Suryaa.co.in

Editorial

ఇది కదా అమ్మప్రేమ!

-సీఎం యోగి మాతృప్రేమ ఇది
-సర్కారీ ఆసుపత్రిలోనే యోగి తల్లికి చికిత్స
-రెండేళ్ల తర్వాత తల్లిని కలిసిన యోగి
-కొడుకుకు పదివేలిచ్చిన పేద తల్లి
-రిషికేష్ ఎయిమ్స్‌లో ఓ అరుదైన దృశ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇది కదా అమ్మ ప్రేమంటే. ఆయన ఈ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి. చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రులే వేల కోట్లు దోచుకుని, దాచుకుంటున్న రోజులివి. వందలకోట్లతో ప్యాలెస్‌లు కట్టుకుని, దర్జాగా సర్వసుఖాలు అనుభవిస్తున్న కాలమిది. కానీ కుటుంబబంధాలు లేని ఆ ‘యోగి’ మాత్రం నిరాడంబరంగా జీవిస్తున్నారు. పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయనది మితాహారమే. నేలమీదే పవళింపు.

ఆయనే అంత నిరాడంబరంగా జీవిస్తుంటే, ఆయన తల్లి మరీ నిరాడంబర జీవి. తన రెక్కలకష్టంతోనే బతుకుతున్న పేదరాలు. కొడుకు సీఎం అయితేనో.. భర్త సీఎం అయితేనో.. తండ్రి సీఎం అయితేనో కళ్లు నెత్తినెక్కి, నిలువెల్లా అహంకారం ప్రదర్శించే ఈరోజుల్లో.. పాపం ఆ పేదరాలు సొంతకాళ్లపైనే బతుకీడుస్తోంది. కొడుకు పెద్ద రాష్ట్రానికి సీఎం అయినా, ఆయన పేరు కూడా చెప్పకుండా ఆ వృద్ధాప్యంలోనూ కష్టపడి జీవిస్తోంది. ఇది ఇప్పటి ముఖ్యమంత్రులు.. వారి పేరు చెప్పుకుని బతికే వారసులు సిగ్గుపడాల్సిన వ్యవహారం.

ఇక ఆ సీఎం యోగి తాజాగా రుద్రప్రయాగ్‌రోడ్‌లో ప్రమాదానికి గురైన బాధితులను పరామర్శించేందుకు, రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాతృమూర్తి సావిత్రిదేవిని చూసిన యోగి, కన్నీటిరపర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురయిన కొడుకు యోగిని, తల్లి దగ్గరకు తీసుకుని యోగక్షేమాలు విచారించింది. సమయానికి తింటున్నావా? అని వాకబు చేసింది. నిజానికి యోగి, తన కన్నతల్లిని 2022 తర్వాత కలవడం ఇదే తొలిసారి.

చెమ్మగిల్లిన కళ్లతో వెళుతున్న కొడుకు యోగిని చేయి పట్టి ఆపి, ఆయన చేతిలో పదివేలు పెట్టిన ఆ తల్లికి కాళ్లకు ప్రణమిలి, తల్లి ఇచ్చి డబ్బును కళ్లకు అద్దుకుది జేబులో పెట్టుకున్న ఆ త నయుడి దృశ్యం అక్కడి వారంద రి హృదయాలను ద్రవింపచేసింది. నిజానికి యోగి తలచుకుంటే, కార్పొరేట్ ఆసుపత్రులలోనే తల్లికి చికిత్స చేయించగలరు. కానీ ఒక సగటు జీవి మాదిరిగా, సర్కారు ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్న, ఆ యోగి వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా.. ఎంత రాసినా ఒక పేజీ తక్కువే అవుతుంది. ఇది నేటి ముఖ్యమంత్రులు, వారి కుటుంబసభ్యులు, రాజకీయ నాయకులకు అంకితం!

LEAVE A RESPONSE