-రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కేలేదు…
-బాలారిష్టాలు దాటుకుని అమరావతి రైతుల పాదయాత్ర -ప్రారంభం… అనూహ్య స్పందన
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టే హక్కే లేదని, ఒకవేళ అలా బిల్లు ప్రవేశ పెడితే, అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని మాజీ చీఫ్ జస్టిస్ గోపాల గౌడ వ్యాఖ్యానించారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుందట అని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఈ కేసును తాను పరిశీలిస్తూ ఉండి ఉంటే… ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసేవాడిని గోపాల గౌడ పేర్కొన్నారని, రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు. ప్రస్తుత న్యాయమూర్తి సైతం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కోర్టు ధిక్కరణ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపగానే, ఆయన వాటిని పరిశీలిస్తారో?, లేదో నన్న అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను ఒక్కసారి పరిశీలించాలని గవర్నర్ కు సూచించవలసినదిగా కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ లో ఆ చురుకుదనం కనిపించడం లేదన్న భావన ప్రజల్లో వ్యక్తం అవుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గవర్నర్ ను కించపరచాలన్నది తమ ఉద్దేశం కానే కాదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా మాజీ సీజే చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, హైకోర్టు తీర్పు కు భిన్నంగా, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పి, ఆ బిల్లు ను గవర్నర్ న్యాయ పరిశీలనకు పంపాలని అమరావతి రైతుల పక్షాన కోరుతున్నానని చెప్పారు.
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదానికి పంపితే ఆయన తిరస్కరిస్తారనే ఆశిస్తున్నట్లు తెలిపారు. బెంగుళూరు నగరంలో ప్రభుత్వ అనుమతి పొందిన ఒక లేఅవుట్ లో మార్పులు చేయాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని గోపాల గౌడ పేర్కొన్నట్లు ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ చట్టం చేసి, అమరావతి రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించిందని, అటువంటి మాస్టర్ ప్లాన్ లోని జోనల్ వ్యవస్థలను మార్చి, ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారన్నారు. ఒక్కసారి ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత లేఅవుట్ మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉండగా, చట్టం చేసి రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో జోనల్ వ్యవస్థను మార్చడానికి ఎలా వీలవుతుందని? ప్రశ్నించారు.
అయినా రాష్ట్ర మంత్రివర్గం సి ఆర్ డి ఏ చట్టానికి సవరణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తే, సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పదు అన్నారు. ప్ప్రజాధనాన్ని మాత్రం వందలకోట్ల రూపాయలు న్యాయవాదులకు ప్రభుత్వ పెద్దలు కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టులలో 200 కేసులు ఓడిపోయినప్పటికీ, ప్రభుత్వ పెద్దలకు సిగ్గు రావడంలేదని విమర్శించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీలులేదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం చెప్పారని, అందరికంటే ముందే తాను ఈ విషయాన్ని చెప్పాననిపేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై ఇప్పటికైనా మంత్రులు తమ వాచాలతను కట్టి పెట్టాలని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.
అన్ని పార్టీల సంపూర్ణ మద్దతు
అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రభుత్వం నుంచి ఎదురైనా బాలారిష్టాలను దాటుకొని ప్రారంభమైందన్న రఘురామకృష్ణం రాజు, ఈ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. తొలుత అమరావతి రైతులు, న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము చేపడుతున్న దీక్ష వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా వెయ్యి కిలోమీటర్ల మేరకు అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు, మహిళలు రెండవ విడత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు.
అయితే చిత్తశుద్ధి , బుద్ధిలేని తమ రాష్ట్ర ప్రభుత్వం, వారి పాదయాత్రకు ఎన్నో అడ్డంకులను కల్పించే ప్రయత్నం చేసిందన్నారు. అయినా కోర్టు తీర్పు తో రైతులు , మహిళలు మొక్కవోని దీక్షతో పాదయాత్రను ప్రారంభించారన్నారు. కృష్ణాజిల్లా, ఉభయగోదావరి జిల్లాల నుంచి విశాఖకు చేరుకునే వరకు, ఈ పాదయాత్రలో వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయ నున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య నాయకుడు మనోహర్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కమ్యూనిస్టు పార్టీ నేతలు నారాయణ, రామకృష్ణలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానా థ్, ముఖ్య నాయకుడు తులసి రెడ్డి లు పాదయాత్రలో పాల్గొని, తమ మద్దతుని తెలియజేయనున్నారని తెలిపారు.
అమరావతికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతు ప్రకటించిన తర్వాత బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ పాదయాత్రలో ఏదో ఒక దశలో కేంద్ర మంత్రులు కూడా హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. టిడిపి, జనసేన, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు, ప్రజా సంఘాలన్నీ అమరావతి నే రాజధానిగా కోరుకుంటున్నాయని తెలిపారు.
ఉద్యోగాలు కాపాడుకోవడానికి బూతు భాష మాట్లాడుతారా?
తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి మంత్రులు, పోయిన ఉద్యోగాలను రాబట్టుకోవడానికి మాజీ మంత్రులు, మంత్రి పదవిని ఆశిస్తున్న మరి కొంతమంది ఎమ్మెల్యేలు బూతు భాషను మాట్లాడుతున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. తెలుగు వ్యాకరణం మాదిరిగా, మంత్రులు, మాజీమంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు పడికట్టు పదాలతో బూతు భాషను గోడ్లు కాసుకునే వారి కంటే హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.. ప్రతిపక్ష నేతలను బూతులతో తిట్టడం లేదని ముగ్గురు మంత్రులను, మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ఇటీవల జరిగిన క్యాబినెట్ బేటిలో ముఖ్యమంత్రి హెచ్చరించినట్లుగా తెలిసిందన్నారు.
గతంలో బూతుల మంత్రులుగా పేరుపొందిన వారు, ప్రస్తుత మంత్రులు, భవిష్యత్తులో మంత్రి పదవి దక్కుతుందన్న ఆశావాహులు మాట్లాడుతున్న భాష చూస్తే అసహ్యం వేస్తుందనీ అన్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మరొక మంత్రి అప్పలరాజు, బొత్స సత్యనారాయణలు, మాజీమంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లు ముఖ్యమంత్రి ఆదేశాలతో మేరకు అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్ర పై అవాకులు, చేవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను… ఉత్తరాంధ్ర పై దండయాత్రగా పోల్చడం వారి అవివేకమని మండిపడ్డారు.
అసలు ఇలా మాట్లాడే మంత్రులకు బుద్ధి ఉందా? అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులు చేపట్టే పాదయాత్రను దండయాత్ర అని వారు ఎలా అంటారని నిలదీశారు. 29 వేల మంది రైతులు, తమ సర్వస్వమైన 33 వేల ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అప్పగిస్తే, ప్రతిపక్షనేతగా రాజధాని నిర్మాణానికి అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తల్లి పాలు తాగి, తల్లి రొమ్ము గుద్దినట్లుగా తన మాట వెనక్కి తీసుకున్నారని ధ్వజమెత్తారు. భూమి, నీళ్లు దండిగా ఉండాలని రాజధానిగా అమరావతికి ప్రతిపక్ష నేతగా ఓకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కోర్టు తీర్పును సైతం ధిక్కరించి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.
తన మంత్రివర్గ సహచరులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత మాట్లాడిస్తూ, తానేదో మంచి వాళ్ళకి మంచివాన్ని అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, వీరేదో కుట్రలకు తెర లేపుతున్నారన్న అనుమానం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో వైషమ్యాలు సృష్టిస్తే చూస్తూ, ఊరుకోవాలా ? అని మంత్రులు మాట్లాడడం తమ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లుగా ఉన్నాయన్నారు. అందుకే తాను ఒకటి రెండు రోజుల వ్యవధిలో కేంద్ర హోం శాఖ మంత్రి, లేదంటే ఎం ఓ ఎస్ ను స్వయంగా కలిసి, పాదయాత్ర భద్రత పర్యవేక్షణ ను కోర్టు పోలీసులపై పెట్టిందని, కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగా వారు భద్రతా చర్యలను పటిష్టంగా తీసుకుంటున్నారా? లేదా?? అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులను పురమాయించాలని కోరనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల తో, పోలీసులే పాదయాత్రను భగ్నం చేసేందుకు రకరకాల కేసులు పెట్టి రైతులను వేధించే అవకాశం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు పాదయాత్ర భద్రతను పర్యవేక్షిస్తున్నారని తెలిస్తే, తమ ప్రభుత్వ పెద్దలు పాదయాత్రికులపై కేసులు పెట్టి వేధించడానికి వెనుకంజ వేస్తారని అన్నారు.
క్రిస్టియన్ ఆస్తులను పరిరక్షించాలి
రాష్ట్రంలో మన పార్టీ ఓట్లు వేసిన వారిలో క్రిస్టియన్లు కూడా ఉన్నారని వారి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజమండ్రిలోని క్రిస్టియన్ సంస్థకు చెందిన మహిళ కాలేజీని పరదేశి బాబు అనే వ్యక్తి విజయలక్ష్మి కి 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వగా, విజయలక్ష్మి ఆ కాలేజీని మరొక వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారన్నారు. విజయలక్ష్మి కాలేజీని సబ్ లీజుకు ఇవ్వడాన్ని స్థానిక క్రైస్తవ మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు.
ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదైన వారంతా గతం లో దళితులేనని, క్రైస్తవ మతంలోకి మారారని తెలిపారు . క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఆ కాలేజీకి దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయని, ఆ భూములను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం కొనసాగుతుందని రాజమండ్రి ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. అలాగే విశాఖపట్నం ప్రభుత్వ భూములను సైతం కబ్జా కాకుండా కాపాడాలని కోరారు. ఇక సోషల్ మీడియాలో రాజధానికి మద్దతుగా యాక్టివ్ గా వ్యవహరిస్తున్న వారిపై తమ ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారన్న చర్చ సామాజిక మాధ్యమాలలో కొనసాగుతుందన్నారు.
ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నవారికి ప్రాణాలను తీసివేయా లని, అలాగే ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న వారిని పోలీసుల చేత దండించాలని, త్రీ స్టార్ రేటింగ్ ఉన్నవారిని కేసుల పేరిట వేధించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లుగా సామాజిక మాధ్యమాలలో నెటిజెన్లు చర్చించుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తమ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, అడవుల శాఖ చైర్మన్ తో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డిలు చేస్తున్న జుగుస్సాకరమైన వ్యాఖ్యల కంటే, వారేమీ అభ్యంతరకరమైన భాష వాడడం లేదన్నారు. గతంలో మన పూర్వీకులు హింసను నమ్ముకుంటే నమ్ముకుని ఉండవచ్చునని, మనం శాంతియుత మార్గం ద్వారా వెళ్దామని పరోక్షంగా ప్రభుత్వ పెద్దలకు రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.
ఇసుకను ఈ ఏడాదిన్నర పాటు గత ప్రభుత్వాలు అందజేసినట్టుగా సరసమైన ధరకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సరసమైన ధరకే ఇసుక అందుబాటులోకి తీసుకువస్తే, పార్టీకి మేలు జరుగుతుందని, లేకపోతే సాంప్రదాయ ఓటర్లతో పాటు, పక్కాగా ఓట్లు వేయిస్తారనుకునే వారు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక దందా నుంచి టర్న్ కి సంస్థ ఎందుకు తప్పుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు .
కృష్ణం రాజు ఆత్మ శాంతించాలి
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆత్మ శాంతించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. సినీ హీరో ప్రభాస్ కడుపున తాను మళ్ళీ కొడుకుగా జన్మించాలని ఆయన కోరుకున్నారని, ప్రభాస్ వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుని కృష్ణంరాజు కోరిక తీర్చాలని సూచించారు.