-ప్రధాన న్యాయమూర్తి చంద్ర చూడ్, న్యాయమూర్తి నరసింహ లకు శిరసు వంచి నమస్కరిస్తున్న
– ఈ తీర్పు ద్వారా, పై కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందనే ధైర్యం, భరోసా వచ్చింది
– అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెరీ అన్ ప్లెజెంట్ ఆర్డర్ అన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం
– మాజీ సొలిసిటర్ జనరల్ ప్రాధేయపడడంతో అవినాష్ రెడ్డి అరెస్టుపై సోమవారం వరకు స్టే
– సిబిఐ, ఎన్ ఐ ఏ ను జగన్మోహన్ రెడ్డి నమ్మరు కానీ సిఐడి ని మాత్రం అందరూ నమ్మాలట…
– సీఐ శంకరయ్య, డాక్టర్ వైయస్ అభిషేక్ రెడ్డి, వైయస్ ప్రతాపరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారం కాదా?
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ పై అత్యంత గౌరవాన్ని పెంచేదిగా ఉన్నదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. ఇటీవల న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పులు ప్రజల్లో భయాందోళన కలుగజేశాయి. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, పైకోర్టుకు వెళితే మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం , ధైర్యం, భరోసా ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తూ, హైకోర్టు తీర్పుపై ఆయన గగుర్పాటుకు గురయ్యారు. ఇది వెరీ అన్ ప్లెజెంట్ ఆర్డర్ అని వ్యాఖ్యానించారు. దేశ న్యాయవ్యవస్థకు నాయకత్వం వహించే ఏ న్యాయమూర్తి నేతృత్వంలోనైనా ఇటువంటి తీర్పును ఊహించి ఉండరనే అర్థం వచ్చేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ చంద్ర చూడ్, నరసింహ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న తన క్లైంట్ అవినాష్ రెడ్డి ని సిబిఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని, సోమవారం వరకు అరెస్టుపై స్టే ఇవ్వాలని సీనియర్ కౌన్సిల్, మాజీ సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ ప్రాధేయపడడంతో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, సోమవారం వరకు స్టే ను మంజూరు చేసింది. సోమవారం 10:30 గంటలకు రాజ్యాంగ కేసులు పరిశీలించాల్సి ఉందని, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఈ కేసులో వాదనలను ఉదయం 9:15 గంటలకు వింటానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొనడం జరిగిందన్నారు. ఇంటరాగేషన్ చేసే అధికారి ప్రశ్నలు అడిగే విధానంతోనే అవతలి వ్యక్తి సాంకేతికంగా విచారణ అధికారికి దొరికే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రశ్నలను రాతపూర్వకంగా, సమాధానాలు రాతపూర్వకంగా ఇచ్చే వెసులు బాటును కల్పించడం అగెనెస్ట్ ప్రొసీజర్ ఆఫ్ లా అని, పోలీసుల విచారణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న నిబంధనను డాక్టర్ వైయస్ సునీత తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూత్రా నవ్వుతూ, ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లారు.
సాధారణంగా ఇది అసాధారణ ఆర్డర్ అని చెప్పాలి. ఇటువంటి ఆర్డర్ ఇచ్చి ఉండవలసింది కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి మనోవేదన కలిగించడం బాధాకరం. సోమవారం నాటికి మా పార్టీ నాయకులు 10 మంది న్యాయవాదులను ప్రయోగిస్తారేమో. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తమ పార్టీ నాయకత్వం పూర్తి మద్దతు తెలియజేస్తుందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన, బాధ, న్యాయానికి ఇలా అయిపోయిందేంటి అన్న వేదనను ఆయన కళ్ళల్లో చూసిన తర్వాత గట్టిగా మాట్లాడడానికి సీనియర్ న్యాయవాదులు కూడా ధైర్యం చేయరనే అనుకుంటున్నానని తెలిపారు. సునీత కోరుకుంటున్న న్యాయానికి ఈ దశలో మెయిన్ ఫౌండేషన్ అయిన ఒక అరెస్టు జరిగితే, ఆ తరువాత హత్య కేసులోని విస్తృత కోణం వెలుగులోకి వస్తుందేమో. ఇంకా ఏమైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా అన్నది చూడాలి. కీలక అరెస్టు తరువాత చెరసాల పాలయ్యావా ఓ సంబరాల రాంబాబు అనే నేపథ్య గీతం చూడవచ్చా? అన్న రఘురామకృష్ణం రాజు, హైకోర్టు తీర్పుపై సునీత సుప్రీం కో ర్టు లో అప్పీల్ చేస్తుందని ఊహించలేదు. 25వ తేదీ వరకు ఆగండి సార్ అంటే ఆగుతారని తమ పార్టీ పెద్దలు అనుకున్నారని ఎద్దేవా చేశారు.
సాక్షి దినపత్రికకు నిందితులకు సంబంధం ఏమిటి?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి, సాక్షి దినపత్రికకు సంబంధం ఏమిటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్ వివేక హత్య అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన శవాన్ని వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డిలు తాకారు. వైయస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ ను ఆయన అల్లుడు, కూతురు గోప్యంగా ఉంచమని చెప్పారని, ఆ లేఖను చూసి ఉంటే తమకు ఆయనది హత్య అని తెలిసేదని నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు పేర్కొన్నట్లుగా సాక్షి దినపత్రిక కథనంలో రాయడం విడ్డూరంగా ఉంది.ప్రజలను గందరగోళపరచడానికి సాక్షి దినపత్రిక ఈ రకమైన రాతలు రాస్తోంది. ఒక్క ఛాన్స్ అంటే గెలిపించిన ప్రజలను గొర్రెలుగా భావి స్తున్నారని, అందుకే తాము ఏమి చెబితే దాన్ని నమ్ముతారని ఉద్దేశంతో కట్టు కథలను రాస్తున్నారని ధ్వజమెత్తారు. రక్తపు మడుగులో పడి ఉండి, తల వెనుక భాగం లేచిపోయి, ఒళ్లంతా చీరేసి ఉంటే… గుండెపోటు తాళలేక ఆయనే గొడ్డలితో నరికేసుకొని చనిపోయాడనుకోవాలా?, ఇడియట్స్… బుద్ధుందా అంటూ రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. లేఖ చూసి ఉంటే హత్య అని తెలుసుకొని ఉండేవారా?
ఎందుకు ఈ రకమైన కహానీలు చెబుతున్నారు. ఎవరి తరుపున రాశాడు సాక్షి. వాళ్ల ఓనర్ తరఫున రాశాడా?. డ్రైవర్ ప్రసాద్ తనని హింసించాడని, తనకు ఏదైనా సరే ప్రసాద్ ను వదల వద్దని అని వైయస్ వివేకానంద రెడ్డి తో తామే లేఖ రాయించు కున్నామని దస్తగిరి తేల్చి చెప్పాడు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఆ లేఖను పంపితే, అది అత్యంత ఒత్తిడిలో వైయస్ వివేకానంద రెడ్డి రాశాని తేలింది. ఒక అబద్ధాన్ని పదేపదే మాట్లాడి, నిజం చేయాలనే తపనతో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సాక్షి దినపత్రికను నిర్వహిస్తున్న వారి తప్పనగా కనిపిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత ఒత్తిడిలో లేఖ రాసినట్టుగా తెలిసింది. అప్పటికే ఆయన చేతి పై గాయం చేయడంతో, పేపర్ పై రక్తం పడింది. వీరందరిలో ప్రసాద్ అనే వ్యక్తి ఒక్కరే మంచివారు. అందుకే ఆయన్ని హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. లేఖ రాయించుకున్న తరువాతే వైఎస్ వివేకాను హత్య చేశారని సిబిఐ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గుండెపోటు స్టోరీ కంటిన్యూ చేయాలని తొలుత భావించారు. ఉదయం 6 గంటల పది నిమిషాలకు వైయస్ వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకున్న ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, రక్తపు వాంతులు చేసుకుని వైయస్ వివేకానంద రెడ్డి మరణించినట్లుగా ఆయన బావమరిది శివ ప్రసాద్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. శివ ప్రసాద్ రెడ్డి , అదే విషయాన్ని వైయస్ అవినాష్ రెడ్డికి తెలియజేశారు. అప్పటివరకు వైయస్ అవినాష్ రెడ్డి పై అనుమానం వచ్చే అవకాశమే లేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శంకరయ్య, వైయస్ భాస్కర్ రెడ్డి అన్నయ్య మనవడు డాక్టర్ వైయస్ అభిషేక్ రెడ్డి, వైయస్ ప్రతాపరెడ్డిలు ఇదే విషయమై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు.
ఇవి ఆధారాలు కాదా?
హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పింది తప్ప, సిబిఐ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి దినపత్రిక, న్యాయవాది నిరంజన్ రెడ్డి చెబుతున్నారన్నారన్న రఘురామకృష్ణంరాజు, సీఐ శంకరయ్య, వైయస్ అభిషేక్ రెడ్డి, ప్రతాపరెడ్డి లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారాలు కాదా అని ప్రశ్నించారు. తమకట్టు కథలతో న్యాయమూర్తులను నమ్మించారు. 2021లో అప్రూవర్ గా మారిన దస్తగిరి, 2020 లోనే ఈ వివరాలన్నీ స్పష్టంగా చెప్పారు. వైఎస్ వివేక హత్య అనంతరం గదిలోకి ఎవరు రాకుండా భాస్కర్ రెడ్డితలుపులు వేయించి, రక్తపు మరకలను తుడిపించి వేశారని సీఐ శంకరయ్య తెలిపారు . భాస్కర్ రెడ్డి కి తెలియకుండా ఇనాయితుల్లా అనే వ్యక్తి వైఎస్ వివేక శవాన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను డాక్టర్ వైఎస్ సునీతకు పంపించారు. ఫోటోలను చూసిన వైయస్ వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కూతురు సునీత లు హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయాలన్నీ శంకరయ్య 161 స్టేట్మెంట్లో పూసగుచ్చినట్లు వివరించాడు.
164 స్టేట్మెంట్ ఇచ్చే లోపే అప్పటివరకు సస్పెన్షన్ లో ఉన్న ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగు ఇవ్వడంతో, 164 స్టేట్మెంటు ఇవ్వలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ విషయాలన్నీ 2020, 2021 లోను శంకరయ్య తెలియజేశారు. హత్యకు ముందు, తరువాత కలిసిన హంతకులు, సూత్రధారులు రక్తపు మరకలను తుడిచి వేసి, గుండెపోటుతో మరణించారని చెప్పాలని తీర్మానించుకున్నారు. హైదరాబాదులోని జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట విజయసాయి రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై స్టే వచ్చిందని న్యాయం జరుగుతుందన్న సజ్జల రామకృష్ణారెడ్డి, సిబిఐది అన్యాయం, ఇదే న్యాయమని పేర్కొన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని దానికి సజ్జల, జగన్మోహన్ రెడ్డిలు ఏమి సమాధానం చెబుతారోనన్న రఘురామకృష్ణం రాజు, ఇది మీకు అవసరమా అని ప్రశ్నించారు. నిజంగానే హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేకపోతే ఇంత చెత్తంతా రాయరు. ఇది పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. తాను కూడా ఈ పార్టీ సభ్యుడనే. ఈ హత్య కేసుతో నీకేంటి సంబంధం. నీ తమ్ముడని సాక్షిలో అడ్డగోలుగా రాస్తున్నావా? అంటూ నిలదీశారు.
పార్టీని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు?
ఎన్ఐఏ, సిబిఐ లను నువ్వు నమ్మవు కానీ, సిఐడిని మాత్రం అందరూ నమ్మాలి. తనని తీసుకువెళ్లి కొట్టి చంపే ప్రయత్నం చేశారు. శ్రావణి పై మరోసారి పిటి కేసు పెట్టి అరెస్టు చేశారు. మార్గదర్శిలో ఏమీ దొరకకపోయినా, ఏదో దొరికించుకోవాలని జగన్మోహన్ రెడ్డి పడే తాపత్రయం చూస్తుంటే, ఈ పార్టీని ఎక్కడకు తీసుకు వెళ్తున్నారు. పార్టీ సభ్యులు ఏమైపోవాలని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్ ప్రతాపరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. ఒళ్లంతా చీరేసి ఉంటే, ఇది హత్య అని లేఖ చూసి ఉంటే గుర్తుపట్టే వారమని నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు పేర్కొన్నట్లు సాక్షి దినపత్రికలో కథనం రాయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నిందలు వేసే ప్రయత్నం మీ చూస్తుంటే… మీకు ఏమైనా మతి దొబ్బిందా అనే అనుమానం కలుగుతోంది . ప్రజలు అసహించుకుంటున్నారన్న సిగ్గయినా లేదా? అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఈ హత్యా రాజకీయాలు ఆపేయండి. పులివెందులలో హత్యా రాజకీయాలు ఆగిపోవాలన్నదే డాక్టర్ సునీత తాపత్రయం. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలన్నదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నం కాగా, జగన్మోహన్ రెడ్డి ప్రతిచోట ఒకే అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు మీడియా లేదని, పత్రికా లేదని, సోషల్ మీడియా కూడా లేదని, తాను మీ బిడ్డనని శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాంధ్రలో చెప్పుకుంటూ వెళ్తున్నారు.
ప్రజలందరికీ మీరే బిడ్డ అంటే జనం నమ్మేస్తారా?, సాక్షి దినపత్రిక ఎవరిది?. సాక్షి దినపత్రిక, ఛానల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వందలాది మందిని నియమించుకొని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అవినాష్, సునీత, రాజశేఖర్ రెడ్డి, ముస్లిం యువతీ ఫోటోలు పెట్టి నాన యాగి చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. సాక్షి పేపర్ మీది అయినప్పటికీ, మీదేనని మీరు చెప్పుకోలేరు. ప్రజలందరికీ బిడ్డనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, తల్లి పుట్టిన రోజు మాత్రం ఆమెను కలిసేందుకు వెళ్లరు. చెల్లితో మాట్లాడరు. మరొక చెల్లి కోర్టులో. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, తల్లిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంకా ఈ పార్టీ సభ్యుడైన తాను ఈ పార్టీ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నాను. పార్టీ పుత్రికైన సాక్షి దినపత్రిక రాస్తున్నదేమిటి. సాక్షి రాతలు చూస్తుంటే, హత్య కుట్ర లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి, భారతీల ఇన్వాల్వ్మెంట్ ఉందేమోననే అనుమానం ప్రజలకు కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి తన సోదరుడిపై ప్రేమ ఉండవచ్చు. దానికి పార్టీ బలై పోవాలా?, పార్టీ మీది కాదు… మనందరి ఆస్తి. మీ తమ్ముడి కోసం ప్రజలందరూ పార్టీని దూరం చేసుకునే పరిస్థితిలోకి తీసుకువెళ్తే ఎలా?. ఇది ఇంతటితో ఆపివేయండి. పార్టీ ప్రతిష్టను మరింతగా బజారుకిడ్చే పనులు చేయవద్దు.
ఒకవైపు వై నాట్ 175 అంటూనే, మరొకవైపు ఒక్క స్థానంలో కూడా గెలువ లేని పనులు చేస్తే ఎలా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య కేసు నిజ దోషులు ఎవరో సిబిఐ ని తేల్చనివ్వండి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా తీర్పునిచ్చి, ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని నమ్మకాన్ని కలిగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ చంద్ర చూడ్, న్యాయమూర్తి నరసింహ లకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.