• విశాఖలో కాపురం పెడతాననడం జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే
• నాలుగేళ్లు గాలి కబుర్లు చెప్పి ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులు, సదస్సుల పేరుతో హడావుడా?
-, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు యనమల రామకృష్ణుడు
అధికారంలోకి వచ్చాక అరాచకం తప్పించి అభివృద్ధి ఊసే ఎత్తని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖలో కాపురం పెడతాననడం ఎవరిని ఉద్దరించడానికి? నాలుగేళ్లుపాటు రాష్ట్రాన్ని దోచుకుని తాడేపల్లి నేలమాళిగలు నింపుకున్నది చాల్లేదా? ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశారు. విశాఖలో రాజధాని మాటున రూ. 40 వేల కోట్లు కొల్లగొట్టారు. కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా కబ్జా చేసేశారు.
దోచుకున్నది సరిపోక మళ్లీ విశాఖలో కాపురం అంటున్నారా? మీరు మోపిన ధరల భారంతో , పన్నుల మోతతో పేదలు కడుపునిండా తిండి తినే పరిస్థితి లేదు. ఈ నాలుగేళ్లలో కొత్త పరిశ్రమల ఊసే లేదు. జే ట్యాక్స్ చెల్లించలేక పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతున్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ నాలుగేళ్ల నుంచి అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. చేసిన అరాచకాలు చాలక విశాఖ వెళతారా?
గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాల్లో కొన్నింటిని నిర్దాక్షణ్యంగా రద్దు చేసి మరికొన్నింటికి పేర్లు మార్చుకోవడం మినహా మీరు చేసింది ఏముంది జగన్ రెడ్డి గారూ? రాష్ట్రానికి పెట్టుబడుల వరద అని మంత్రులు ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డేమో … నిధుల్లేక పథకాలు వాయిదా వేశామంటున్నారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలన వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది.
పథకాల మాటున భారీ అవినీతికి పాల్పడి, దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున నిలబెట్టింది జగన్ రెడ్డి కాదా? ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ. 7 లక్షల కోట్లు. ఈ అప్పుల వల్ల ఒక్కో కుటుంబంపై రూ. 4న్నర లక్షల భారం పడింది. అప్పులు తెచ్చి సొంత ఖజానా నింపుకోడం మినహా గజం అభివృద్ధి చేయని ముఖ్యమంత్రి కల్లబొల్లి మాటలతో ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు?
పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం, టీడీపీ కట్టిన భవనాలకు వైసీపీ రంగులు వేయడం మినహా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? పోర్టుల పేరుతో నాలుగేళ్లుగా హడావుడి చేస్తున్నారేకానీ ఒక్కటైనా పూర్తి చేశారా?కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు? గత టీడీపీ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి భూములు కూడా కేటాయించింది. కొత్తగా మీరు చేసిందేంటో సమాధానం చెప్పగలరా?
ఎన్నికలకు ఏడాది ముందు పోర్టులకు రిబ్బన్ కటింగ్ చేయడం, పెట్టుబడుల సదస్సు పేరుతో మడావుడి చేయడం దేనికి సంకేతం? మీ చేతకాని పాలనతో సరై ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో సగటు పౌరుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిన వాస్తవాన్ని ముఖ్యమంత్రి అంగీకరించాల్సిందే. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రవాణాలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపి, పేదల బతుకులు దుర్భరం చేసిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడినా , విశాఖలో కాపురం పెట్టినా ఎవరికీ ప్రయోజనం లేదు.
నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో ఏపీ 40 ఏళ్లు వెనక్కుపోయింది. జగన్ రెడ్డి ఏ జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ రావణాసుర పాలనకు చరమగీతం పాడతామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించినా, జగన్ రెడ్డే స్వయంగా జనాల చుట్టు చక్కర్లు కొట్టినా రాజకీయ ప్రయోజనం శూన్యం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం. తెలుగుదేశం గెలుపు ఖాయం.