Suryaa.co.in

Andhra Pradesh

తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

-రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలి
-టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని…ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని….ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా…ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదని అన్నారు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని…సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని….ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

సాయం చేయండి:-పార్టీ కార్యకర్తలకు పిలుపు
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది…బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు.

LEAVE A RESPONSE