలు బీజేపీ నేతలకు ఎవరికైనా వచ్చా? భగవద్గీత, రామాయణ, భాగవతం గురించి కేసీఆర్ కంటే బీజేపీ నేతలకు ఎక్కువ తెలుసా? యాదాద్రి అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడెలా ఉంది? గతంలో ఎప్పుడైనా హిందువుల పండుగలకు ఆలయాలకు నిధులిచ్చిన చరిత్ర ఉందా? కాబట్టి బీజేపీని చూసి, హిందుత్వం గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలేదు.

ప్ర: మీరేం చేశారని సనత్‌నగర్ ఓటర్లు మీకు ఓటు వేయాలి?
మీరు సనత్‌నగర్ గురించే అడుగుతున్నారు. నేను 1994లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఇప్పుడున్న గాంధీ ఆసుపత్రి నా పోరాట ఫలితంగా వచ్చిందే. తెలంగాణ జిల్లాల నుంచి రోజూ కొన్ని వేలమంది రోగులు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. ముషీరాబాద్ జైలు ప్రాంతంలో ఆసుపత్రి కట్టాలని అప్పుడు పోరాడి, సీఎం చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఆసుపత్రి నిర్మించింది నేను. ఒలిఫెంటా బ్రిడ్జి సెకండ్ టన్నెల్ నిర్మాణం కూడా నా పోరాట ఫలితమేనని అందరికీ తెలుసు.

ఇప్పుడు తెలంగాణలో చరిత్ర సృష్టిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కూడా, నా సనత్‌నగర్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించినవే. స్వయంగా నాటి గవర్నర్ నరసింహన్ వాటిని చూసి, తనకూ ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేదన్నారు. చాలామంది పుడుతుంటారు. పోతుంటారు. కానీ పుట్టిన తర్వాత ఈ సొసైటీకి ఏం చేశాం? మనం పోయిన తర్వాత కూడా మన గురించి ప్రజలు చెప్పుకోవాలని కోరుకునే వాడిని నేను. అందుకే ఈ తాపత్రయం.

ప్ర: గెలుపుపై మీ ధీమా ఏమిటి? ఏం చేశారని మిమ్మల్ని సనత్‌నగర్ ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి?
మంచి ప్రశ్న. ఇది అందరికీ తెలియాలి. సనత్‌నగర్‌లో ఇప్పటిదాకా సుమారు 1400 కోట్ల అభివృద్ది పనులు జరిగాయి. సనత్‌నగర్‌లో 5 కోట్లతో వెల్ఫేర్ గ్రౌండ్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించా. 4 కోట్లతో వాటర్ రిజర్వాయర్ నిర్మించా. ఎర్రగడ్డ మెట్రో నుంచి ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకూ రోడ్లు విస్తరించాం. 2 కోట్లతో నెహ్రునగర్‌లో పార్క్‌ను ఆధునీకరించా. 3.75 కోట్లతో సుభాష్‌నగర్‌లో ఇళ్లపై వెళ్లే హైటెన్షన్ వైర్లను తొలగించా. అక్కడ ఇదే సమస్యతో చాలా మంది చనిపోయారు. 3,30 కోట్లతో కైలాష్‌నగర్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించా. రద్దీగా ఉండే ఫతేనగర్ ఫ్లైఒవర్ విస్తరణ, సనత్‌నగర్- నర్సాపూర్ వరకూ అండర్ పాస్ నిర్మాణం కోసం 100 కోట్లు మంజూరు చేయించా.

3 కోట్లతో బల్కంపేట ఆలయం పక్కన మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం, అమీర్‌పేటలో 50 పడకల ఆసుపత్రి, ఎస్సార్‌నగర్‌లో 15 కోట్లతో కమ్యూనిటీ హాల్ కాంప్లెక్స్ నిర్మాణం, 5 కోట్లతో ఈఎస్‌ఐ శ్మశానవాటిక అభివృద్ధి పనులు, రాంగోపాల్‌పేట డివిజన్‌లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, పాన్‌బజార్‌లో 5 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం, బన్సీలాల్‌పేట డివిజన్‌లో జీవైఆర్ కాంపౌండ్, సిసి నగర్, పొట్టి శ్రీరాములునగర్, బండమైసమ్మనగర్‌లో డబుల్‌బెడ్‌రూములు నిర్మించా.
మెట్ల బావి ఆధునీకరణ, న్యూబోయిగూడలో 1.32 కోట్లతో క్రిస్టియన్ గ్రేవియార్డ్ అభివృద్ధి పనులు, 45 కోట్లతో బేగంపేట నాలా అభివృద్ధి చేశాం. ప్రధానంగా పాటిగడ్డలో 6 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, ఓల్డ్ కస్టమ్స్‌లో 2 ఎకరాల్లో, 3 కోట్లతో మస్లిం స్మశాన వాటిక, రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం చేశా. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు రాయడానికి స్థలం సరిపోదు. వినడానికి సమయం సరిపోదు.

ప్ర: కానీ కమిషన్ల సర్కార్ అని బీజేపీ మీ పార్టీపై ఆరోపణలు చేస్తోంది కదా?
దానికి దిమాక్ లేదు. గ్రామాణాభివృద్ధితో సహా అనేక శాఖలకు అవార్డులిచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కదా? నిజంగా అవినీతి ప్రభుత్వమైతే అవార్డులు ఎందుకిస్తుంది? తెలంగాణకు వచ్చిన ప్రతి కేంద్రప్రభుత్వ బృందం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు మెచ్చుకుంటుంది? కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులపైనా ఆరోపణలు చేస్తున్నారు. మరి అవి నిజమైతే ఈ ఐదేళ్లలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. బట్టకాల్చి నెత్తినేయడం బీజేపీ సిద్ధాంతం. ఈ మైండ్‌గేమ్ మన రాష్ట్రంలో కుదరదు.

ప్ర: కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి కదా?
కాసేపు మీ మాట నిజమనుకుందాం. మరి ఆ పార్టీలో సీఎం ఎవరు? జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మేమంతా సీఎం అభ్యర్ధులమే అంటున్నారు. దానికి నెత్తిలేదు కత్తి లేదు. ఏడాదికో సీఎంలు మారితే ప్రభుత్వం ఏం స్థిరంగా ఉంటుంది? పెట్టుయబడులు ఎలా వస్తాయి? కర్నాటకలోనే హామీలు అమలు కావడం లేదని అక్కడ నుంచి రైతులు ఇక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.

చివరకు గవర్నమెంటు ఆఫీసులో రైతులు, అధికారులను లోపల ఉంచి బయట తాళం వేసి మొసళ్లు వదులుతున్నారు. ఆ మోహాలు అక్కడే ఏడవలేదు. ఇక్కడేం ఏడుస్తారు? నేను సూటిగా ఒకటే అడుగుతున్నా. దానికి సమాధానం ఇస్తే నేను రాజకీయాలనుంచి విమరించుకుంటా. తెలంగాణ లో అమలయ్యే సంక్షేమ పథకాలు కాంగ్రెస్-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుచేయడంలేదు?

రేపటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవడం చారిత్రక అవసరం. అనేక పథకాల కొనసాగింపు ఈ విజయంతో ముడిపడి ఉంది. బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించకపోతే అనేక పథకాలు ఆగిపోయ ప్రమాదం ఉంది. దళితబంధు, రైతుభరోసా, డబుల్‌బెడ్‌రూం ఇవన్నీ రావు. ఇతర పార్టీలు గెలిస్తే వాటిని ఎందుకు కొనసాగిస్తాయి? వాటికి వారిపై ప్రేమ ఎందుకు ఉంటుంది?

LEAVE A RESPONSE