– ఫోటో షూట్లు, డ్రోన్ షాట్ల కోసమే నరబలి..!
– బాబు “షో” వికటించి 8 మంది బలి
– పబ్లిసిటీ పిచ్చికి ఇంకెంత మందిని బలి తీసుకుంటావు బాబూ..?
– కందుకూరు దుర్ఘటనలో బాబును ముద్దాయిగా చేర్చి, విచారణ చేయాలి
– ఇదేం ఖర్మ అంటూ.. బాబు ఊళ్ళు పట్టుకుని తిరగడమే మన ఖర్మ
– చంద్రబాబు ఇక్కడ పుట్టడమే ఈ రాష్ట్రం ఖర్మ.
– చంద్రబాబు ఖర్మకు ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..
– చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తనే కందుకూరు దుర్ఘటనకు కారణం
– ఏ పార్టీ వారైనా, కూలి డబ్బులుకొచ్చి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం
– ఇరుకు సందుల్లో బాబు రోడ్ షో లు- డ్రోన్ వీడియోలు చూపించి సక్సెస్ అంటూ ఎల్లో మీడియా బాకా
– వెధవ పనికి సిగ్గుపడాల్సిందిపోయి, సంతాప సభలా..? బాబుకు ఎల్లో మీడియా ఓదార్పా..!
– పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం బాబుకు కొత్తేమీ కాదు
– గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలను బలిగొన్నది కూడా బాబే..
– నీ అధికార దాహానికి ఎంత మంది ప్రాణాలు తీస్తావు బాబూ?
– పోలీసులు వారిస్తున్నా.. ఇరుకు సందుల్లో సభలా..? పైగా పోలీసుల్ని నోటికొచ్చినట్లు తిడతారా..?
– 8 మంది కుటుంబాలు ఘోషిస్తున్నా.. పర్యటన మాత్రం బాబు కొనసాగిస్తున్నాడు.
– కందుకూరు ఘటనపై సీఎం జగన్ గారు వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
– అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది కాబట్టే, మిగతా వారి ప్రాణాలు కాపాడుకోగలిగాం.
– 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక్క ఛాన్స్ అంటున్నాడంటేనే రాజకీయ దిగజారుడుతనం
-ః రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
డ్రోన్ కెమెరా షాట్స్ కోసం ఇరుకు సందుల్లో బాబు సభలు
చంద్రబాబు నాయుడు నిర్వహించిన కందుకూరు ఇదేం ఖర్మ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఈ ఘటన యాధృచ్ఛికంగా జరిగిందా? మానవ తప్పిదం వల్ల జరిగిందా? అనేటువంటిది పరిశీలన చేస్తే.. కేవలం చంద్రబాబు నాయుడు విచిత్ర ధోరణి, విపరీతమైన ప్రవర్తనే ఈ దుర్ఘటనకు కారణం. చంద్రబాబు నాయుడు తన సభలు, సమావేశాలను ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో, సందుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇరుకు గా ఉండే ప్రదేశాల్లో సభలు నిర్వహిస్తే జనం ఎక్కువ మంది వచ్చారని డ్రోన్ కెమెరాల ద్వారా ఎల్లో మీడియాలో చూపించడానికి చంద్రబాబు గత కొద్దిరోజులుగా తాపత్రయపడుతున్నారు. దాంతో.. ఎల్లో మీడియాలో చంద్రబాబు సభలకు విశేష స్పందన వచ్చిందని, కిలోమీటర్ల దూరంలో జనం బారులు తీరారంటూ బాకా ఊదుతున్నారు. పార్టీ సమావేశాలను ఎక్కడ పెట్టాలి, ఎంతమందిని ఆ సభకు తరలించాలి, డ్రోన్ కెమెరాల ద్వారా ఏవిధంగా దానిని కవర్ చేసి, ఉన్నది లేనట్లుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే, నిన్న కందుకూరులో జరిగిన రోడ్ షో జరిగిన విధానం చూస్తే అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు దురాశ, అధికార దాహం ఇందుకు అద్దం పడతాయి. లేనిది ఉన్నట్లు సృష్టించి భ్రమలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా స్పష్టంగా అర్థం అవుతోంది.
కందుకూరులోని ఎన్టీఆర్ కూడలిలో మొదట సభ ఏర్పాటు చేసి, మూడు రోడ్ల కూడలిలో అక్కడైతే, జనం కనిపించరని, చంద్రబాబు అత్యుత్సాహంతో తన వాహనాన్ని, అక్కడ ఇరుకు సందులోకి తీసుకురావడం జరిగింది. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్డులో చంద్రబాబు వాహనం రావడం, ఆ సందులోనే, కందుకూరులోని టీడీపీకి చెందిన ఇరు రెండు వర్గాలు, గ్రూప్ రాజకీయాలతో పోటాపోటీగా రోడ్డుకు ఇరుపక్కలా ఫ్లెక్సీలు కట్టారు. జనాలు ఎటూ వెళ్లకుండా ఆ ఫ్లెక్సీల మధ్యే నిలబడితే డ్రోన్ కెమెరాల ద్వారా చంద్రబాబు సభకు విశేషంగా జనం వచ్చారని చూపించే ప్రయత్నం చేస్తే.. అది వికటించి ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. చంద్రబాబు దిగజారిన ప్రవర్తనతో ప్రజలకు ముప్పు వాటిల్లుతోంది.
కందుకూరు ఘటనలో మరణాలు అన్నీ ముమ్మాటికి చంద్రబాబు నాయుడు చేసిన హత్యలే. చంద్రబాబే దోషి. ఈ ఘటనలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టాలి. ఒక్కరోజు పరామర్శతో అయిపోదు కదా? కుటుంబాలను కోల్పోయిన పెద్దదిక్కును ఎవరు తెచ్చి ఇస్తారు. శవ రాజకీయం చేయటం లేదు.. 8మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడనే ఆవేదన
ఎనిమిదిమంది మరణాలకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడే. మేమేమీ ఇక్కడ శవ రాజకీయాలు చేయడం లేదు. వాస్తవంగా జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నాం. ఎనిమిదిమందిని చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారనే ఆవేదనతో మాట్లాడుతున్నాం. చనిపోయినవారు ఏ పార్టీకి సంబంధించినవారు అయినా, కూలీ డబ్బులకి ఆశ పడి వచ్చి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది.
చంద్రబాబు రావడం, వచ్చిన తర్వాత ఇరుకు సందులో వాహనాన్ని నిలబెట్టడం, తనతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకుని రావడం, వారిని ముందుకు రావాలని ఆదేశించడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. జనం ఎక్కువమంది వచ్చారనేలా కవర్ చేసే వాహనం ముందుకు, వెనక్కి పలుమార్లు రావడంతో ముందు, వెనుక ఉన్న జనాలు తొక్కిసలాటకు గురయ్యారు. కనీస అవగాహన లేకుండా చంద్రబాబు వాహనం ముందే మోటర్ బైక్ లు నిలపడం. అంతేకాకుండా పక్కనే డ్రెయిన్ ఉందన్న కనీస స్పృహ లేకుండా వాహనాన్ని నిలబెట్టడం చూస్తే తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారో.. అందుకే ఇవి చంద్రబాబు పబ్లిసిటీ కోసం చేసిన హత్యలు అంటున్నాం. చంద్రబాబుకు ఇది కొత్తేమీ కాదు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా జనాల్ని నిలువరించి, ఫోటో షూట్ తర్వాత ఒక్కసారిగా జనాల్ని వదలిపెట్టడంతో ఆరోజు 29మంది మృతికి కారణం అయ్యారు.
సీఎం ఆదేశాలతో తక్షణ సహాయ చర్యలు- ప్రాణ నష్టం తగ్గించగలిగాం
నిన్నటి కందుకూరు ఘటనలో పక్కనే ఆస్పత్రి ఉంది కాబట్టి క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించడం జరిగింది. సీఎం జగన్ గారి ఆదేశాలతో ప్రభుత్వయంత్రాంగం తక్షణమే స్పందించి బాధితులకు చికిత్స అందించడంతో మిగతావారి ప్రాణాలను కాపాడగలిగాం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ దగ్గర నుంచి ఉన్నతాధికారులు వరకూ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పక్కనే ఆస్పత్రి ఉంది కాబట్టి చాలామంది ప్రాణాలు నిలిచాయి. లేకుంటే చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమై ఘటనా స్థలంలోనే ఉండి బాధితులకు సాయం అందించారు. మెరుగైన వైద్యం అందిస్తూ, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. దానివల్లే కొంతమంది ప్రాణాలను నిలుపుకోగలిగాం.
చేసింది వెధవ పని.. పైగా ఎల్లో మీడియాలో గప్పాలా..?
చంద్రబాబు పబ్లిసిటీ, అధికార దాహం కోసం ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. జరిగింది దురదృష్టకర సంఘటన. చేసిన వెధవ పనికి చెంపలు వేసుకుని సిగ్గుపడాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏదో ఘనకార్యం చేసినట్లు ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ మృతుల కుటుంబాలకు పరిహారంగా 10 లక్షలు ప్రకటించారని, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బహిరంగ సభను, సంతాప సభగా మార్చేశారంటూ, వెంటనే బాధితుల్ని పరామర్శించారంటూ గప్పాలు కొడుతున్నాయి. ఓదార్పు, సంతాపం, విచారం వ్యక్తం చేయడం, చంద్రబాబు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాతో పోయినవారి ప్రాణాలు తిరిగి తీసుకువచ్చి ఇవ్వగలరా? పేదవాడి ప్రాణాలకు వెలకట్టి వదిలేస్తామని అనుకుంటున్నారా? చనిపోయినవారి కుటుంబాల పట్ల చంద్రబాబు ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు, ఆయనకు మద్దతుగా కొన్ని పత్రికలు వత్తాసు పలకడం అనేది సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశం. రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదోవిధంగా భ్రమలు సృష్టించి, లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఎనిమిది మంది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆ కుటుంబాల ఘోష చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి తప్పక తగులుతుంది.
బాబు సభలకు జనం ఎందుకు వస్తారు?
చంద్రబాబు సభలకు జనం ఎందుకు వస్తారు? ఎందుకు రావాలి? కూలీ ఇచ్చి జనాల్ని తరలిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో చంద్రబాబు చెప్పాలి. రైతు రుణమాఫీ చేశావా? మహిళలకు పావలా వడ్డీ రుణాలు రద్దు చేశావా? ఇంటికో ఉద్యోగం ఇచ్చావా? నిరుద్యోగ భృతి ఇచ్చావా? ఏం ఉద్దరించాడని జనం వస్తారు అన్నది చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విజయం ఎరుగని వ్యూహకర్తలు, సిద్ధాంత కర్తల్ని చూస్తేనే మీ సభలు ఏవిధంగా జరుగుతున్నాయో అర్థం అవుతుంది.
చంద్రబాబు ఆలోచనా సరళి ఏవిధంగా ఉంటుందో పసిగట్టే 20 అడుగుల రోడ్లలో సభ పెట్టి ఫ్లెక్సీల మధ్య జనాన్ని ఇరికించి ఎనిమిది మంది చావుకు కారణం అయ్యారు. చంద్రబాబు మైండ్ సెట్ కు తగ్గట్టుగానే ఇరుకు సందుల్లో జనాల్ని ఎక్కువమందిని చూపించడమే.. సభ విజయవంతం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం లేదు. జనాలు భారీ ఎత్తున తమ సభలకు తరలి వచ్చారనేలా డ్రోన్ కెమెరాల ద్వారా విన్యాసాలు చేస్తూ పచ్చ మీడియాలో చూపించుకునే తాపత్రయం చంద్రబాబులో కనిపిస్తోంది. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వచ్చిన నిన్ను.. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు చంద్రబాబు రావడం వల్లే మా కుటుంబాలకు ఖర్మ పట్టిందని అంటున్నారు. ఆ కుటుంబాల ఘోషకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడే ఓ ఖర్మ. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పుట్టడమే ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ. నీ ఖర్మకు ఎంతమంది బలి అయిపోతారు బాబూ..
వైఎస్ఆర్సీపీ తరఫున కూడా కందుకూరులో సభ పెట్టాం. విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశాం. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగం వినడానికి జనం పెద్దఎత్తున వచ్చారు. ఎక్కడా ఒక అపశ్రుతి కూడా చోటుచేసుకోలేదు.
ఒక్క ఛాన్స్ అంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయం
జనాలకు చంద్రబాబు చెప్పేదేమీ లేదు. కేవలం ఫోటో షూట్ కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు.
పోలీసులు మీ దగ్గరకు వస్తే ఏం సంబంధం, మీరెవరకు మా దగ్గరకు రావడానికి అంటూ ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు తూలనాడారో మర్చిపోయారా? ఇరుకు సందుల్లో సభలు పెట్టడం, ఫ్లెక్సీలు రోడ్లకు ఇరువైపులా కట్టడం వల్ల, జరిగరానిది జరిగితే పరిస్థితి ఏమిటి అని పోలీసులు వారిస్తున్నా, సూచనలు, సలహాలు ఇస్తే వారిని మీరు దూషిస్తారా? ఫ్లెక్సీలు కట్టేడప్పుడు పోలీసులు అభ్యంతరం చెప్పారని మీరు ఆరోపణలు చేయలేదా? పోలీసులకు ఏనాడైనా సహకరించారా?
తప్పు చంద్రబాబు నాయుడు చేసి, ఆ నెపాన్ని ప్రభుత్వం మీద, పోలీసుల మీద రుద్దాలనుకోవడం సిగ్గుచేటు
45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తనకు ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను అడగటం ఆయన దిగజారుడు ప్రవర్తనకు నిదర్శనం. సిగ్గు, శరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. ఇంత జరిగినా, 8 మంది ప్రాణాలు బలిగొన్నా, తన అధికార దాహం కోసం పర్యటనలు కొనసాగుతాయని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు.
నాటి హామీలు ఏమయ్యాయి బాబూ..?
2014 సెప్టెంబర్ లో అసెంబ్లీలో జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడారు. ఆరోజు జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనూ ప్రచురించారు. ‘జిల్లాలవారీగా చంద్రబాబు ప్రకటించినవి’ చూస్తే.. నెల్లూరు జిల్లాకు సంబంధించి పారిశ్రామిక వాడలు, ఆటోమొబైల్ హబ్, ఎయిర్ పోర్టు, దుగరాజుపట్నం పోర్టు, పులికాట్ సరస్సు, పర్యాటక అభివృద్ది, స్మార్ట్ సిటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్, మెరైన్ ఇనిస్టిట్యూట్, ఎరువుల కర్మాగారం.. ఇవన్నీ చంద్రబాబు ప్రకటించారు.
పారిశ్రామిక వాడలు గురించి దేవుడు ఎరుగు. దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఉపాధి కల్పన, పెట్టుబడులు అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఊదరగొట్టారు. కనీసం వీటికి ల్యాండ్ అక్విజేషన్ కూడా పూర్తి కాలేదు. అయిదేళ్ల తన పాలనలో ఏ పనులు మొదలుపెట్టలేదు. నెల్లూరు జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబు నాయుడు వీటన్నిటిపై స్పష్టత ఇచ్చి అడుగుపెట్టాలి.
ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి. చేయలేని వాటిపై.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. జనాలు మర్చిపోయి ఉంటారని అనుకోవద్దు. పారిశ్రామకవాడలు కనీసం ప్రారంభ దశలో కూడా పనులు మొదలవలేదు. నీ బుర్రలో తప్ప ఆటోమొబైల్ హబ్ ఎక్కడుందో కూడా తెలియదు. కనీసం దానికోసం ప్రయత్నం కూడా జరగలేదు. మీ హయాంలో జిల్లాలో ఒక్క ఎయిర్ పోర్టు అయినా ప్రారంభమైందా?
దుగరాజుపట్నం పోర్టు ను కూడా, పునర్విభజన చట్టంలో ఉన్నా కూడా సాధించలేకపోయావు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, పోర్టును అడగకుండా వాటన్నింటిని అటకెక్కించి ప్యాకేజీ చాలనుకున్నావు. పులికాట్ సరస్సు, పర్యాటకానికి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. స్మార్ట్ సిటీ అని నెల్లూరును ప్రకటించి కేవలం రూ.7 కోట్లు ఇచ్చావు. అందులో కోటి రూపాయిలు ఎక్కడ ఏం ఉండాలనే అంచనాలకే ఖర్చు పెట్టావు. చివరిలో జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నావు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఎక్కడుంది? మెరైన్ ఇనిస్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఎక్కడుంది?
జిల్లాలో అడుగుపెట్టే ముందు విలువలు, విశ్వసనీయత ఉంటే నీ తోక పత్రికల్లో రాసుకున్న వాటిపై సమాధానం చెప్పాలి. లేకుంటే చేయలేకపోయాను క్షమించాలని అడుగు. మా ప్రభుత్వంలో చెప్పినవి చేశాం కాబట్టే.. ధైర్యంగా జనాల్లోకి వెళ్లగలుగుతున్నాం. చంద్రబాబు ఏమీ చేయకుండా చేశామంటూ అన్ని వర్గాలను మోసం చేశాడు. నీ నోటి నుంచి వచ్చేవన్ని అబద్ధాలే. అభివృద్ధి శూన్యం. ఒక్కటి కూడా నీతి, నిజాయితీ లేదు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా జిల్లా ప్రయెజనాలను, జిల్లా ప్రజలను మభ్య పెట్టడానికి వస్తున్న చంద్రబాబుకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి జిల్లాలో పదికి పది సీట్లల్లో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఇప్పటికైనా చంద్రబాబు చౌకబారు వ్యవహారాలు, మాటలు మాట్లాడటం తగ్గిస్తే మంచిది.చంద్రబాబు తన పర్యటనల ద్వారా ప్రజల ప్రాణాలు తీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.