తెలుగునాట పొద్దున్నే టీ, కాఫీలు తాగటం దైనందిన జీవితంలో భాగమైనట్టే ఈనాడు చదవటం కూడా అంతే అలవాటు తెలుగువారికి. 49 సంవత్సరాలుగా ఈనాడు తెలుగువారి జీవితంలో భాగమైపోయింది. తెలుగు పత్రికారంగ గతినే మార్చేసింది. అటువంటి ఈనాడు తన పాలనలో అవినీతిని బయటపెట్టిందని దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్‌రెడ్డి మార్గదర్శిపై యుద్దమే ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే తమ ప్రభుత్వాలను మార్గదర్శిపైకి పంపించినా ఖాతాదారుల విశ్వాసం చెక్కుచెదరలేదు. కొంతమంది శిఖండులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఫిర్యాదులు చేయించినా, స్వయంగా సీఎం రంగంలోకి దిగి మార్గదర్శికి వ్యతిరేకంగా చెప్పినా ఖాతాదారులు ఎవరూ మార్గదర్శిని అనుమానించలేదు. మళ్లీ చరిత్ర పునారవృతం అయింది. ఈరోజు వైఎస్ తనయుడు జగన్ తన పాలనలో తప్పులను ఈనాడు-ఈటీవీ ఎండగడుతున్నందుకు కక్షకట్టి మార్గదర్శిని దెబ్బతీయాలని తన సమస్త అధికారాలను ప్రయోగిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ఖాతాదారుల్లో అపనమ్మకాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే పత్రిక, ఛానెళ్లు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ మూకుమ్మడిగా మార్గదర్శి వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ ఖాతాదారులు ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. మార్గదర్శి పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు.
తమ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి రామోజీరావు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు. మనపై ఇంత నమ్మకం ఉంచిన ప్రజలకి కష్టం, నష్టం వస్తే అది తనదిగా భావిస్తారు. అందుకే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా, ప్రజలను పాలకులు మోసం చేస్తున్నా ఉపేక్షించరు. పదవులు, చట్ట సభ సభ్యత్వాలు ఆశించరు. ఏ సన్మానాలు, సత్కారాలు తీసుకోరు, చేసుకోరు. నిరంతరం పేపర్లో, టీవీలో ముఖం చూపించుకోవాలనే తాపత్రాయాలు లేవు. తెల్లని దుస్తుల్లో చిన్న ఉంగరం కూడా పెట్టుకోకుండా అత్యంత సింపుల్‌గా ఉంటారు. 87 ఏళ్లు వచ్చినా ఉదయం పదింటికల్లా ఠంఛనుగా ఆఫీసుకు వచ్చి రాత్రి పొద్దు పోయే వరకు పనిచేస్తూనే ఉంటారు. పత్రికా ప్రకటనల కోసం అని, స్వీయ వ్యాపారాలు కోసమని తప్పుడు వ్యక్తులతో రాజీపడరు. తాను నష్టపోయినా సరే ధర్మం వైపు నిలబడతారు. అందుకు ఇక్కడ రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి.
2014లో ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాకా అమరావతి ప్రారంభించినప్పుడు అనేకమంది ఇన్వెస్టర్లు ఏపీకి వెళ్లి పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ రియల్‌ఎస్టేట్ తగ్గి ఏపీ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. జగన్ సీఎం అవగానే అమరావతిని విధ్వంసం చేయటం మరల ఏపీలో రియల్ ఎస్టేట్ పడిపోయి తెలంగాణలో పెరిగింది. ఇదే విషయం తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో మూడు ఎకరాలు అమ్మి ఏపీలో ఒక ఎకరం కొనేవారు, ఇప్పుడు ఏపీలో మూడెకరాలు అమ్మి తెలంగాణలో ఒక ఎకరం కొంటున్నారు అని చెప్పారు. అది వాస్తవం కూడా. రామోజీరావు తన స్వార్థం చూసుకునే వారైతే అమరావతి పడిపోతే హైదరాబాద్‌లో ఉన్న తన
రామోజీ ఫిలింసిటీ భూముల విలువ మరింత పెరుగుతుంది. కానీ ఆయన అమరావతి రైతుల ఉద్యమంలో న్యాయం ఉందని నమ్మారు. అందుకే ఆ ఉద్యమానికి అండగా నిలబడ్డారు.
రెండో ఉదాహరణ
రామాయణంలో రాముడు సీతమ్మ తల్లి కోసం అన్వేషిస్తున్న సమయంలో సుగ్రీవుడు సహాయం తీసుకున్నాడు. నిజానికి అతని అన్న వాలి గతంలో అనేకసార్లు రావణాసురుడిని చితకబాదాడు. వాలి అంటే రావణుడికి కూడా చచ్చేంత భయం. తన స్వార్థం కోసమైతే వాలితో స్నేహం చేయాలి రాముడు. కానీ బలహీనుడైనా సరే సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు.
కారణం వాలి అధర్మం వైపున్నాడు కాబట్టి. కష్టాలు వచ్చినా సరే ధర్మం వైపే రాముడు ఉన్నాడు. రామోజీరావు కూడా సీఎం అవగానే జగన్ ఫిలింసిటీకి వచ్చి కలిసి స్నేహ హస్తం చాచినప్పుడు అతనితో మైత్రి చేసి ఉంటే ఆయన వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లేవి. కానీ ఆయన అధర్మాన్ని సహించరు కాబట్టి ఇప్పడీ యుద్ధం అనివార్యమైంది.
తప్పును తప్పు అని చెప్పటం ప్రభుత్వానికి రుచించని విషయం. వ్యవస్థలు అన్నీ మీడియాతో సహా తాము ఆడమన్నట్టు ఆడాలని వారు భావిస్తారు. దేశంలో పత్రికాస్వేచ్ఛను హరించిన ఎమర్జన్సీ సమయంలోనే ఎలుగెత్తి పోరాడిన ఈనాడు….తన 49 ఏళ్ల చరిత్రలో ఏనాడు ఏ పాలకులకు లొంగలేదు. 60 ఏళ్ల చరిత్రలో ఎన్ని ప్రభుత్వాలు మారాయి? ఎంతమంది అధికారులు వచ్చారు? వారి స్థానంలో ఎందరు కొత్త వాళ్లు వచ్చారు? ఎందరు బదిలీ అయ్యారు?
ఇన్ని దశాబ్దాలుగా తెలంగాణలో, కర్నాటకలో, తమిళనాడులో, ఏపీలో ఎప్పుడూ, ఏ అధికారులకు, ఏ ప్రభుత్వాలకు కనిపించని లోపాలు ఇప్పుడే వీరికి ఎందుకు కనిపిస్తున్నాయి? అధికారులు, ప్రభుత్వాల మాట అటుంచి ఇన్ని బ్రాంచీల్లో ఎన్ని లక్షలమంది ఇప్పటివరకు చిట్లు వేశారు? చిట్లు పాడారు? ఎప్పుడూ ఏ ఖాతాదారుడుకి కలగని అసౌకర్యం ఈ ప్రభుత్వానికి అదీ నాలుగేళ్ల తర్వాత ఎందుకు కనిపించిందో?
ఇలాగైనా ఈనాడు-ఈటీవీ మీడియాను దారికి తెచ్చుకోవటం కోసం బెదిరింపుగా భావించాలా? ఏదోక పేరుతో మార్గదర్శి ఆఫీసులకు వెళ్లి అక్కడ ఏదో జరిగిపోతోందనే ప్రచారాన్ని తన అనుకూల మీడియా ద్వారా వ్యాప్తి చేయగలిగితే ఆ సంస్థను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన? ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలకు ఎవరి చరిత్ర ఏంటి? ఎవరి బతుకేంటో బాగా తెలుసు. కాలమే నిర్ణయిస్తుంది పతనం అయ్యేది ఎవరో, ముందుకు పయనించేది ఎవరో..!
– కంకణాల శ్రీనివాసరావు