Suryaa.co.in

Political News

ఈసారి కూడా వార్ వన్ సైడే నా?

అసెంబ్లీ ఎన్నికల దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కొక్క అడుగే ముందుకు వేసుకుంటూ వెడుతున్నది. శాసనసభలోని 175 సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందేనన్న మైండ్ సెట్ లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫిక్స్ అయ్యారు. దాని కోసం ఏమి చేయడానికైనా ఆయన వెనుకాడరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుపతి లోకసభ ఉప ఎన్నిక, ఆత్మకూరు – బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, తిరుపతిలో ఓ కోపరేటివ్ బ్యాంకు ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన తీరుతో – 175 కి 175 అసెంబ్లీ స్థానాలు సాధించడం పెద్ద కష్టం కాదనే బలమైన అభిప్రాయం ముఖ్యమంత్రికి కలిగి ఉంటుంది.

అందుకే, పార్టీ నేతల ప్రతి సమావేశం లోనూ 175 కి 175 స్థానాలు సాధించగలమని సాధికారంగా చెబుతున్నారు. రాష్ట్రాలలోనూ, దేశంలోనూ, ఎన్నికలు జరిగే ఇతర ప్రజాస్వామిక దేశాలలోనూ ఇప్పటి వరకు నూటికి నూరు సందర్భాలు ఎక్కడా… ఎప్పుడూ లేవు గదా అంటూ రాజకీయ అనుమానేశ్వరరావు లు ఆశ్చర్య పోతూ ఉండి ఉండవచ్చు.

కానీ, సీ ఎం -వై.ఎస్.జగన్మోహనరెడ్డి లాంటి అధినేత దేశంలోని రాష్ట్రాలలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామిక దేశాలలోనూ ఇప్పటి వరకూ ఎవరూ లేరు అనే విషయాన్ని వారు గమనిస్తే, సందేహాలు రావు.

ఆయన జగన్మోహనరెడ్డి కాబట్టే ;నూటికి నూరు శాతం సీట్లు రావాలని, వస్తాయని ఘంటాపదంగా చెబుతున్నారు. అసెంబ్లీ కి 175 కి 175 అని అంటున్నారంటే, లోకసభ సీట్లు 25 కి 25 అని అర్ధం. వైసీపీ నేతలకు అంతటి భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి ఉండగా, ‘గడప గడపకూ మన ప్రభుత్వం ‘ కార్యక్రమానికి ఎం ఎల్ ఏ లు మొహాలు ఎందుకు చాటేస్తున్నారో అర్ధం కావడం లేదు. టికెట్లు ఇచ్చేది ఆయన. గెలుపు కు కావలసిన మందు గుండు సరంజామా అందించేది ఆయన. ఓటర్లకు ఏమి కావాలో చూసుకునేది ఆయన.

పోలింగ్ నాడు తెలుగుదేశం వాళ్ళు న్యూసెన్స్ చేయకుండా, శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా చూసుకునేది ఆయన. చంద్రబాబు దగ్గరినుంచి మొత్తం 175 మంది అభ్యర్థుల్ని ముందురోజు రాత్రే హౌస్ అరెస్ట్ చేసి, ఎన్నికలు శాంతియుత వాతావరణం లో నిర్వహించేటట్టు చూసేది ఆయన. గెలిచేది మాత్రం వైసీపీ అభ్యర్దులే కదా! మరి వారు ఎందుకు గడప గడపకూ వెళ్లడం లేదో తెలియదు.

జగనన్న ఇప్పుడు తలా రెండు కోట్లు ఇచ్చారు కదా! ఇప్పుడు హ్యాపీ గా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోవచ్చు. అయితే, జగనన్న సామర్ధ్యం మీద టీడీపీకి ఇంకా నమ్మకం కుదిరినట్టు లేరు. వైసీపీ గనుక ‘175 కి 175 గెలిస్తే, మా పార్టీని మూసేసి, టీడీపీ ఆఫీస్ కు తాళాలు వేసేస్తాం’ అంటూ టీడీపీ నేత అచ్చెనాయుడు- జగన్ మాటకు మాట కలుపుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నూటికి నూరు శాతం విజయం సాధించడం అనేది ఏ రాజకీయ పార్టీకీ, ఏ పరిస్థితుల్లోనూ, ఏ దేశంలోనూ, ఏ కాలమాన పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనేది అచ్చెన్నాయుడి పిచ్చి లాజిక్కు.అందుకే, ఆయన ఆ సవాలు విసిరి ఉంటారు. దానిని అధికార పక్షం లో ఎవరూ స్వీకరించినట్టు లేదు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 సీట్లు ఖాయమని అచ్చెన్నాయుడు ఎదురు వ్యాఖ్యానించారు. అచ్చేనాయుడు ప్రకటన చూసి వైసీపీ నేతలు నవ్వుకుని ఉంటారు. సరే. వైసీపీ, టీడీపీ ల్లో ఒకదానికి మాత్రం ఏకపక్ష విజయంగానే కనిపిస్తున్నదని…. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నవారు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మెజారిటీకి, 175 స్థానాలలోను మామూలుగా అయితే ఓ 88,90 స్థానాలు గెలుచుకుంటే, ప్రభుత్వానికి నేత్రత్వం వహించడానికి సరిపోతుంది. పైన ఇంకో పది, పరక సీట్లు వస్తే….;అధికారం నిలకడగా ఉంటుంది. కానీ, ఈ సారి క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అలా లేవు.

వైఎస్సార్ పార్టీ అనేది జగన్ కోసం, జగన్ చేత, జగన్ కొరకు ఏర్పాటైన పార్టీ లాంటిది.. తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక స్పెషల్ పర్పస్ వెహికల్- వైసీపీ . అది నిజానికి- ఆయన అభిమానుల, అనుచరుల సమూహం. సమ్మేళనం.కోలాహలం. దానికి ఆయనే సర్వం. దానికి….,ఆది -అంతం కూడా జగన్ తోనే.ఒక పార్టీ గా దానికి ప్రత్యేక అస్తిత్వం లేదు.

ఏ శుభ ముహూర్తాన దానిని ప్రకటించారో గానీ, దాని లక్ష్యం నెరవేరింది. ఓ పెద్ద దీపావళి చిచ్చుబుడ్డి లా రాష్ట్రమంతటా వెలుగులు విరజిమ్మింది.జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశం లోనే సంప్రదాయ పార్టీలు బిత్తరపోయేంత భారీ ఆధిక్యత తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు దాని అవసరం తీరిపోయింది. వైసీపీకి ఇక, చేయాల్సిన పని కొత్తగా ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలు (25 కి 25 పార్లమెంట్ స్థానాలు ) సాధించడమే లక్ష్యం గా పెట్టుకున్నారు .

అప్పుడు , 2019 లో ఆయన మూసిన గుప్పిట. రాజశేఖరరెడ్డి కుమారుడు.ఆయన పాలన ఎలా ఉంటుందో అన్న ఊహల్లో ఓటర్లను విహరింపచేసిన వైసీపీ ప్రచారం-175 కి 151 సీట్లు తెచ్చి పెట్టింది. ఇప్పుడు అలా కాదు. ఆయన ఇప్పుడు – తెరిచిన గుప్పెట. ఆయన పాలనపై జనానికి పూర్తిగా అవగాహన కలిగింది. అందువల్ల, రాజశేఖరరెడ్డి కుమారుడి గా కాక, జగనన్న గానే -175 కి 175 సాధించగలనని ఆయన భావిస్తున్నారు.

2019 లో వైసీపీ విజయానికి అనేక అదృశ్య శక్తులు కూడా నాలుగు పక్కల నుంచి భుజం కాశాయి. మన ప్రజాస్వామ్యం లో ఎలా గెలిచారు అనేది ముఖ్యం కాదు. గెలిచారా …లేదా అనేది ముఖ్యం. అదే రాజ్యాంగ బద్దం. ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదు. ఆ విజయాన్ని , అదే స్థాయిలో ను , అంతకు మించి కూడా కొనసాగించే ఉద్దేశం తో- జనం ఖాతాల్లోకి- కాలువల్లోకి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి నీరు మళ్లించినట్టుగా -దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను మళ్లించారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది . ఇది ట్రయిల్ పార్టీ. అసలు సినిమా ముందు ముందు ఉన్నది.2049 వరకు జగనన్నే ముఖ్యమంత్రి గా ఉంటారు.
175 కి 175 అని జగనన్న అనడానికి ఈ భావన కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.

2014 లో చంద్రబాబు కు అధికారం కట్టబెట్టిన ఓటర్లే -2019 లో జగన్ చేతికి అధికారం బదిలీ చేశారు.ఇప్పుడు కూడా వారు అదే పని చేస్తారని జగనన్న భావిస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయి పరిస్థితులు అంత ఆశాజనకంగా కనపడడం లేదని కొందరు వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారంటూ సోషల్ మీడియా లో వ్యాఖ్యానాలు కనపడుతున్నాయి . అయినా వర్రీ అవ్వాల్సిన పని లేదు.

వైసీపీ తో పోల్చితే, టీడీపీ కి -దానికీ ఓ మౌలికమైన తేడా ఉన్నది. వైసీపీ అనేది జగన్ సృష్టి. టీడీపీ అనేది చంద్రబాబు సృష్టి కాదు. తాను ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు పెట్టుకున్నదీ కాదు. ఎన్టీ రామారావు 1982 లో కార్యకర్తలకు రాసిచ్చిన పార్టీ అది .ఈ కార్యకర్తల పార్టీకి -కాల గమనం లో ‘ఇప్పుడు’ చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారు. రేపు నారా లోకేష్ నాయకత్వం వహించవచ్చు. ఎల్లుండి మరొకరు నాయకత్వం వహించవచ్చు.

ఈ కార్యకర్తలే – తెలుగు దేశం పార్టీ నాయకత్వానికి కాలానుగుణంగా దిశా నిర్దేశం చేస్తుంటారు. వారే వెనుక నుంచి నడిపిస్తూ ఉంటారు.దీనిని క్యాష్ చేసుకోగలమని టీడీపీ అధినేత భావిస్తూ ఉండి ఉండవచ్చు . తెలుగు దేశం కు కేంద్ర దర్యాప్తు సంస్థల బెడద, ఇతర అధికార తల నొప్పులు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం దూకుడు నేపథ్యంలో – వచ్చే ఎన్నికల్లో 175 కి 175 ఖాయం అని జగన్ ఢంకా బజాయించి చెబుతున్నారు.

అయితే, చంద్రబాబు కు మోహమాటం బాగా ఎక్కువ . పైకి చెప్పకపోయినా,175 కి 125 అయినా గెలవాలనే ఆలోచనలతో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు . అచ్చెన్నాయుడు అయితే 175 కి 160….160 అంటున్నారు,చేతిలో పోలీసులు లేకపోయినా. టీడీపీ కి ఆ ధైర్యం ఏమిటో….,ఎలా గెలవగలదో అర్ధం కావడం లేదు . పార్టీలు మిధ్యః, పోలీసులు సత్యం -అనే విషయం టీడీపీ కి ఇంకా అర్ధమైనట్టు లేదు. ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు. వారికి తోడు, దుష్ట చతుష్టయం లోని చంద్రబాబు మినహా ముగ్గురూను. వారికి అంత అత్యాశ పనికిరాదు .

జగనన్న మూడు నాలుగు టర్మ్ లు సీ. ఎం. గా చేస్తే, ఆయన లక్ష్యం పూర్తి అవుతుంది. స్టేట్ కూడా ఫుల్ గా డెవలప్ అవుతుంది. కొత్తగా చేసేది ఏమీ కనపడక;ఆయనకు, సజ్జల రామకృష్ణారెడ్డి కీ కూడా బోర్ కొడుతుంది . అప్పుడు కావాలంటే, టీడీపీ పోటీ చేసి -125 కాకపోతే 150 గెలుచుకోవచ్చు . అప్పటిదాకా టీడీపీ వారు ఓపిక పట్టలేరా !?

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE