– పల్లెసీమల అభివృద్ధి, గ్రామీణ సోదరుల ఆర్థిక భద్రతకు వికసిత్ భారత్ గ్యారెంటీ మేలు
– గ్రామాభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు
– రైతుల కళ్లలో ఆనందం
– ఉపాధి హామీ నిధుల వాటాను 90:10 నుండి 60:40కి తగ్గించడానికి బీఆర్ఎస్ వ్యతిరేకం
– తెలంగాణలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి
– రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు
ఢిల్లీ: గ్రామీణాభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో సుమారు లక్షా 97 వేల కోట్ల రూపాయలను కేటాయించడం శుభపరిణామని,ముఖ్యంగా, ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ పేరుతో మార్చి, పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
పల్లెసీమల అభివృద్ధి, గ్రామీణ సోదరుల ఆర్థిక భద్రతకు ఇది ఎంతోగానో దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న ఈ అభివృద్ధి నమూనాను, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన చేసి చూపించింది. “దేశం ఈ రోజు ఆలోచించేవాటిని తెలంగాణ ఇంతకుముందే ఆచరించి చూపింది.”అని ఎంపీ రవిచంద్ర తెలిపారు.
తెలంగాణ నమూనా అంటే కేవలం మాటలు కావు అని,అది ఒక అద్భుతమైన మార్పు అని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో కేటాయించిన నిధుల గురించి రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం”‘హర్ ఘర్ జల్'” గురించి ఆలోచించక ముందే, కేసీఆర్ 43 వేల కోట్లతో ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరందించారని తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అద్దంలా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ది అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
“కేంద్ర ప్రభుత్వ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ర్యాంకుల్లో దేశంలోని టాప్-20 ఉత్తమ గ్రామాలలో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవే. ఇది కేసీఆర్ దూరదృష్టికి ప్రబల నిదర్శనం”అని ఎంపీ వద్దిరాజు వివరించారు.
గ్రామాభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదని, రైతుల కళ్లలో ఆనందమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించి, రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్ ది అని ఎంపీ రవిచంద్ర కొనియాడారు.
కేంద్రం ఇప్పుడు ‘లక్షాధికారి దీదీల’ గురించి మాట్లాడుతోందని, కానీ తెలంగాణలో మహిళా సంఘాలు పదేళ్లుగా కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తూ పల్లెల ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాయని ఆయన చెప్పారు.
“కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాలను విజయవంతంగా అమలు చేయాలంటే.. తెలంగాణలో చెక్ డ్యాంలు ఎలా కట్టారో, గ్రామాలను ఎలా పచ్చగా మార్చారో ఒకసారి అధ్యయనం చేయాలి.”అని ఎంపీ రవిచంద్ర సూచించారు. ఈ నిధుల కేటాయింపులపై నాకు కొన్ని అభ్యంతరాలున్నాయని,ఈ దృష్ట్యా కొన్ని సూచనలు చేయదల్చానన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల వాటాను 90:10 నుండి 60:40కి తగ్గించడాన్ని తమ బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. గ్రామీణ పేదల సంక్షేమం దృష్ట్యా, పాత పద్ధతిలోనే 90% నిధులను కేంద్రమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.
నిధుల వాటా మార్పుల సాకుతో పేద కూలీల వేతనాలు ఆగకూడదని చెప్పారు.ఆధార్ కార్డులో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేతనాలు నిలిపివేయడం అన్యాయమని, పని చేసిన 15 రోజుల్లోపు డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో పడేలా కేంద్రం పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర కోరారు.
తెలంగాణ వంటి రాష్ట్రాలకు రావాల్సిన ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని,నిధుల కోత విధిస్తూ గ్రామాల అభివృద్ధిని కుంటుపరచవద్దన్నారు.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్లను కేవలం ఊళ్లకే కాకుండా, రైతుల పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుల (మండీల) వరకు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ వద్దిరాజు సలహా నిచ్చారు
ఎంపీలుగా ‘దిశ’ కమిటీలకు అధ్యక్షత వహిస్తున్నామని, ఈ కమిటీలకు మరిన్ని అధికారాలు ఇస్తే బాగుంటుందని,అప్పుడే క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
భూ రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నప్పుడు, మన గ్రామీణ యువతకు ఈ సాంకేతికతపై శిక్షణ ఇస్తే బాగుంటుందని చెప్పారు.
“తెలంగాణ ఒకప్పుడు కరువుతో అల్లాడేది, కానీ కేసీఆర్ దృఢసంకల్పంతో ఈ రోజు సస్యశ్యామలంగా మారింది. తెలంగాణలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతున్న”అని ఎంపీ రవిచంద్ర అన్నారు.
మరింత అభివృద్ధి దిశగా ఈ గ్రామీణ బడ్జెట్ నిధులు సద్వినియోగం కావాలని కోరుకుంటూ, ఈ గ్రాంట్లను తమ పార్టీ బీఆర్ఎస్ పక్షాన సమర్థిస్తున్నానని ఎంపీ వద్దిరాజు చెప్పారు.