– దమ్ముంటే మీరు పార్టీ పరంగా ఇస్తామన్న 60 శాతం రిజర్వేషన్ తో జాబితాను వారం రోజులలో ప్రకటించాలి
– నామినేటెడ్ పదవులలో బిసి లకు ఎంత మందికి న్యాయం చేశారు?
– బిసి లను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతాం
– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్
హైదరాబాద్: ఇది ప్రజా ప్రభుత్వం కాదని… దగా ప్రభుత్వం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బిసి లకు రాజకీయం, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా బిసి లకు తీరని మోసం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గాలకు న్యాయం చేస్తారనే నమ్మకంతో, ప్రభుత్వం, మంత్రుల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు తెలిపినట్లు చెప్పారు.
పార్లమెంట్ లో బిల్లు ఆమోదించి 9 వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్దత లభిస్తుందని బిల్లు పెట్టిన సమయంలోనే తాము ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి నుండి కూడా బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ల విషయంలో చిత్తశుద్దితో లేదని విమర్శించారు. NTR, చంద్రబాబు, వైస్సార్, కేసీఆర్ ల హయాంలో కూడా బిల్లును ఆమోదించి పంపినా ఆమోదం పొందలేదని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మాత్రం ఆలోచన లేకుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బిసి వర్గాలను మభ్య పెట్టే కుట్రతోనే బిల్లు, ఆర్డినెన్స్, జిఓ ల పేరుతో కాలయాపన చేసిందని, అనేక డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.
బిసి ల పట్ల నిజంగా ప్రేమ ఉంటే బిల్లుకు చట్టబద్దత కోసం రాష్ట్రపతిని ఎందుకు కలవలేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పై ఎందుకు వత్తిడి తీసుకురాలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ వంటి అగ్రనేతలు ఎవరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా పారదర్శకంగా జరగలేదని అసెంబ్లీలో ప్రభుత్వం అంగీకరించినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సమాజంలో 50 శాతంకు పైగా ఉన్న బిసి లకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం కేటాయించి అవమానిస్తారా ? అని ప్రశ్నించారు.
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో రేవంత్ రెడ్డి బిసి లను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ లతో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే మీరు పార్టీ పరంగా ఇస్తామన్న 60 శాతం రిజర్వేషన్ తో జాబితాను వారం రోజులలో ప్రకటించాలని సవాల్ చేశారు. సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ని తీసుకొచ్చి కామారెడ్డి సభలో ప్రకటించిన హామీలే అమలు కు నోచుకోలేదని అన్నారు. స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం బిసి లకు తీరని అన్యాయం చేస్తే బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీ కులగణన లో తెలంగాణ ను ఆదర్శంగా ప్రచారం చేయడం విచారకరం అన్నారు.
బిసి లకు ఏడాదికి 20 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పినా నేటికీ ఒక్క పైసా ఇవ్వలేదని, కాంట్రాక్టులు ఇస్తామని అవి కూడా అమలు చేయడం మరిచారని ధ్వజమెత్తారు. కనీసం మీ చేతుల్లో ఉన్న నామినేటెడ్ పదవులలో బిసి లకు ఎంత మందికి న్యాయం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం లోని వివిధ శాఖలలో ఉన్నత పదవులలో కూడా బిసి లకు సముచిత స్థానం కల్పించలేదని, బిసి లలో సమర్థులైన అధికారులు లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన తర్వాత ఒక్క బిసి వర్గం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ప్రజా వంచక ప్రభుత్వంగా మారిందని ధ్వజమెత్తారు.
బిసి లను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతాం అని హెచ్చరించారు. బిసి లకు న్యాయం జరిగే విధంగా మంత్రులు ప్రభుత్వం పై తీవ్ర వత్తిడి తీసుకురావాలని కోరారు. పార్టీలకు అతీతంగా బిసి లు జిల్లాలలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు బిసి సమాజం ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని అన్నారు. తమతో కలిసి వచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి సంఘాలను కలుపుకొని సమగ్ర కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వం పై పోరాడతామని హెచ్చరించారు. తెలంగాణ తరహాలో మరో ఉద్యమం చేపడతామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిసి సమాజం వదలబోదని హెచ్చరించారు.