– ఇద్దరివీ మూసీ నోళ్ళు
– హరీశ్ రావు అసత్య వ్యాఖ్యలపై నాగేశ్వరరావు ఎదురుదాడి
హైదరాబాద్: తెలంగాణను విద్యుత్ రంగంలో నట్టేట ముంచిన బీఆర్ఎస్ దొంగలు… ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పటంతో ఇప్పుడు మైండ్ కూడా దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవటం… జూబ్లీహిల్స్‌లో బావ–బామ్మర్ది కుట్రలకు ప్రజలు తగినగానే బుద్ధి చెప్పటం… దీంతో ఏమి మాట్లాడాలో చేతకాక విద్యుత్తు ప్లాంట్లపై అవినీతి అంటూ దారితప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నాయకుల వేషాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, మూసీలో కంపు పారదోలి గోదావరి నీళ్లు తీసుకొస్తామంటే… “లక్ష కోట్ల అవినీతి” అంటాడు బామ్మర్ది! సిటీకి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమల భూములను కన్వర్షన్ చేసుకునేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వకముందే… “రూ. 5 లక్షల కుంభకోణం” అంటున్నాడు. “బామ్మర్ధి కంటే నేనేం తక్కువనా!” అన్నట్టుగా ఈరోజు బావ రూ.50 వేల కోట్ల కుంభకోణం అని మరో అబద్ధం ఎత్తుకున్నాడు. వీళ్ల ప్రవర్తన చూసి మొత్తం తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.
బీఆర్ఎస్ అవినీతి–దుర్వినియోగాల అసలు వాస్తవాలు ఇష్టమొచ్చిన ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, తెలంగాణ డిస్కంలను రూ. 90 వేల కోట్ల అప్పుల్లో ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కర్లేనప్పుడు కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. బొగ్గు లేని దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి ప్రజలకు భారం – నాయకులకు లాభం అనే కుట్రను అమలు చేశారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్కోను దెబ్బతీశారు.
ఎన్టీపీసీ విద్యుత్తు విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం–కుట్ర
రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణకు రావాల్సి ఉండగా… బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేవలం 1600 మెగావాట్లకు మాత్రమే ఒప్పందం చేసుకొని, మిగతా 2400 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణకు రాకుండా అడ్డుకుంది. దామరచర్లలో తమ సొంత ప్లాంట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్టీపీసీ ప్లాంట్ ఆలస్యానికి కారణమైనది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడే ఒప్పందం చేసుంటే ఇప్పుడు ఆ 2400 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణకు అందుబాటులో ఉండేది.
అవినీతి పై న్యాయ విచారణ కొనసాగుతుంది
యాదాద్రి–భద్రాద్రి విద్యుత్ నిర్మాణాల్లో జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్‌తో న్యాయ విచారణ చేపట్టింది. ఏ రోజైనా ఈ అవినీతి బయటపడుతుందన్న భయం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. అందుకే హరీశ్ రావు గారు ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి భద్రాద్రి–యాదాద్రి ప్లాంట్లు ప్రారంభించి వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపినది బీఆర్ఎస్. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో ఫెయిల్ అయిన కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి, యూనిట్ విద్యుత్ రేటును ₹9 వరకు పెంచారు. బొగ్గు–నీటి వనరులు లేని ప్రాంతంలో కూడా యాదాద్రి ప్లాంట్ నిర్మించి అవివేక నిర్ణయాలతో భారీ నష్టం కలిగించారు.