– ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిన సుమారు ₹3,200 కోట్ల ఆర్గనైజ్డ్ దోపిడీ
– దర్యాప్తు పూర్తయ్యే సరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం
(నవీన్)
2019 ఎన్నికలకు ముందు, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేసిన కీలక వాగ్దానం దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని. అయితే, ఐదేళ్ల పాలన ముగిసేసరికి, ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరాల ప్రకారం.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిన, సుమారు ₹3,200 కోట్ల ఆర్గనైజ్డ్ దోపిడీ. దర్యాప్తు పూర్తయ్యే సరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం వుంది. నిషేధం అనే సామాజిక లక్ష్యం, ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ స్కామ్ మూడు మూడు ప్రధాన దశల్లో జరిగింది.
1. ప్రభుత్వ గుత్తాధిపత్యం: అధికారంలోకి రాగానే, ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి, మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కిందకు తెచ్చారు. అమ్మకాలను నియంత్రించి, అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా, అసలు ఉద్దేశ్యం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే!
2. “జె-బ్రాండ్” వ్యూహం: ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక, దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు. వాటి స్థానంలో, ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, అధికార పార్టీ నేతలతో సంబంధం వున్న వారి డిస్టిలరీల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో (“జె-బ్రాండ్లు”) మార్కెట్‌ను ముంచెత్తాయి. ఫలితంగా, ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా 53% నుంచి 5.3%కి పడిపోయింది. వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయాలు లేక, “జె-బ్రాండ్ల” నే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు.
3. పారదర్శకతకు పాతర: స్కామ్ కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు. గతంలో ఉన్న పారదర్శకమైన, ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థ “సి-టెల్”ను రద్దు చేశారు. దాని స్థానంలో, అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ “ఆఫర్ ఫర్ సేల్” (OFS) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా, తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ, ఇతరులను పక్కనపెట్టారు. ఇదే కిక్‌బ్యాక్‌ల పథకానికి పునాది వేసింది.
ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి, దానిని చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు.
* కిక్‌బ్యాక్‌లు: తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు, దాని రకాన్ని బట్టి ₹150 నుంచి ₹600 వరకు లంచం/కిక్‌బ్యాక్‌గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది. ఈ లెక్కన, ఐదేళ్లలో సుమారు ₹3,200 కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు. లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు.
* నగదు లావాదేవీలు: ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, డిజిటల్ చెల్లింపులను నిషేధించి, కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు. ఐదేళ్లలో జరిగిన ₹99,413 కోట్ల అమ్మకాల్లో 99.38% నగదు రూపంలోనే జరిగాయి. ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది.
* మనీ లాండరింగ్: ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్‌కు తరలించడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, “ఈడీ ఎంటర్టైన్మెంట్స్” అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లధనంగా మార్చారని సిట్ కనిపెట్టింది.
* లిక్కర్ బాండ్లు: వీటన్నిటికీ మించి, భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి, APSBCL ద్వారా అధిక వడ్డీకి (9.62% వరకు) వేల కోట్ల రూపాయల రుణాలు (బాండ్లు) సేకరించారు. ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది.
ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం “జె-బ్రాండ్ల”లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి అనేక మరణాలు, అనారోగ్యాలు ఉదాహరణలుగా వున్నాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం, 2019-24 మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ, మూత్రపిండాల వ్యాధుల కేసులు 100% పెరిగాయి.
ప్రస్తుతం ఈ కేసుపై సిట్ దర్యాప్తు చేస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డిని “ప్రధాన సూత్రధారి”గా పేర్కొంటూ, మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్టు చేసింది. అయితే, ఇది రాజకీయ కక్ష సాధింపేనని, తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని వైఎస్సార్సీపీ వాదిస్తోంది.
మొత్తం మీద, మద్యపాన నిషేధం అనే ప్రజా సంక్షేమ హామీ, ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారితీసిందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ప్రభుత్వ గుత్తాధిపత్యం, అపారదర్శక విధానాలు, రాజకీయ-అధికార-కార్పొరేట్ కూటమి కలిసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.