ఈ మతాతీత మనుషుల సమైక్యత ఒక్క కేరళ స్టోరీయే కాదు. దేశమంతా ఇదే స్టోరీ. ఇలాగే అన్నదమ్ముల్లాగా జీవించారు. జీవిస్తున్నారు. జీవిస్తారు. జాతీయ సమైక్యతా దినోత్సవం నాడు పిల్లలకు మూడు మతాల డ్రెస్సులు వేసి పాఠశాలల్లో ప్రదర్శించేవారు. ఊళ్ళల్లో ఊరేగింపులు జరిపేవారు.
ఆచార్య లక్ష్మణ్ గారు నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలరుగా ఉన్న సమయంలో (1995-98) ఒక రిపబ్లిక్ డే నాడు జాతీయ సమైక్యతా చిహ్నంగా నగరంలోని విద్యార్ధులతో పెద్ద ఊరేగింపు చేయాలనే తలంపు వచ్చింది . ఆనాటి NSS కో ఆర్డినేటర్ ఆచార్య సి. నరసింహారావు మంచి మిత్రుడు నాకు . ఆ కార్యక్రమాన్ని నా భుజాల మీద పడేసాడు . నగరంలోని పాఠశాల , కళాశాల విద్యార్ధులతో సుమారు పది వేల మంది విద్యార్ధులతో ఊరేగింపు చేసాం . ఊరేగింపు తల A.C. కాలేజీ వద్ద ఉంటే తోక అంబేద్కర్ బొమ్మ వద్ద ఉంది . అంత పెద్ద ఊరేగింపు!.
దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా పరిస్థితి మారిపోయింది . ఇంత సువిశాల దేశంలో ఎక్కడో ఒక చోట జరిగే దురదృష్ట సంఘటనలను , ఘర్షణలను ఆసరాగా తీసుకుని పరస్పర అనుమానాలను , అపోహలను , అపార్ధాలు పెంచి పోషించే దేశద్రోహులు విజృంభించారు.
ఎవరయినా నాలాంటి వారు సమైక్యత గురించి మాట్లాడితే, బూతులతో డాడులు చేస్తున్నారు . డిఎన్ఏ గురించి అవాకులు , చవాకులు పేలుస్తున్నారు . భయాలను సృష్టిస్తున్నారు .
దేశంలో మానవతావాదులు , వసుధేయ వాదులు , సమైక్యతావాదులు మరలా సమీకృతం కావాలి . దేశం ఇలాంటి మత సామరస్యతతో భాసించాలి . మేరా భారత్ మహాన్! .
– ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం
గుంటూరు