– మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి
-కులం, మతం, ఇతర ప్రలోభాలకు లొంగి జీవితాలు నాశనం చేసుకోకండి
-దొంగలు, దుర్మార్గుల్ని ఎలా దెబ్బతీయాలో దేవుడే చెప్పాడు
– పోలీసులూ.. మీకు ఇబ్బంది వస్తే మీ తరుపున పోరాడేది నేనే
– మా తమ్ముళ్లు తిరగబడితే పోలీసులు కూడా ఏం చేయలేరు
– సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ సందర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు

అధికారంలోకి రాగానే పేరూరు జలాశయం పనులు పూర్తి చేసి రైతాంగానికి న్యాయం చేస్తాను
రూ.2వేలకోట్లు కొట్టేసి, సైకో అండతో విర్రవీగుతున్న ఎమ్మెల్యేని టీడీపీ అధికారంలోకి రాగానే కబ్జా చేసిన భూములు, అక్రమాస్తులన్నింటిని కక్కిస్తాం.
దొంగలు, దుర్మార్గుల్ని ఎలా దెబ్బతీయాలో దేవుడే చెప్పాడు. మీ పిల్లల సాక్షిగా ఎవరు ఎలాంటి వారో మీరే ఆలోచించుకొని వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోండి. మంచిని ప్రోత్సహిస్తా.. చెడుని తుంచేస్తా. పోలీసులూ.. మీ అలవెన్సులు కట్ చేసి, మీ తోకలు కత్తిరించినా ఇంకా చట్టప్రకారం పనిచేయరా?
పేరూరు జలాశయాన్ని పక్కన పెట్టిన జగన్
“ స్వర్గీయ ఎన్టీఆర్ హంద్రీనీవా తీసుకొచ్చాక ఈ జిల్లా దశా దిశా మారింది. ఇక్కడి రైతాంగం నీటితో బంగారం పండిస్తుంది. పంట వేయడానికి అవకాశమున్న చోట నీళ్లులేవు. నీళ్లుంటే పంటలకు అవకాశంలేదు. దక్షిణ భారతదేశంలో తక్కువ వర్షపాతమున్న జిల్లా అనంతపురమే. పేరూరు జలాశయం 1952 నుంచి 1959 మధ్యన 1.81 టీఎంసీల సామర్థ్యంతో, రూ.కోటి 69లక్షలతో 10వేల ఎకరాలకు పైగా ఆయకట్టు కోసం నిర్మించారు.
కుడికాలువ కింద 9 వేలకు పైగా ఎకరాలు.. ఎడమ కాలువ కింద 6వేల ఎకరాల కోసం నిర్మించారు. పాదయాత్ర సమయంలో ఈ ప్రాజెక్ట్ పరిశీలించాను.నీరుంటే ఈ జిల్లా అన్నిప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావించాను. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 6 లిఫ్టులు పెట్టాలని, అప్పట్లోనే రూ. 806 కోట్లతో అంచనాలు రూపొందించాము. 1,000 ఎకరాలు భూసేకరణ చేయాలి. టీడీపీ ప్రభుత్వంలో భూసేకరణకు రూ.6కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ దుర్మార్గులు వచ్చాక మొత్తం ఆపేశారు. పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళే అన్నట్టుంది.
దొంగల్ని ఎలా శిక్షించాలో పురాణాలే చెప్పాయి
ఇక్కడొక దుర్మార్గుడు ఎమ్మెల్యే పెద్దతోపు అనుకుంటున్నాడు. సైకో అండగా ఉన్నాడని విర్రవీగుతున్నాడు. నీ ఆటలు నా దగ్గర కాదని తెలుసుకో. నిన్ను ఎవరూ కాపాడలేరు. నీ అరాచకాలు ఎక్కువయ్యాయి. ప్రజల్ని భయపడితే భయపడతారనుకుంటున్నారు. కర్రతో వస్తే, కర్రతోనే సమాధానం చెప్పండి.రామాయణం, మహాభారతంలో ఇలాంటి దొంగలు, దుర్మార్గుల్ని ఎలా దెబ్బతీయాలో చెప్పారు. ఈ దొంగల ఆరాటమంతా ప్రజల సొమ్ము కొట్టేసి కడుపులు పెంచుకోవడానికే మీ ఆరాటం..నా ఆరాటం రాష్ట్రం కోసం.
ఆగిపోయిన పేరూరు జలాశయాన్ని పూర్తి చేయడమే ధ్యేయం
పేరూరుకు నీళ్లు రాకుండా చేసే అధికారం ఈ ఎమ్మెల్యేకి ఎవరిచ్చారు? ఏం చెప్పాడు..ఏం చేశాడు? ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, చివరకు అసలు ప్రాజెక్టే లేకుండా చేశాడు. ఈ పుడింగి, కర్ణాటక నుంచి నీళ్లు తెస్తాడంటా! జీడిపల్లి, చెర్లోపల్లి, హంద్రీనీవా పూర్తి చేసిన వాళ్లకు తెలుస్తుంది ప్రాజెక్టులు కట్టడంలోని సాధక బాధకాలు. గాలికి వచ్చినవాళ్లు గాలితోనే పోతారు. రైతాంగానికి అప్పుడే నష్టపరిహారం ఇచ్చి ఉంటే, ఆ సొమ్ము వారు వేరే చోట పెట్టుబడి పెట్టి ఉంటే, దానికి రెట్టింపు సొమ్ము వచ్చేది.
టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రస్తుత ధరల ప్రకారం నష్ట పరిహారం ఇస్తాం. మరలా పేరూరు కు నీళ్లు తీసుకురావడమే నా భగీరథ ప్రయత్నం. మీకు చేతనైతే నాలుగు మంచిపనులు చేయండి. అంతేగానీ పేదల జీవితాలు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. వీళ్లంతా కేటుగాళ్లు. జైలుకు పోయి వచ్చిన వాళ్లకు భయం ఏముంటుంది? మనం పరువు, ప్రతిష్టతో బతికాం కాబట్టి, ఆలోచిస్తున్నాం.
పోలీసులు ఇప్పటికైనా చట్టపరంగా పని చేయాలి
పోలీసుల్ని చూస్తే బాధేస్తోంది. మీకు అలవెన్సులు కట్ చేసి, మీ తోకలు కత్తిరించాడు. అయినా మీరు మాత్రం ఇంకా ఈ తోపుగాళ్ల కోసం పని చేస్తున్నారు. ఇలాంటి అసాంఘిక శక్తులకు తొత్తులుగా మారి పని చేస్తే మీ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోండి. మీరు పెట్టే ప్రతి కేసుని గమనిస్తున్నా. మేం కన్నెర్రచేస్తే, మా తమ్ముళ్లు తిరగబడితే పోలీసులు కూడా ఏం చేయలేరు. నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అనవసరంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడం తప్పని చెప్పింది. పోలీసులూ.. మీకు ఇబ్బంది వస్తే మీ తరుపున పోరాడేది నేనే. అందరూ కాదు..కొందరు పోలీసుల్నే అంటున్నాం.
ప్రజల నుంచి కాజేసిన వాటిని తిరిగి కక్కిస్తా
మంచిని ప్రోత్సహిస్తా.. చెడుని తుంచేస్తా. అధికారంతో విర్రవీగుతున్న ఈ తోపుగాళ్లందరూ కర్ణాటకలో దాక్కున్నా లాక్కొస్తా. ఇళ్లు కట్టించకుండానే ఈ తోపు రూ.200కోట్లు కొట్టేశాడు. కబ్జా చేసిన ఆటోనగర్ భూముల్ని తిరిగి లాక్కొని, మరలా ఆటోనగర్ ఏర్పాటు చేస్తాను. ఇసుక, కంకర, భూములు అన్నీ కబ్జాచేస్తున్నాడు. జాతీయ రహదారి సమీపంలోని విలువైనభూముల్ని కాజేశాడు. ఇక్కడే కాదు రాష్ట్రమంతా ఇలానే చేశారు. ప్రతి ఎమ్మెల్యే సామ్రాజ్యాలు స్థాపించి, పందికొక్కుల్లా బలిసిపోయారు. గతంలో ఇల్లు అమ్ముకున్న ఈ ఎమ్మెల్యే ఎంత బలిసిపోయాడు. తోపూ.. నీ ఆస్తి రూ.2వేలకోట్లని ఇక్కడి ప్రజలే చెబుతున్నారు. నీ ఆస్తితో పంచాయితీకి పది మందిని కోటీశ్వరుల్ని చేయొచ్చు. చిల్లర మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది.
సైకోల కోసం ప్రత్యేక జైలు
తీవ్రవాదుల్ని అణచివేసి, ముఠాకోర్లను మట్టుపెట్టి, ఫ్యాక్షనిస్ట్ లను అణచివేసిన పార్టీ తెలుగుదేశం. ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువల కోసం పని చేసిన పార్టీ తెలుగుదేశం. సైకోలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు. అవసరమైతే ప్రత్యేకంగా ఒక జైలుకట్టి, దానిలో పెడతాను. భయపడటం నా డీ.ఎన్.ఏలో లేదు. మాటపడినా దానికి ఇంతకు ఇంత సమాధానం చెబుతాను. అనంతపురంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే తీరతా . గోదావరి నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేసేది తెలుగుదేశమే.
సైకిల్ స్పీడ్ పెంచి బుల్లెట్ వేగంగా దూసుకుపోదాం…
మీరు ఎవరి వల్ల నష్టపోతున్నారో ఆలోచించుకోండి. మీ పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి. కులం, మతం, ఇతర ప్రలోభాలకు లొంగి జీవితాలు నాశనం చేసుకోకండి. మీ పిల్లల సాక్షిగా ఆలోచించుకుంటే, ఎవరేంటో మీకే అర్థమవుతుంది. ఎన్నికల్లో 14కు 14స్థానాలు గెలిపించే బాధ్యత మీది, మీ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. మీరు భయపడవద్దు తమ్ముళ్లు. మీదీ ప్రాణమే.. అవతలివాళ్లదీ ప్రాణమే. మీలో మీరు కుండిపోకుండా వీరోచితంగా పోరాడండి. మనం చేసేది ధర్మ పోరాటం. సైకిల్ స్పీడ్ పెంచి బుల్లెట్ వేగంతో దూసుకెళ్దాం. మనం వస్తానే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి రైతులకు న్యాయంచేస్తాను. పేరూరు పూర్తి చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది.”