ఈ రోజు ఉదయం “మార్నింగ్ వాక్”లో నాకు నచ్చిన, పది మంది మెచ్చుకోవాల్సిన ప్రకటనను బి.ఆర్టీ.ఎస్. రోడ్డులోని ఏలూరు కాలువ బ్రిడ్జ్ దగ్గర మైక్ లో విన్నాను.
“బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కాలువల ద్వారా కృష్ణా నదీ జలాలు ప్రవహిస్తాయి. ఆ నీటిని, కాలువల దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు త్రాగునీరుగా వినియోగించుకొంటారు. దయచేసి చెత్తా, చెదారం కాలువల్లో వేయవద్దు. నీరు కాలుష్యమౌతున్నది. దోమలు వృద్ధి చెంది, వివిధ ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి – విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, కమిషనర్”. పౌరులు చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన ప్రకటన.
కమిషనర్ కు విజ్ఞప్తి: ఐదేళ్ళ క్రితం, బందరు కాలువ, ఏలూరు కాలువ మరియు రైవస్ కాలువల సుందరీకరణ పథకాన్ని ప్రారంభించారు. కొద్దిపాటి పనులు చేసిన మీదట అర్థాంతరంగా ఆపేశారు. ఏలూరు కాలువ వెంబడి కొంత దూరం నడవడానికి వీలుగా ఈ మధ్య కొంత పని చేసినట్లుంది. ఆ మేరకు మంచిదే. ఆ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి, ఐదేళ్ళ క్రితం, విజయవాడకు రు.500 కోట్లు మంజూరు చేసింది కదా! కానీ, నగరంలో డ్రైనేజీ వ్యవస్థ మాత్రం అధాన్నంగానే ఉన్నది. జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న జనరల్ ఆసుపత్రి వద్ద మురికి కాలువే దానికి ప్రబల నిదర్శనం.
“అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ”ను, పార్కులను అభివృద్ధి చేయండి. అవసరం ఉన్న ప్రతిచోట చెత్త వేయడానికి “ప్లాస్టిక్ బాక్స్”లను ఏర్పాటు చేయండి. ప్రజల నుండి చెత్త పన్ను కూడా వసూలు చేస్తున్నారు కదా! ఆ మాత్రం కూడా చేయలేరా! ఆలోచించండి.

సామాజిక ఉద్యమకారుడు