ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని గా అమరావతి ఏర్పాటు పై చెలరేగిన వివాదం లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వెలువరించిన తీర్పు- ఈ విషయం లో చివరి మాట కాకపోవచ్చు. ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను ఉనికి లోకి తీసుకు రావాలని ;మూడు నెలల్లో – అభివృద్ధి చేసిన ప్లాట్ లను రైతులకు అప్పగించాలని హై కోర్ట్ ఇచ్చిన తీర్పును అమలులోకి తీసుకు రాగలిగిన పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఇందుకు రెండు కారణాలు కనపడుతున్నాయి.
ఒకటి- రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్థితి ఇందుకు సహకరించదు. రెండవది- ప్రభుత్వానికి మనసు లేదు. కానీ, హై కోర్టు తీర్పును అమలు చేయకపోతే- కోర్టు ధిక్కార నేరం అవుతుంది.అందువల్ల- సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయడమే ప్రభుత్వానికి ఒక ‘ఎస్కేప్ రూట్’ అని అంటున్నారు. దీనివల్ల, గాలి పీల్చుకునే సమయం ప్రభుత్వానికి లభిస్తుంది. సుప్రీమ్ కోర్టులో ఈ అప్పీల్ ఇప్పట్లో తేలక పోవచ్చునని కొందరు న్యాయవాదులు అంటున్నారు. మరో పక్క; అమరావతి రైతు ఉద్యమం వచ్చే ఎన్నికల వరకు సజీవంగానే ఉంటుంది.
అమరావతి-తిరుపతి పాదయాత్ర విజయవంతం గా పూర్తి చేసిన రైతులు- అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేయడానికి కూడా సమయం లభిస్తుంది. దీనితో, రాష్ట్రం లోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేసినట్టు అవుతుంది.ఈ మొత్తం వ్యవహారం లో ప్రభుత్వం మాత్రం ‘ఆత్మ రక్షణ’ లో పడుతుంది.
మరో పక్క, ఎన్నికల వాతావరణం రాష్ట్రం లో క్రమక్రమంగా అలుముకుంటున్నది. వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటూ టీడీపీ గట్టిగానే ప్రచారం చేస్తున్నది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా; అమరావతి రాజధాని అనే అంశం మాత్రం ఒక భావోద్వేగ అంశం గా మారిపోతుంది. టీడీపీ దీనిని పెద్ద ఎత్తున చేపడుతుంది. హైకోర్టు తీర్పు ను-టీడీపీ…
తన వాదనకు దన్నుగా ప్రజల ముందుకు తీసుకువస్తుంది. ఇది కాదు అని, ‘మూడు రాజధానులు’ అంటూ వైసీపీ ప్రచారం చేయడం అంత సులభం కాకపోవచ్చు. చివరకు- ఇదే అతిముఖ్యమైన ఎన్నికల నినాదంగా మారిపోతుంది.
అయితే, ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గాలి ఆడాలంటే- సుప్రీం కోర్ట్ కు వెళ్లడం తప్ప మరో మార్గం ఉన్నట్టు కనిపించదు.
లేకపోతే, ‘అయిందేదో అయింది… ఇంకెందుకు సాగతీయడం…’అన్న భావనతో, ప్రభుత్వం సర్వ శక్తులూ కూడదీసుకుని….; యుద్ధ ప్రాతిపదిక పై – హై కోర్ట్ చెప్పినట్టుగా చేసినప్పటికీ; క్రెడిట్ మాత్రం చంద్రబాబు ఖాతాలో జమ అవుతుంది.
చంద్రబాబు పట్టుదల వల్లే …అమరావతి నిలబడిందని ప్రజలు భావిస్తారు. కోర్టు తీర్పు అమలు చేయకపోతే, వైసీపీ ఆత్మరక్షణలో పడిపోతుంది. రైతులు రాష్ట్రం అంతా పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతారు.అమరావతి పై ప్రభుత్వానికి మూడేళ్ళుగా ఉన్న చిన్న చూపును పరిగణనలోకి తీసుకుంటే, హై కోర్ట్ తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని భావించడం కష్టం.
కోర్ట్ తీర్పును అమలు చేసినా… చేయక పోయినా- రాజకీయంగా టీడీపీకే లాభిస్తుంది. , ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాజకీయ మైలేజ్ వచ్చేది మాత్రం టీడీపీకే. అయినప్పటికీ, కొంత సమయ వెసులుబాటు కోసం -రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్ట వచ్చుననేది పరిశీలకుల భావన.