ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా జయ కేతనం ఎగురవేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారని అన్నారు. ఈ ఫలితాల్లో దేశానికి గొప్ప సందేశం ఉందని పేర్కొన్నారు.
భాజపా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు చెప్పారు. ఈ ఉత్సాహం భారత ప్రజాస్వామిక ఉత్సవం. ఈ ఎన్నికల ఫలితాల్లో గొప్ప సందేశం ఉంది. ఈసారి హోలీ పండుగ మార్చి 10నే మొదలైంది. ప్రజల హృదయాలు చూరగొనేందుకు కార్యకర్తలు ఎంతో శ్రమించారు. దేశానికి ఎందరో ప్రధానమంత్రులను యూపీ ఇచ్చింది. 37 ఏళ్ల తర్వాత యూపీలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో మా బలం మరింత పెరిగింది. మాపై నమ్మకముంచిన మాతృమూర్తులు, సోదరీమణులకు ధన్యవాదాలు. యూపీలో మొదటిసారి భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చింది. గోవా ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారు.