– ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తిరుపతి: తిరుపతి జిల్లాలో సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరిగే జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఓ ఎస్ డి, పెట్టన్న చౌదరి, టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈ.ఓ. శ్యామల రావు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక కమీషనర్ ఎన్.మౌర్య లతో కలిసి జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు ఉన్నాయి… ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయన్నారు. పార్లమెంటు స్పీకర్ నూతన ఒరవడి తీసుకుని వచ్చారని, ఈ కమిటీల్లో మహిళా కమిటీలు కూడా ఉంటాయని తెలిపారు. వీటి ద్వారా అనేక సమస్యలపై చర్చలు జరుగుతుంటాయన్నారు. ప్రతి సమస్యను స్పీకర్ డిప్యూటీ, స్పీకర్ పరిష్కరించాలంటే కష్టమైన పని అని అన్నారు. మహిళ సాధికారతకు సంబంధించిన ఒక కమిటీ కూడా ఉందని, ఆ కమిటీలలో వారు సమస్యలపై చర్చించి అసెంబ్లీకి వారి తరఫునుంచి చర్చ విధానాలను తెలియజేయడం, పరిష్కారం మార్గాలను అన్వేషించి స్పీకర్ దృష్టికి తీసుకువెళతారన్నారు.
అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన అంశాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. న్యాయపరమైన వంటి సమస్యలపై ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. లోకసభ స్పీకర్ ప్రతి లోకసభలో కూడా ప్రతి సమస్యపై కూడా ఒక ప్రత్యేకమైన చర్చ ఉండాలని, ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఆ కమిటీ ద్వారా చర్చ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు సరైనవి అయితే రాష్ట్ర అభివృద్ధికి సరైన నిర్ణయం చేయడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
అసెంబ్లీలో వారం రోజులు పాటు చర్చలు కాకుండా సంవత్సరానికి 60 రోజులు చర్చలు జరిగేలా జరగాలని 60 రోజులు కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం జరిగేలా ఉండాలని లోకసభ స్పీకర్ సూచించారు. బాంబేలో ఈ మధ్యకాలంలో ఎస్టిమేట్ కమిటీ అలాగే ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి సమావేశం కూడా జరిగిందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని స్పీకర్ తెలిపారు.
మహిళా సాధికారత కమిటీలు తిరుపతి జిల్లా జరుగుతుందని ఈ కమిటీకి ప్రతి రాష్ట్రాన్ని కూడా ఐదు ఆరు మంది సభ్యులు హాజరవుతారని చెప్పారు. వీరందరూ కూడా రెండు రోజులు వారి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి ఆ రిపోర్టుని పార్లమెంట్, అసెంబ్లీ ద్వారా గాని చర్చించి చర్యలు తీసుకుంటాని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ ఒక మంచి కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు.
ఈ కాన్ఫరెన్స్ ఎక్కడా జరగని విధంగా కమిటీల వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ సమావేశం అనంతరం కాన్ఫరెన్స్ కు హాజరైన వారికి శ్రీకాళహస్తి దైవ దర్శనం, శ్రీసిటీ, శ్రీహరికోట వంటి ప్రదేశాలలో తీసుకువెళతారని చెప్పారు. మన రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అదే రోజు ఉంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, దేశ ప్రధానులు మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో డ్వాక్రా వ్యవస్థ దేశ స్థాయిలో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నంత మహిళాభ్యుదయం ఇంకెక్కడా లేదని తెలిపారు. మహిళా సాధికారత కమిటీలు పార్లమెంట్ లో 31 మంది ఉంటారని, అలాగే ఒక రాష్ట్రానికి ఆరుగురు వరకు కమిటీ మెంబర్లు ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ఈ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఘనంగా నిర్వహించాలని సూచించారని తెలిపారు.
ఈ సమావేశం తిరుపతిలో సెప్టెంబర్ 14, 15 తేదీలలో నిర్వహించడం జరగనున్నదని మొదటిగా దైవ దర్శనాలతో మొదలై 14న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. సమావేశం అనంతరం కమిటీ వారికి చంద్రగిరి కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శనకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అలాగే 15 వ తేది శ్రీకాళహస్తి ప్రసస్తిని, కళంకారీ కళల ప్రశస్తిని కూడా తెలియజేసేలా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి శాసన సభ్యుడు చెప్పారని తెలిపారు. ఈ పర్యటనను కమిటీ వారికి గుర్తు ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సమావేశం నిర్వహణకు తిరిగి 15 రోజుల తరువాత మళ్ళీ సమావేశం నిర్వహించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్, ఇతర జిల్లా అధికారులు కృషి చేయాలని కోరారు.
జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ…సెప్టెంబర్ 14 , 15 తేదీలలో జరిగే జాతీయ మహిళా సాధికారత కాన్ఫెరెన్స్ కు లైజన్ ఆఫీసర్ ల ఏర్పాటు, భద్రత, వసతి, సమావేశ వేదిక సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాన్ఫెరెన్స్ విజయవంతం అయ్యేలా విధులు కేటాయించిన అధికారులు పనిచేయాలని అన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లా 34 మండలాలు 7 మున్సిపాలిటీలు, నాలుగు రెవెన్యూ డివిజన్ల కలిగి ఉందని స్పీకర్ కు తెలిపారు. జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ అజెండాను సంబంధిత అధికారులతో కలిసి తయారు చేసినట్టు చెప్పారు. అతిథులకు స్వామివారి దర్శనం, సమావేశ వేదిక, అకామిడేషన్, భోజన వసతి, రవాణా, భద్రత ఏర్పాట్ల పై ప్రణాళికబద్దంగా ప్లాన్ చేశామన్నారు. 14, 15 తేదీలలో రెండు రోజులు కాన్ఫెరెన్స్ ఉందని వివిధ హోటల్ లలో అతిథులకు బస ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని ప్రదేశాలలో భద్రతా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కాన్ఫెరెన్స్ అనంతరం 16వ తేదీన అతిథులు శ్రీసిటీ, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి , డి ఆర్ ఓ నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, ఎల్.ఎల్.ఎ లు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవెల విజయశ్రీ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట ఆర్ డి ఓ లు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, అడిషినల్ ఎస్.పి.రవిమనోహరా చారి, శాప్ చైర్మన్ రవి నాయుడు, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదా శివం, హస్త కళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.