Suryaa.co.in

Andhra Pradesh

రోగులకు ఇదే అంబులెన్స్!

ఇది పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలం, బొయితిలి గ్రామపంచాయితీ ఉతికిమెట్ట గ్రామం లో గత 70 ఏళ్లుగా కనిపిస్తున్న విషాదకర దృశ్యమే. అక్కడి గ్రామ గిరిజనులకు మామూలుగా మారిన వేదనే. మాకు రోడ్టేయమని గిరిజనులు ఎన్నికయిన ప్రతి ప్రజాప్రతినిధినీ వేడుకోవడం, వారు సరేనని తలూపడం ఈ 70 ఏళ్లలో ఆ గిరిజనులకు అలవాటయిపోయింది. పాలకుల హామీలను నమ్మి మోసపోయిన గిరిజనులు చేసేదిలేక.. ఇలా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు కరవయిన బొయితిలిలో ఇప్పుడు, గిరిజనులు ఆసుపత్రికి వెళ్లాలంటే.. ఇలా డోలీలో తీసుకువెళ్లాల్సిందే. ఈ కర్రలే గిరిజనులకు అంబులెన్సులు. వారిని మోసుకునివెళ్లే గిరిజనులే వీల్‌చైర్లు. తాజాగా సీదరి రోజా అనే గిరిజన యువతి అనారోగ్యం పాలయింది. ఆమెను పక్కనే ఉన్న మండల కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు, ఇలా డోలీనే దిక్కయిన దుస్థితి ఇది. వైద్యాధికారులూ… మీకు అర్ధమవుతోందా?

LEAVE A RESPONSE