– టీడీపీలోకి ఆదాల, మాగుంట, వేమిరెడ్డి?
– హైదరాబాద్ లో ముగ్గురి మంత్రాంగం ?
– ఢిల్లీలో జగన్‌ను కలవకూడదనే దుబాయ్ వెళ్లిన వేమిరెడ్డి – నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిపై వేమిరెడ్డి సూచనను పట్టించుకోని జగన్ – వేమిరెడ్డికి కాంట్రాక్టుల హామీ ఇచ్చి చేతులెత్తేసిన జగన్ – ఇసుక కాంట్రాక్టు ఇస్తానని తమ్ముడు అనిల్‌కు ఇచ్చిన జగన్ – తెలంగాణ, మరో బీజేపీ రాష్ట్రంలోనూ కాంట్రాక్టులపై మొండిచేయి – జగన్ మాటతప్పిన వైనంపై అసంతృప్తితో వేమిరెడ్డి
– ఒంగోలు టీడీపీ ఎంపీ రేసులో మాగుంట తనయుడు – ముగ్గురూ కలసి ఒకేసారి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం – పార్టీని వీడేది లేదన్న ఆదాల
రెండు రోజుల్లో సంచలన ప్రకటన ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో అధికార వైసీపీకి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కీలక ఎంపీలు జగన్ కు బైబై చెప్పి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు జై కొట్టనున్నారు. ఆ మేరకు వారు ముగ్గురూ హై దరాబాద్లో మంత్రాంగం జరిపారు. అన్నీ కలసివస్తే రెండు, మూడు రోజుల్లో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నెల్లూరు వైసీపీ ఎంపి ఆదాల ప్రభాకర్రెడ్డి, ఒంగోలు వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరుకు చెందిన వైసీపీ రాజ్యసభసభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ముగ్గురూ హైదరాబాద్లో ఒకేచోట చర్చలు జరిపారు. అయితే ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి, తనకు బదులు తనయుడిని లోక్సభ బరిలో దింపాలని భావిస్తున్నారు.
నిజానికి జగన్ కు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడటమే ఆశ్చర్యం. ప్రస్తుతం ఉన్న ఎంపి, మంత్రులు, ఎమ్మెల్యేలలో వేమిరెడ్డి లాంటి ఒకరిద్దరు మాత్రమే.. జగన్‌తో కలసి భోజనం చేసేంత సాన్నిహిత్యం ఉంది. గత ఎన్నికల్లో వేమిరెడ్డి పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న విషయం బహిరంగమే.
అలాంటి వేమిరెడ్డి కూడా, జగన్ వైఖరితో విసిగిపోయారంటున్నారు. తాను నెల్లూరు లోక్సభకు పోటీ చేయాలంటే .. అసెంబ్లీ టికెట్లను తాను సూచించిన వారికి ఇవ్వాలన్నది వేమిరెడ్డి ప్రధాన షరతు. అందులో భాగంగా నెల్లూరు అసెంబ్లీ సీటును అనిల్ కుమార్ యాదవ్ కు కాకుండా, తన భార్యకు ఇవ్వాలన్నది రెండో షరతు. అది కుదరకపోతే తాను సూచించిన మైనారిటీకి ఇవ్వాలని ఆయన కోరారు. అయితే మనకు కమ్మ-బ్రాహ్మణ-వైశ్య-క్షత్రియులు తప్ప అన్ని వర్గాలూ మనతో ఉన్నందున గెలుపుపై భయపడాల్సిన పనిలేదని, జగన్ తన వద్దకు వచ్చిన వేమిరెడ్డికి భరోసా ఇచ్చారట.పైగా ప్రజల్లో పార్టీ పట్ల 82 శాతం సంతృప్తి ఉందన్న అయిష్టంగానే పోటీకి ఒప్పుకున్నారట.
అనిల్‌ను మార్చాలన్న వేమిరెడ్డి ప్రతిపాదనను తొలుత తిరస్కరించిన జగన్.. ఆ తర్వాత మనసు మార్చుకుని, అనిల్‌ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే నెల్లూరుకు మాత్రం వేమిరెడ్డి సూచించిన వారికి కాకుండా, మరో మైనారిటీకి ఇస్తుండటం వేమిరెడ్డికి ఆగ్రహం కలిగించింది.
అదీకాకుండా రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు తనకే ఇస్తానన్న జగన్ మాటతప్పి, చెన్నైలోని జగన్ సోదరుడు అనిల్ రెడ్డికి కట్టబెట్టడాన్ని, వేమిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణలో ఒక భారీ ప్రాజెక్టు టెండరు కేసీఆర్ కు చెప్పి, ఇప్పిస్తానన్న జగన్ మాట కూడా ఫలించలేదు. ఆలోగా ఎన్నికలు రావడం – కేసీఆర్ ఓడిపోవడం జరిగిపోయింది.
అంతకుముందు బీజేపీ పాలిత రాష్ట్రంలో.. ఒక కాంట్రాక్టు ఇప్పిస్తానన్న జగన్ అక్కడ కూడా మొండి చేయి చూపడంతో, వేమిరెడ్డి పార్టీ అధినేత జగన్ కు దూరమవుతూ వచ్చారు. చివరకు తాజాగా జగన్ ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో, ఆయనను కలవాల్సివస్తుందన్న ముందుచూపుతోనే, దుబాయ్ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి వేమిరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఆమేరకు నాటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆ ప్రకారంగా జిల్లా మొత్తం ఎన్నికల ఖర్చు తానే భరించేందుకు వేమిరెడ్డి సిద్ధపడ్డారట.
అయితే నెల్లూరులో వేమిరెడ్డి సొంత ఖర్చుతో, వికలాంగుల కోసం నిర్మించిన భారీ భవన ప్రారంభోత్సవానికి వస్తానన్న.. నాటి సీఎం చంద్రబాబునాయుడు రెండుసార్లు సమయం ఇచ్చి రాకపోవడంతో, టీడీపీలో చేరాలనుకున్న వేమిరెడ్డి.. మనసు మార్చుకుని వైసీపీలో చేరారు. అంతేతప్ప టీడీపీతో ఆయనకు ఎలాంటి వైరం లేదని, అటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
కాగా ఒంగోలు నుంచి తిరిగి టికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ఇవ్వకపోవడంతో, మాగుంట టీడీపీ నేతలతో చాలాకాలం నుంచి టచ్లోకి వెళ్లారు. తనకు మద్దతుదారైన బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం, సీఎం వద్ద పట్టులేదని-చివరకు బాలినేని సీటుకే జగన్ ఎసరు పెడుతున్నారని తేలిపోవడంతో, మాగుంట టీడీపీని ఎంచుకున్నారు. ఒంగోలు వైసీపీ సీటును చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఇవ్వాలని జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాగుంట శ్రీనివాసరెడ్డి కాకుండా, తనయుడు రాఘవరెడ్డిని ఎంపీగా నిలబెట్టాలని భావిస్తున్నారట.
ఇక నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఆయన బిల్లులు పెండింగ్లో ఉండటంతోపాటు, జగన్ అపాయింట్మెంట్ కూడా లభించకపోవడంతో పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చేశారట.
“బిల్లు తీసుకున్న వెంటనే టీడీపీ నుంచి మన పార్టీలో చేరిన ఆదాల, తన అవసరం కోసం చేరాడే తప్ప మనపై ప్రేమతో కాదు. కాబట్టి ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేద”ని జగన్ సీఎంఓ అధికారుల వద్ద, గతంలో వ్యాఖ్యానించారన్న ప్రచారం అప్పట్లోనే జరిగింది. నిజానికి ఆ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో, అంత ఆర్థిక వనరులున్న నేతలు కూడా టీడీ పీలో లేకపోవడం గమనార్హం.
అయితే తాను వైసీపీని వీడేది లేదని తాజాగా ఆదాల ప్రకటించినప్పటికీ.. అది తనపై వచ్చిన ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు చేసిన, తాత్కాలిక ప్రకటనగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈవిధంగా చాలామంది ముందు ఖండించి, ఇతర పార్టీల్లో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కాగా ఈ ముగ్గురూ టీడీపీలోకి టచ్ లోకి వెళ్లినందుకే, ఒంగోలు-నెల్లూరు ఎంపీ సీట్లను టీడీపీ నాయకత్వం పెండింగ్లో పెట్టింది. ఒకదశలో మాగుంట-ఆదాలతోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, జంకె వెంకటరెడ్డి టీడీపీలో మూకుమ్మడిగా చేరతారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇది తెలిసిన ఒంగోలు వైసీపీ ఎంపి అభ్యర్థి చెవిరెడ్డి సీఎంతో చర్చించారు. ఫలితంగా ఈ టీం లోని జంఎ వెంకటరెడ్డికి ఏపిఐఐసి చైర్మన్ పదవి ఇచ్చి, ఆ బృందం నుంచి విడగొట్టారు.