Suryaa.co.in

Andhra Pradesh

అంతం కాదిది…ఆరంభం

-రైతు వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతర పోరాటం
-కళ్లు నెత్తికెక్కిన కాకాణికి రైతులెక్కడ కనిపిస్తారు
-ఒక్క అనంతపురంలోనే కాదు..రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో మోటార్లకు మీటర్లు బిగించినా రైతులే పెరికేస్తారు
-మనుబోలు రైతుపోరును సూపర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు
– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ చేపట్టిన రైతుపోరు నిన్న మనుబోలులో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఊహించినదానికన్నా మూడింతల మంది వచ్చారు..భారీగా తరలివచ్చిన రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రైతుపోరు ప్రాంగణం కిక్కిరిసింది. రాష్ట్రంలోని టీడీపీ కీలకనేతలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి రైతుపోరు సక్సెస్ లో కీలకపాత్ర పోషించారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా రైతులకు చేస్తున్న ద్రోహం, అన్యాయంపై తెలుగుదేశం పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. బద్వేలు, జగ్గంపేట, నందిగామ దగ్గర నుంచి నిన్న మనుబోలులో జరిగిన

రైతుపోరు సభలు సూపర్ సక్సెస్ కావడం జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది.మోటార్లకు మీటర్లు వద్దన్నా ఈ తుగ్లక్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు….ఫలితంగా రైతులు రోడ్డెక్కడం చూస్తున్నాం.

నిన్న అనంతపురం జిల్లాలోనూ మోటార్లకు బిగించిన మీటర్లను పెరికేసి రోడ్లపైకి లాక్కురావడం చూశాం.రైతుల గోడు పట్టించుకోకుండా మోటార్లకు మీటర్లు పెడితే ఒక్క అనంతపురమే కాదు…రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

వ్యవసాయ శాఖ మంత్రిని ముందు తన సొంత జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం తాలూకూ బకాయిలు రూ.400 కోట్లు చెల్లించమనండి.ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నెలలు గడుస్తున్నా నగదు రాక వడ్డీలు పెరిగిపోయి రైతులు అల్లాడుతున్నారు..ముందు వారిని ఆదుకోండి.

మనుబోలు రైతుపోరును చూశాక కాకాణికి నిద్రపట్టినట్టు లేదు..సభలో రైతులే లేరని కాకమ్మ కథలు చెబుతున్నారు..కళ్లు నెత్తికెక్కిన ఆయనకు రైతులకెక్కడ కనిపిస్తారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరు సభలకు ఊహించని స్థాయిలో వస్తున్న స్పందన, వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓర్చుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని రైతులను నిండా మునిగింది అక్షర సత్యం. మీకు దమ్ముంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ పద్దు కింద ఎంత ఖర్చుపెట్టారో, మీ మూడేళ్ల పాలనలో ఏ పద్దు కింద ఎంత ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయండి.

ఏపీలో వ్యవసాయ శాఖను కన్నబాబు మంత్రిగా సగం మూసేస్తే, మిగిలిన సగాన్ని కాకాణి వచ్చీరాగానే మూతేశారు.మనుబోలు రైతుపోరు సభ సూపర్ సక్సెస్ కావడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలు, రైతుసోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

LEAVE A RESPONSE