– ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ
– స్పీకర్ తీర్పు పై మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: రాహుల్ గాంధీ “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైంది. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం – ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని నిర్లజ్జగా ధిక్కరించడం – ఇదీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపం.
“సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ.