– పెంచిన నిధులను అన్ని పద్దులకు పంచిన్రు
– 15 నెలల కాలంలో లక్షా 52 వేల కోట్ల అప్పు
– భట్టి విక్రమార్క ప్రసంగం అంతా డొల్ల.. బోగస్
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు. గత 2024-25 బడ్జెట్ రూ.2.91లక్షల కోట్లు ( కేవలం 4 శాతం పెంపు) పెంచిన నిధులను అన్ని పద్దులకు పంచిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పన చేయడమే తెలియదన్నట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్ల అప్పులపాల్జేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో లక్షా 52 వేల కోట్ల అప్పు చేసిందని చెబుతోంది.
ఓవైపు అప్పుల్లో తేలుతున్న రాష్ట్రంలో రెవెన్యూ మిగులు రూ. 2,738 కోట్లుగా చూపెట్టారు. రూ. 54 వేల కోట్లుగా ద్రవ్యలోటుగా చూపెట్టారు. అంటే.. 2025-26 రాష్ట్ర బడ్జెట్ లో రూ. 54 వేల కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితి లేదన్నట్లుగానే కనపడుతోంది.రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో రెవెన్యూ మిగులు నిధులు చూపెట్టడమేంటి?
గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రేమ్ వర్క్ చేసిన బడ్జెట్ కు కొన్ని మార్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 బడ్జెట్ ను రూపొందించినట్లు కనపడుతోంది. కేసీఆర్ అద్దంలో రేవంత్ రెడ్డి మొహం చూసుకుంటున్నరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గమనిస్తే రూ. 33 వేల కోట్ల రెవెన్యూ లోటు చూపించారు. దాంట్లో అర్థం ఉంది. 2017 సంవత్సరం నుంచి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులిచ్చి, రెవెన్యూ లోటును పూడ్చే ప్రయత్నం చేస్తోంది.
17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రెవెన్యూ లోటును ఒప్పుకోవడం లేదు. దీంతో రాష్ట్రం నష్టపోతోంది. రూ. 54 వేల కోట్ల రెవెన్యూలోటును ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వ సాయం అందేది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్ లో నిధులను కేటాయించలేదు.
రాష్ట్రంలో ఆదాయం కోసం ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే మరే ప్రత్యామ్నాయ ఆలోచన చేయడంలేదు. భట్టి విక్రమార్క ప్రసంగం అంతా డొల్ల.. అంతా బోగస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అవసరాలకు బదులుగా, కమీషన్ల కోసం ఖర్చు చేసే విధంగా బడ్జెట్ రూపొందించింది. 2025-26 కాంగ్రెస్ బడ్జెట్ కామన్ మెన్ బడ్జెట్ కాదు.. కమీషన్ల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్.
ఐదేళ్లలో బీసీల సంక్షేమం కోసం సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు. బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు కేటాయించినట్లు చెప్పారు, కానీ గత ఏడాది నిధులను ఖర్చు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో తానే న్యాయమూర్తులతో మాట్లాడినట్లు, గొప్పగొప్ప న్యాయవాదులను ఎంపిక చేసి సుప్రీంకోర్టులో మాట్లాడించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నరు.
రాజకీయాల్లో తాను గెలిచేందుకు మాదిగ సామాజికవర్గం ప్రజలు జెండాలు మోసినందుకే.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటూన్నరు. ఎస్సీ వర్గీకరణను రాజకీయంగా ఉపయోగించుకోవడం మాత్రమే వారికి తెలుసు!”
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఎక్కడా చేయలేదు. కేవలం తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఎస్సీ వర్గీకరణ కోసం మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఉద్యమం జరగలేదు. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఉద్యమం జరిగింది. దానికి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటి?
ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ముందుండి నడిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను రాజకీయ లబ్ధికి వాడుకుంటోంది. బడ్జెట్ గురించి ప్రజలకు ఏ మేలు జరగనుందో చర్చ జరగకుండా చేస్తున్నరు.
నిరుద్యోగ యువతను నిట్టనిలువునా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం నిధులు ఎందుకు కేటాయించలేదు?అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇదే చివరి బడ్జెట్ అవుతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు.