నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఇదో డకోటా… దివాలా ప్రభుత్వమని స్పష్టమైంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిలు ఏమంటారో మరి. మాకు డబ్బులు వచ్చే మార్గాలు వేరే ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అంటారా?, ముఖ్యమంత్రి సలహాదారుడైన దువ్వూరు కృష్ణ లిక్కర్ బాండ్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయన్న దానికి ఏమీ సమాధానం చెబుతారో ?
ఒక్కరు కూడా లిక్కర్ బ్రాండ్లను సబ్స్క్రైబ్ చేయలేదంటే దీని వెనుకనున్న నిజమైన పరిస్థితులు ఏమిటో బహిరంగంగా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. ఇప్పటికైనా మమ్మల్ని తిట్టడం మానేసి ప్రభుత్వ పెద్దలు నోరు మూసుకొని కూర్చోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణరాజు హితవు పలికారు.
బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మద్యం ఆదాయాన్ని పదేళ్లపాటు తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం 11500 కోట్ల రూపాయలకు లిక్కర్ బ్రాండ్లు విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీరో కూపన్ బాండ్స్ ను విడుదల చేసింది. తమకు తామే ఏ, ఏ ప్లస్ రేటింగ్ ఇచ్చుకుంది. జీరో బాండ్ కూపన్లు అంటే అసలు వడ్డీ అన్నదే లేకుండా జగన్మోహన్ రెడ్డి రుణాలను తీసుకు రానున్నారని తప్పులో కాలు వేశేరు. గతంలో 9.9 శాతం రిటర్న్స్ తో లిక్కర్ బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
పదివేల కోట్ల రుణంపై ఏటా వెయ్యి కోట్ల రూపాయలను వడ్డీగా చెల్లించడంతోపాటు, చివరకు పదివేల కోట్ల రూపాయల అసలు చెల్లించాల్సి ఉంటుంది. పదివేల కోట్ల రూపాయల రుణానికి అదనంగా పదివేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించడం అన్నమాట. 11500 కోట్ల బాండ్లను గతంలో మాదిరిగానే విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ముందుగా వడ్డి చెల్లించడానికి ఖజానాలో 1000 కోట్ల రూపాయలు ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద దమ్మిడీ లేకపోవడంతో, జీరో కూపన్ బాండ్లను విడుదల చేశారు. 11500 కోట్ల రూపాయల జీరో బాండ్లకుగాను ముందుగానే వడ్డీ మొత్తాన్ని తగ్గించుకొని, మిగిలిన మొత్తాన్ని రుణంగా అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి 11500 కోట్ల రూపాయల బాండ్లకు గాను, కేవలం 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంపై అప నమ్మకం వల్లే లిక్కర్ బాండ్లను తూ నా బొడ్డు అన్నట్టు తిరస్కరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా లిక్కర్ బాండ్లను కొనిపించారు.
లిక్కర్ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా రాలేదంటే మ్యాటర్ వెరీ క్లియర్… ఆర్థికంగా బాక్స్ బద్దలు అయింది. మనకున్న రుణ పరిమితి ఇదని చెప్పి సారా బాండ్ల సాక్షిగా ప్రజలకు అర్థమైంది. సారా బాండ్లు దివాలా కొడితే రెండు ప్రముఖ దినపత్రికలు ప్రముఖంగా వార్తా కథనాలు రాస్తే, సాక్షి దినపత్రిక మాత్రం ఈ విషయం గురించి వార్తనే రాయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం సారా బాండ్ల ద్వారా రుణ ప్రయత్నాలు ప్రారంభించగానే, కాగ్, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బిఐ అధికారులకు నేను లేఖ రాసి, పరిస్థితిని వివరించానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. పార్లమెంట్లో నా ప్రశ్నకు సమాధానం గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో మా పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బట్టలు చింపుకున్నారు. అసెంబ్లీలో ఆర్బిఐ ద్వారా తీసుకోబోయే రుణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్నే ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం బాండ్ల పేరిట రుణాలు పొందింది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట వైజాగ్ లోని భూములను తాకట్టు పెట్టి రుణాలు పొందిన విషయం తెలిసింది. ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకోకుండా, కేవలం ఆర్బిఐ ద్వారా చేస్తామని చెప్పిన అప్పుల గురించి మాత్రమే పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి నాతో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, టిడిపి తరఫున జీవీ రెడ్డి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి పురందరేశ్వరి, జీవి రెడ్డి, నేను ప్రస్తావించిన అంశాలపై మా పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఎవరు నోరు మెదపడం లేదు. దేశంలోనే అతి తక్కువగా అప్పులు చేశామని గతంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్నారు . కానీ లిక్కర్ బాండ్ల తిరస్కరణ తరువాత వారు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది.
కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లు వేళ్లు పట్టుకొని మళ్లీ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా బాండ్లను కొనిపించమని ప్రాధేయపడితే, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనికరిస్తారా?, ఒకవేళ వారు కనికరిస్తే ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇంకా దారుణంగా సర్వనాశనం చేయడానికి ముందుకు వెళ్తాడని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.
పచ్చి అబద్దాలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ప్రజలు ఏమైనా తింగరివాళ్లని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా?, అని ఆయన మండిపడ్డారు. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటున్న ప్రస్తుత తరుణంలో జగన్మోహన్ రెడ్డి అంటరానితనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. అయినా, ఆయన నయా అంటరానితనం గురించి కొత్త భాష్యం చెప్పారు. ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని అడ్డుకోవడం కూడా అంటరానితనమేనన్న జగన్మోహన్ రెడ్డి, అంటరానితనం ప్రోత్సహించే వారిపై ఏవైతే కేసులు పెడతారో, ప్రభుత్వ పథకాలను అడ్డుకునే వారిపై కూడా అదే కేసులు పెట్టాలనడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ప్రభుత్వ పథకాలను అడ్డుకునే వారిని సమాజంలో నుంచి బహిష్కరించాలట అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏదో విధంగా 30 వేల గృహాలను నిర్మించి, ఇంటికొక ఇద్దరు ముగ్గురు చొప్పున ఓట్లను చేర్పించి, రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నారా లోకేష్ ను ఓడించాలని జగన్మోహన్ రెడ్డి పథక రచన చేశారు. భూములు ఇచ్చిన రైతులకు కోర్టును ఆశ్రయించడంతో, ప్రజాధనాన్ని పణంగా పెట్టి, నిబంధనలను ఉల్లంఘించడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజధాని రైతులలో అత్యధిక శాతం మంది ఎస్సీ ఎస్టీలే. 30 శాతం మంది బీసీలు ఉండగా, అగ్రవర్గాలకు చెందినవారి సంఖ్య అతి తక్కువ. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను, రాష్ట్ర ప్రభుత్వం ఇది నా భూమని ఏమైనా చేస్తామంటే కుదరదని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఇందులో కేవలం 2700 నుంచి 2800 ఇండ్లను మాత్రమే నిర్మించినట్టుగా పార్లమెంటులో చెప్పారు. గత ఏడాది మాత్రం కేవలం 5 ఇండ్లనే నిర్మించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మూడువేల ఇండ్లు కూడా నిర్మించలేని జగన్మోహన్ రెడ్డి, తనది కాని భూమిలో ఇండ్లు నిర్మించి ఇస్తాననడం విడ్డూరంగా ఉంది.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు లక్షల టిడ్కో ఇండ్లను నిర్మించారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాలకొల్లులో ఒక గృహ సముదాయాన్ని ప్రారంభించానన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు అని చెబుతూ వారికి నిలువ నీడ లేకుండా చేసే నీచ కుటిల సంస్కృతి కలిగిన జగన్మోహన్ రెడ్డి అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారా?, చెప్పిన దాని కంటే ముందే మూడు లక్షల గృహాలు నిర్మించిన చంద్రబాబు నాయుడు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నారా?అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, జగనన్న ఇళ్ల కాలనీలన్నీ జలమయం కాగా, చంద్రబాబు నాయుడు నిర్మించిన ఇండ్లు కళ్ళెదురుగానే కనిపిస్తున్నాయి.
పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామంటే కేంద్రం అనుమతించిన రఘురామకృష్ణం రాజు అడ్డుపడుతున్నారని తప్పుడు ప్రచారాన్ని చేశారు. న్యాయస్థానాల్లో కేసు ఉన్న విషయం తెలుసుకొని కేంద్ర ప్రభుత్వమే ఇండ్ల నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేమని చెప్పింది. మరి ఆ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మేము ప్రోత్సహిస్తున్నామట. డాక్టర్ సుధాకర్ ను ఎవరు చంపారు?, కిషోర్ అనే దళిత యువకుడ్ని హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా చంపిందెవరు?
రాజమండ్రిలో ఒక దళిత యువకుడికి గుండు గీశారు. ఇప్పటివరకు నిందితులెవరో గుర్తించలేకపోయారు. అనంతపురంలోను ఓ దళిత యువకుడి పై దాష్టికానికి పాల్పడ్డారు. సుబ్రహ్మణ్యం అనే కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి డోరు డెలివరీ చేశాడు . అటువంటి అనంతబాబును తన పక్కనే కూర్చోబెట్టుకునే జగన్మోహన్ రెడ్డి అస్పృశ్యతను ప్రోత్సహిస్తూ… ఇతరుల పైకి నెపం నెట్టాలని చూస్తున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన జగన్మోహన్ రెడ్డి పెత్తందారులపై పోరాడుతానని చెప్పడం హాస్యాస్పదం.
దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల అందరి కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన జగన్మోహన్ రెడ్డి, దేశంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. జగన్మోహన్ రెడ్డి నిజమైన ఆస్తులతో పోల్చితే, ప్రతిపక్ష నేతలందరి ఆస్తులు కూడా సరిపోవన్నారు. అంటరానితనం, పెత్తందారి వ్యవస్థ పై పోరాడుతున్నాననే జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సింహభాగం పదవులను కేటాయించానని చెప్పుకోవడం సిగ్గుచేటు.
టిడిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ గా బీసీలకు అవకాశం కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికు కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన వారికే పదవి బాధ్యతలను కట్టబెట్టారు. టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా, కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ధర్మారెడ్డికి ఫుల్ అడిషనల్ చార్జ్ పేరిట ఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ విషయాన్ని రాష్ట్రంలో ని ఐఏఎస్ అధికారులు ఒక్కరూ ప్రశ్నించడం లేదు. దమ్ముంటే ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వ్యక్తిగతంగా అర్హుడు కావచ్చు కానీ, ఆయన సర్వీస్ పోస్ట్ రీత్యా అనర్హుడు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పదవులను తన బంధువులకు, లేదంటే దొంగ వ్యాపార భాగస్వాములకు జగన్మోహన్ రెడ్డి కట్టబెడుతున్నారు. నా ఎస్సీలు నా బీసీలు అనడమే తప్ప, వారికి పదవులు కట్టబెట్టింది లేదు.
రాష్ట్రంలో హోం శాఖ మంత్రి పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తానేటి వనితకు కట్టబెట్టినప్పటికీ, ఆమె కనీసం ఎస్సైని కూడా బదిలీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ముత్యాల నాయుడు, తాను మంత్రో కాదో కూడా ఆయనకే తెలియదు. రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాధికారమంతా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారి చేతుల్లోనే ఉంది.
సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి కూడా పేరు గొప్ప… అన్నట్లుగా ఉంది. ఎస్ సి, బీసీ మంత్రులకు నిర్ణయాధికారం లేదన్నది స్పష్టం అవుతూనే ఉంది. మంత్రి నారాయణస్వామి బహిరంగంగానే బాధపడుతూ ఉంటారు. ఇక మంత్రి విశ్వరూప్ పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా చూశారు. దళిత మంత్రిని మోకాళ్లపై కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే.
గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జమోరె దే
రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని బ్రష్టు పట్టించిన ఘనత మా పార్టీ దే. రాష్ట్రంలో 12,800 గ్రామ పంచాయితీలలో మెజారిటీ సర్పంచులు మా పార్టీకి చెందిన వారే, ఈ విషయాన్ని చెబుతున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుతున్నట్లుగా ముఖ్య మంత్రి బిల్డప్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశమంతా మన వైపే చూస్తున్నారని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి, దేశమంతా మనల్ని అసహ్యించుకుంటుందని తెలుసుకోవాలన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకను జగన్మోహన్ రెడ్డి అప్రతిష్ట పాలు చేశారని, ఎన్నో అబద్ధాలు చెప్పడం న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. గాంధీజీని, ఇతర మహనీయులను తక్కువ చేసి చూపడం అంటే అన్ని వర్గాల వారిని అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన ఉన్మాదాన్ని తగ్గించుకొని, అబద్ధాలు చెప్పడం మానుకోవాలన్నారు.
భక్తులకు కర్రలు ఇవ్వడం కాదు… వాక్ వే నిర్మించండి
తిరుమలలో కాలినడకన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు జగనన్న స్టిక్కర్లతో కూడిన కర్రలు ఇవ్వడం కాదని, ఒక కిలోమీటర్ మేర వాక్ వే నిర్మించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. భక్తులకు మా పార్టీ అధికార ఆయుధం గొడ్డలి, కోడి కత్తి ఇస్తారేమోనని అనుమానం వచ్చింది. ఇప్పుడు కర్రలు ఇచ్చిన తరువాత గొడ్డలి ఇస్తారేమో. తనని తాను సింహం గా చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి మాస్కులను కాలినడకన వెళ్లే భక్తులకు ఇవ్వాలని, ఆ మాస్క్ ధరించి భక్తులు వెళితే వన్య మృగాల నుంచి ప్రమాదం ఉండకపోవచ్చునని ఎద్దేవా చేశారు.
అలిపిరి నుంచి గాలిగోపురం వరకు కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి ప్రమాదం లేదు. గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. శేషాచలం అడవుల్లో ఇటీవల పుష్ప లు ఎక్కువయ్యారు. వాళ్లు అక్కడ చేస్తున్న విధ్వంసానికి వన్య మృగాలు తమ ప్రాణ రక్షణ కోసం గతిని మార్చుకున్నాయి. వన్యమృగాలతో పాటు చిరుతలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి .
క్రూర మృగాల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి వాక్ వే నిర్మిస్తామంటే దాతలు ముందుకు వచ్చి విరాళాలను అందజేస్తారు. భగవంతుడి దగ్గర చేసే కార్యక్రమాలకు భక్తులు ఎల్లవేళలా సాకారం అందిస్తూనే ఉన్నారు . భగవంతుడికి భక్తులను దగ్గర చేసే కార్యక్రమాలను చేపట్టండి. ప్రస్తుతం టీటీడీ చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తుడు, భగవంతునికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
టీటీడీ పాలకమండలి నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సిబిఐ చీఫ్ కు, కేంద్ర మంత్రులకు మా పార్టీ నాయకులు పదవులను ఆఫర్ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తా కథనం వెలువడింది. ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, దేవుడి విషయంలోనైనా అలా చేయకండి.
క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి మా మతాన్ని గౌరవించాలి. ఎవరైతే పూర్తిగా ఈ మతాన్ని ప్రేమిస్తారో, పైరవీలు చేయకుండా నిస్వార్ధంగా దేవుని సేవకు అంకితం అవుతారో అటువంటి వారికే టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.