ఈ గెలుపు బీజేపీకి కొత్త మలుపునివ్వడం పక్కా:విజయశాంతి

హుజూరాబాద్‌లో కమలం విరిసిందని, తెలంగాణ పాలకుల గుండె అదిరిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కుట్రలు, వ్యూహాలు, అబద్ధపు ఆరోపణలు, ఫేక్ న్యూస్‌ల పరంపరతో ఎలాగైనా ఈటల గెలుపును అడ్డుకోవాలని అధికార పార్టీ సర్వ శక్తులూ ఒడ్డినా…. అందరినీ అన్నీ సార్లూ మోసం చెయ్యడం సాధ్యం కాదని తెలంగాణ ప్రజలు చాచికొట్టి చెప్పారని ఆమె వ్యాఖ్యానించారు. ఈటల ఎదుగుదలను సహించలేక ఆయన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బయటకు పంపడంలో మాత్రమే కేసీఆర్ విజయం సాధించారు తప్ప, ప్రజల హృదయాల నుంచి తప్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారన్నారు.
‘‘దళితబంధు పథకమంటూ దళితులనే మోసం చేసిన ఈ పాలకుల లోగుట్టేమిటో ఈ గెలుపు రుజువు చేసింది. బీజేపీని… ఈటలని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ సోషల్ మీడియా కుప్పలు తెప్పలుగా ప్రయోగించిన ఫేక్ న్యూస్‌ను, ఫేక్ లెటర్లను ఓట్ల తూటాలు తునాతునకలు చేశాయి. అధికార పార్టీ అభ్యర్థి తన సొంత మండలంలో సైతం ఓటమి తప్పలేదు. విషప్రచారాలు… దుష్ప్రచారాలతో పాటు లేనిపోని ఆశలు కల్పించి… ఓటర్లను మాయచేసి మభ్యపెట్టిన అధికార పార్టీ అహంకారానికి చెక్ పెట్టిన మంగళవారం ఇది. ఈ గెలుపు… వచ్చే శాసనసభ ఎన్నికల్లో నూతన చరిత్ర లిఖించేలా బీజేపీకి కొత్త మలుపునివ్వడం పక్కా… ఈ విజయం అమరుల త్యాగాలను సాకారం చేసే సరికొత్త తెలంగాణకు శ్రీకారం చుట్టడం ఖాయం.’’ అని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.