తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిద్దాం

-గెలిచిన వారికి అభినందనలు తెలపండి
-ఓడిన వ్యక్తులను పలుచన చేయొద్దు
-టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సందేశం

అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఏదైనా.. అది అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణమైన నిర్ణయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు సందేశం ఇచ్చారు.

‘తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి. కానీ, ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయ వద్దు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాస్వామ్యంలో 40 ఏళ్లకుపైగా అనేక ఎన్నికల్లో పాల్గొని, పార్టీపరంగా కానీ, నాయకులు, కార్యకర్తుల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. అలాగే తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దృష్టి పెడదాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply