అదిగదిగో..
మన విజయనగరం..
ఘనచరితకు వేదిక..
గొప్ప సంస్కృతికి ప్రతీక..
మహనీయులు పురుడుపోసిన
సువర్ణాక్షర పత్రిక..
గజపతుల ప్రియ పుత్రిక..!
అదిగదిగో..
నగరం నడిబొడ్డున
వెలసిన కోట..విజయాల బాట..
కళల పూదోట..
సమరాల వేళ అగ్గిబరాటా..
ఇపుడేమో విద్యా సంస్థల నిలయం..
విజయనగర విభవాలయం..!
అదిగదిగో..
ఉత్తరాంధ్ర ఇలవేల్పు
పైడితల్లి..కల్పవల్లి..
ఆ చల్లని తల్లి
ఉనికే అద్భుతం..
ఏటా జరిపే
సిరిమాను ఉత్సవమే అపూర్వం..!
అదిగదిగో..
శతాధిక వర్ష చారిత్రక మహారాజా కళాశాల..
విద్యలనగర మణిహారం
మహాపండితుల సమాహారం..
వన్నె తెచ్చిన గురువులు
వాసికెక్కిన విద్యార్థులు..
ఇచ్చట చదువుటే గర్వకారణం
ఘనత వహించిన
విద్యాతోరణం..!
అదిగదిగో..
గురజాడ అడుగుజాడ
ఒక్క రచనతో కుప్పకూలిన
కన్యాశుల్క చీడ
వాడుక భాషకు వాసి గిడుగు
ఆ పరంపరకు అప్పారావు పదాలే
నీడనిచ్చే గొడుగు..!
అదిగదిగో..
ఇక్కడే ఖ్యాతి గాంచెనట
కలియుగ భీముడు
కోడి రామ్మూర్తి..
ద్వారం వారి వాయిలీన రాగాల కలకండలు..
కోడి రామ్మూర్తి
కరగని కండలు
పెంచినాయట
విజయనగరం కీర్తి..
ఆదిభట్ల హరికథలు
మధుర సుధలు..
మానాప్రగడ నోరువిప్పితే
ఎన్నెన్నో మధుర కథలు..!
అదిగదిగో..
అపూర్వరాగాల శాల
సంగీత కళాశాల
ఇక్కడే గళం
విప్పాడట ఘంటసాల..
తొలిసారిగా కూసిందట
సుశీల అనే కోయిల
ద్వారం వారి
వాయులీన విన్యాసాలు..
నేదునూరి
స్వరమాధుర్యాలు..
ఇచ్చట పుట్టిన చివురు కొమ్మయిన చేవ…
సంగీత సరస్వతి
పదసన్నిధికి
ఇదే చూపును
సరైన త్రోవ..!
అదిగదిగో..
ఆధ్యాత్మికతకు
బాటలు వేస్తూ
ఎన్నో ఆలయాలు
ఖాదరు దర్గాతో పాటు
ఎన్నెన్నో మసీదులు..
మతసామరస్యతకు
ప్రతీకలు..
ఇక్కడ అందరూ సమానమే…
ఎల్లెడలా వెల్లివిరిసే అభిమానమే..
అదిగదిగో..
నింగిని తాకే
మా గంటస్తంభం
విద్యలనగర వైభవ పూర్ణకుంభం
వివరిస్తూ నాటి
ప్రభువుల లాలన..
చారిత్రక నగరానికి
సమయపాలన..!
ఇంకెన్నో విశేషాలు..సశేషాలు..
ఘన సంస్కృతీ అవశేషాలు..
దేవీ విలాస్ నెయ్యిదోశ..
పాల్గాట్ కాపీ ఘుమఘుమ..
లక్ష్మీ రాజు గారి
ఆత్మీయ పలకరింపు..
మిలాప్ హోటల్ కౌంటర్లో
లీకైన పేపర్ల కబుర్లు..
రాత్రయ్యాక టీ పేరిట అక్కడికి చేరిన కుర్రకారు బాతాఖానీలు..
దేవీ మిఠాయి
మోతీచూరు నోరూరు..
మతిపోగొట్టే
అలమండ ఆంచూరు..
పైడితల్లి పండగ వేషాలు..
కుర్రాళ్ళ తమాషాలు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286