Suryaa.co.in

Andhra Pradesh

మా పొలాన్ని ఆక్రమించి చంపేస్తామని బెదిరిస్తున్నారు

మాకు పొలం తప్ప వేరే జీవనాధారం లేదు,
మా పొలాన్ని మాకు ఇప్పించి ఆదుకోండి.
యువనేత నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి బాధితులు

పత్తికొండ నియోజకవర్గం అల్లుగుండు గ్రామానికి చెందిన ఊరవాకిలి వెంకటేష్ అనే వ్యక్తి యువనేత నారా లోకేష్ ను కలిసి తమ సమస్యను విన్నవించాడు.ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుడు తన 3.55 ఎకరాల భూమిని కబ్జా చేశాడని, తమ భూమి తమకు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. మా ముత్తాత ఊరవాకిలి బోడెన్న 1960 లో సర్వే నంబర్ 207/1 లో 3.55ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, మా నాన్నవాళ్లకు వంశపారంపర్యంగా ఆ పొలం వచ్చింది. ఆ పొలాన్ని మా గ్రామంలోని ఊరవాకిటి పుల్లన్నకు 10ఏళ్ల క్రితం కౌలుకు ఇచ్చారు. 2018 నుండి పుల్లన్న కౌలు ఇవ్వడం ఆపేశాడు.

ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే, పొలం నాదని అడ్డం తిరిగాడు.2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పొలానికి సంబంధించి పట్టాపాస్ పుస్తకాన్ని దొంగపత్రాలు సృష్టించాడు. దీనిపై నా తండ్రి రాతపూర్వకంగా వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ పుల్లన్న నాపైన, నాతండ్రిపైన పోలీస్ స్టేషన్ లో రివర్స్ కేసుపెట్టి మమ్మల్ని పోలీసులతో కొట్టించారు.ఊరవాకిటి పుల్లన్నకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్యే కొడుకు రామ్మోహన్ రెడ్డి, ఇతర వైసిపినేతలు అండగా నిలబడ్డారు. మా భూమికోసం మేం కోర్టుకు వెళ్లగా, డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.కోర్టులో కేసు నడుస్తున్నా భూమిలో పుల్లన్న ప్లాట్లు వేసి, అమ్మేందుకు ప్రయత్నించాడు.మేం కర్నూలుజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సివిల్ కేసులతో మాకు సంబంధం ఉండదు కోర్టులో తేల్చుకోండని పంపేశారు.

కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో నా తండ్రి 2022 ఏప్రిల్ 29న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.కేసు నా తండ్రిపేరు మీదే నడుస్తోంది. మా పెదనాన్న వాళ్లు ఇద్దరు ఎమ్మెల్యేకు భయపడి మాకు సహకరించడం లేదు. మా పొలాన్ని ఆక్రమించినవాళ్లు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు.
మాకు పొలం తప్ప వేరే జీవనాధారం లేదు, మా పొలాన్ని మాకు ఇప్పించి ఆదుకోండి.

యువనేత లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులకు రక్షణ కరవైంది.
• ప్రభుత్వ ఆస్తులతోపాటు ప్రైవేటు ఆస్తులను కూడా వైసిపి నేతలు కబ్జా చేస్తున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతల భూకబ్జాలపై సిట్ ఏర్పాటుచేసి, బాధితులకు న్యాయం చేస్తాం.
• వైసిపి నేతలు ఆక్రమించిన పేదల భూములను తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE