Suryaa.co.in

Telangana

తెలంగాణ అమర వీరులకు ఈ విజయం అంకితం

-ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతుంది
-సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తాం
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలంగాణ అమర వీరులకు అంకింతం ఇస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి సచివాలయాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతామన్నారు రేవంత్ రెడ్డి. సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుస్తామన్నారు. ప్రగతి భవన్ ప్రజల ఆస్తి, దాన్ని ప్రజలకోసమే వినియోగిస్తామన్నారు. 2004 నుంచి 2014 వరకు ఏరకంగా ప్రజాస్వామిక పరిపాలనను దేశంలో కాంగ్రెస్ పార్టీ అందించిందో.. తెలంగాణలోనూ అదే స్ఫూర్తితో ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెడుతూ పాలన సాగిస్తామన్నారు.

ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, పేదలను ఆదుకోవడానికి ఈ విజయాన్ని ఉపయోగిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయాన్ని కేటీఆర్ అభినందించడాన్ని స్వాగతించారు. ప్రజాతీర్పుకు తలవొంచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షం సంపూర్ణంగా సహకరించి.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ప్రతిపక్షాలన్నింటికీ ఆహ్వానం పలుకుతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

డిసెంబర్‌ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారు.. ఇవాళ్టి ప్రజా తీర్పు శ్రీకాంత్‌చారికి అంకితం చేస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ‍ప్రజలు పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. భారత్ జోడో ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని చెప్పారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ కలిసి పార్టీని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విజయంలో 30 లక్షల నిరుద్యోగుల పట్టుదల ఉందని పేర్కొన్నారు.ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన థాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. ‘సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి ముందుకు వెళ్తాం. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ స్ఫూర్తి నింపారు. సీనియర్‌ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్‌ఎస్‌ సహకారం అందిస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో ప్రజలు భాగస్వామ్యం కావాలి. కొత్త ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజాతీర్పును అందరూ శిరసావహించాలి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రగతి భవన్‌ను ఇకపై డా. అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు సదా తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అందరం కలిసి నెరవేర్చాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటానని, ఎదురొడ్డి పోరాడమని రాహుల్ గాంధీ మాకు భరోసానిచ్చారు. రాహుల్ గాంధీ మద్దతుతో నేను, సీఎల్పీ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలందరం కలిసి ఐక్యంగా ఇవాళ ఈ విజయం సాధించాం. సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా వంటి నేతలు కూడా సహకారం అందించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే కాకుండా, రాహుల్ గాంధీ చట్టబద్ధత కల్పిస్తామన్న మిగతా అంశాలపైనా ఆయన మాటను నిలుపుకుంటామన్నారు. మా సహజ మిత్రులు, ఎన్నికల్లో మాతో కలిసి పోటీ చేసిన సీపీఐతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయని సీపీఎంను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సంపూర్ణ సహకారం అందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ప్రభుత్వంలో వాళ్ల ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి నాది ఒక సూచన. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. పాలక పక్షం ఎవరు, ప్రతిపక్షం ఎవరు… ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల పాత్రను ప్రజలు నిర్ణయించారు. ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకుని మేం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని కోరుకుంటున్నాం. గతంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నాలు మళ్లీ జరగబోవని భావిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE