ఒక రైతు తన సంతోషాన్ని పాట రూపంలో పంచుకున్న తీరు అందరినీ కదిలిస్తోంది. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయంలోని… “బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను.. పొగడరా నీ తల్లి భూమి భారతిని” అనే చరణాన్ని ఆలపిస్తూ, ప్రవహిస్తున్న కృష్ణమ్మ నీటిని చూసి ఆ పరవశంలో మునిగిపోయాడు.
ఇది కేవలం పాట కాదు, దశాబ్దాల దాహార్తి తీరిన వేళ ఒక గుండె లోతుల్లోంచి వచ్చిన కృతజ్ఞత. నేడు ఊరూ వాడా, ఇంటిల్లపాదీ బంధువులతో కలిసి నిండు కుండలా మారిన చెరువుల వద్దకు చేరుకుని ఆ జలకళను చూసి మురిసిపోతున్నారు.
730 కిలోమీటర్ల ప్రయాణం… వెయ్యి అడుగుల ఎత్తుకు పైగా పరుగు! ప్రకృతి సూత్రాల ప్రకారం నీరు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది. కానీ, ఒక నాయకుడి సంకల్పం ఆ నీటిని ఎదురుగా.. కొండల పైకి.. వెయ్యి అడుగుల ఎత్తుకు నడిపించింది.
అసాధ్యం అనుకున్నచోట అద్భుతం జరిగింది. కరువు కోరల్లో చిక్కుకున్న ఆ నేల మీదకు గంగమ్మ ఎలా వచ్చింది? అక్కడ ఇప్పుడు వినపడుతున్న జలజల నాదం వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి?
ఇది బాహుబలి సినిమాలో శివలింగాన్ని పెకలించి జలపాతం దగ్గర పెట్టిన దృశ్యం కాదు.. గత ఎన్నికల ముందు కుప్పంలో జగన్ వేసిన సెట్టింగ్ అంతకన్నా కాదు! ఇది కుప్పం గడ్డపై నిజమైన కృష్ణమ్మ అడుగుజాడ!
శ్రీశైల పాతాళగంగ, హంద్రీ-నీవా కాలువల ద్వారా 730 కిలోమీటర్లు ప్రయాణించి, సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న కుప్పం చెరువులను ముద్దాడుతోంది. రామకుప్పం మండలం తోట్ల చెరువు నిండి పొర్లుతుంటే, ఆ ఆనందాన్ని అక్కడి జనం పంచుకుంటున్నారు.
“కుప్పం గడ్డకు శ్రీశైలం శివయ్య దగ్గర పాతాళంలో ఉన్న కృష్ణమ్మను తెస్తాను” అని నాడు చంద్రయ్య (నారా చంద్రబాబు నాయుడు) చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది. శివయ్య పాతాళగంగను తమ చెరువుల్లో చూసుకుంటున్న కుప్పం ప్రజల కళ్లల్లో ఆనందం వెలకట్టలేనిది.
ఇది కేవలం ఇంజనీరింగ్ విజయం మాత్రమే కాదు… ఒక నాయకుడి పట్టుదలకు, లక్షలాది ప్రజల దశాబ్దాల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం. నేడు కుప్పంలో నిండిన ప్రతి చెరువు వద్ద పండగ వాతావరణమే! ఇది కేవలం నీటి ప్రవాహం కాదు, కుప్పం ప్రజల దశాబ్దాల కలల సాకార సంతోషం.