– దండం పెట్టి దయచూడమంటూ శ్రీరెడ్డి పోస్టు
– బాబు, పవన్, లోకేష్, బాలయ్యకు క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి వీడియో
– కార్యకర్తలను వదిలేసి లీడర్ల సంగతి చూడమంటూ వేడుకోలు
– జగన్ జమానాలో రెచ్చిపోయి శ్రీరెడ్డి బూతులు
– ఇప్పుడు కనికరించమంటూ కాళ్లబేరాలు
– వైసీపీ సోషల్‌మీడియా దళాలకు నోటీసులే దానికి కారణం
– వైసీపీ సోషల్ వీరులకు ఇక చుక్కలు షురూ
– వందలమంది వైసీపీ సోషల్‌మీడియా దళాలకు నోటీసులు సిద్ధం
– అధికారంలో రెచ్చిపోయిన పేటీఎం బ్యాచ్
– కాసుల కక్కుర్తికి పోయి ఇప్పుడు స్టేషన్ల చుట్టూ చెక్కర్లు
– వైసీపేయులను వెంటాడుతున్న పాత వేధింపులు
– కుటుంబసభ్యులను వేధిస్తారన్న భయాందోళన
– ఇప్పటితో పరారయిన వందలాది మంది వైసీపీ ‘సోషల్’ సైన్యం
– జగన్ అభయంపై నమ్మకం లేని సోషల్‌మీడియా సైనికులు
– నాలుగు నెలల తర్వాత కూటమి కార్యకర్తల ఖుషీ
– పోలీసు చర్యతో శాంతిస్తున్న కూటమి కార్యకర్తలు
– కూటమి కార్యకర్తలు కోరుకుంటున్న యాక్షన్ ఇదే
( మార్తి సుబ్రహ్మణ్యం)
నవ్వుతూ అనడం. ఏడుస్తూ అనుభవించడం ఎందుకన్న పెద్దల మాట ఇప్పుడు నిజమవుతోంది. ఐదేళ్ల జగన్ జమానాలో కన్నూ మిన్నూ కానక, ఆ పార్టీ ఇచ్చే చిల్లర కోసం.. పదవుల కోసం.. అంతకుమించి.. జగనన్న కళ్లలో మెరుపులు చూసేందుకు వైసీపీ సోషల్‌మీడియా దళాలు, అప్పట్లో టీడీపీ-జనసేన నేతలపై చూపిన వికృత పైశాచికానందం వికటించింది.
అది ఇప్పుడు కేసుల రూపంలో భూతంలా వెన్నాడుతుండటంతో, వైసీపీ సోషల్‌మీడియా సైన్యంలో భయాందోళన మొదలయింది. జగన్ వీరాభిమాని శ్రీరెడ్డి స్వయంగా తన తప్పులు క్షమించి, కార్యకర్తలను విడిచిపెట్టమని ప్రాధేయపడిందంటే.. వైసీపీ శ్రేణుల మానసిక పరిస్థితి, ఎంత భయంతో వణికిపోతోందో స్పష్టమవుతుంది. చంద్రబాబునాయుడు-భువనేశ్వరి-లోకేష్-బాలకృష్ణ-పవన్ కల్యాణ్- రఘురామ కృష్ణంరాజు-అనితపై అడ్డగోలు మాటలు-రాతలు-గీతల పోస్టింగులతో రెచ్చిపోయి, వారి వ్యక్తిత్వహననానికి పాల్పడిన వైసీపీ సోషల్‌మీడియా దళాలను.. ఇప్పుడు కూటమి సర్కారు చెరబట్టడంతో, వైసీపీ శ్రేణుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. వారిని వేటాటి వెంటాడుతున్న వైనం వైసీపీలో అలజడికి కారణమవుతోంది.
ఇది..అధికారంలోకి వచ్చి ఐదునెలలయినా, ఇంకా వైసీపేయుల పీచమణచలేదంటూ.. ఆగ్రహం-అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి కార్యకర్తలకు, యమా ఖుషీగా మారింది. ఒక్కముక్కలో చెప్పాలంటే.. లేటయినా లేటెస్టుగా మొదలైన ఈ వేట, కూటమి శ్రేణులకు సంతృప్తినిస్తోంది. నిజానికి కూటమి కార్యకర్తలు, ఐదు నెలల నుంచి కోరుకుంటున్నది కూడా ఇలాంటి యాక్షన్ కోసమే.
జగన్ జమానాలో.. ఆయనను చూసుకుని, తన మాటలతో రెచ్చిపోయి బాబు, లోకేష్, భువనేశ్వరి, పవన్, రఘురామరాజు, అనితను బూతులు లంకించుకుని, అసభ్యకర పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి అనే ఒక వ్యాంప్ కారెక్టర్.. ఇప్పుడు వారంతా తనను క్షమించమంటూ, ప్రాధేయపడుతూ విడుదల చేసిన ఒక వీడియో.. వైసీపీ కార్యకర్తల మానసిక పరిస్థితికి.. భవిష్యత్తుపై భయానికి అద్దం పడుతోంది.
‘మీకు దండం పెడతా. నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలీదు. పెళ్లీ పెటాకులు లేని దాన్ని. నాకోసం కాదు. నావల్ల నా తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని నేను క్షమాపణ వేడుకుంటున్నా. దయచేసి కార్యకర్తల జోలికి రాకండి. లీడర్లు లీడర్లూ చూసుకోండి. మీ అందరికీ నా క్షమాపణలు’ అంటూ భయంతో కూడిన ఆవేదనతో కలసి చేసిన అర్ధింపు.. తాజాగా ఖాకీలు ఝళిపిస్తున్న కొరడా తీవ్రత, వైసీపీ కార్యకర్తలను ఏ స్థాయిలో భయకంపితులను చేస్తోందో స్పష్టం చేస్తోంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహంతో హోంమంత్రి అనితనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు, బాగానే వర్కవుటవుతోంది. ‘అవసరమైతే నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా’నన్న పవన్ హెచ్చరిక, ఎక్కడో కొడితే ఇంకెక్కడో తగిలినట్లు.. ఆ ఒక్క హెచ్చరికతో పోలీసు శాఖ దారికొచ్చింది. చంద్రబాబు-భువనేశ్వరి-లోకేష్-బాలయ్య-పవన్-రఘురామరాజు-అయ్యన్న-అనిత వంటి నేతలపై చెలరేగిన వైసీపీ సోషల్‌మీడియా అరాచక గుంపును ఎందుకు పట్టుకోవడంలే దన్న పవన్ కన్నెర్రకు ఖాకీలు ఎట్టకేలకూ కదిలినట్లు, వైసీపీలో చెలరేగిన కల్లోలం స్పష్టం చేస్తోంది.
జగన్ జమానాలో టీడీపీ-జనసేన నేతలపై దారుణమైన-అనాగరికమైన పోస్టులు పెట్టిన వందలాదిమంది సోషల్‌మీడియా సైనికులకు, పోలీసులు నోటీసుల ప్రవాహం మొదలయింది. దానితో గంగవెర్రులెత్తుతున్న వైసీపీ దళాలు పరారయ్యారు. అయితే తాము పారిపోయినప్పటికీ, పోలీసులు తమ కుటుంబసభ్యులను ఎక్కడ వేధిస్తారోనన్న ఆందోళన వెన్నాడుతోంది. దానితో ఏం చేయాలో అర్ధం కాక, వైసీపీ నేతలను ఆశ్రయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా. వర్ర రవీంద్రా రెడ్డి, ఇప్పల రవీంద్రా రెడ్డి, అవుతు శ్రీధర్ రెడ్డి, కళ్ళం హరి కృష్ణ రెడ్డి, శామ్యూల్ పూర్ణ సాగర్ దోవారి, మాన్విత కృష్ణా రెడ్డి, జానీ థి జోకర్, కుంచల సవీంద్రా రెడ్డి, వింత కళ సాగర్ రెడ్డి, పులివెందుల వివేక్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పులివెందుల, గుర్రం దేవేందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి, గజ్జల లక్ష్మి, అనిత రెడ్డి, లోక రవి, అమర్ బల్లా, ఈశ్వర్ విష్ణుభొట్ల, రామ్ రెడ్డి మానుకొండ, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రదీప్ రెడ్డి, కేఆర్ సూర్య, గొడతా సూర్య ప్రకాష్, చౌదరి బోనిగల, శ్రీనివాస్ ఉత్తరాంధ్ర వంటి జగన్ వీరభక్త సోషల్‌మీడియా సేనాధిపతులపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది.
వారిని వేటాడి వెంటాడి పట్టుకొస్తోంది. పారిపోయేవారికి కోటింగులిస్తున్న వీడియోలు, జగనాభిమానులను వణికిస్తున్నాయి. దీనితో చిల్లర డ బ్బులకు ఆశపడి.. కూటమి నేతలపై అనాగరిక పోస్టింగులు పెట్టిన మిగిలిన వారు, తమను ఎప్పుడు అరెస్టు చేస్తారోనన్న భయంతో కనిపిస్తున్నారు.
అయితే తమ కార్యకర్తలను కాపాడుకుంటామని వైసీపీ అధినేత జగన్, ఇతర నేతలు హామీలిస్తున్నప్పటికీ.. అసలు వారు తమకు అపాయింట్‌మెంట్ ఎప్పుడు ఇవ్వాలి? తాము ఎప్పుడు తమ గోడు చెప్పాలి? అన్న సందేహం సోషల్‌మీడియా సైనికులను వెన్నాడుతోంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తమ గోడు ఎందుకు వినిపించుకుంటారు? తమ కోసం లాయర్లకు డబ్బెందుకు ఖర్చుపెడతారన్నది మరో డౌటనుమానం.
తాజా పరిణామాలు వైసీపీ సోషల్‌మీడియా సైన్యాన్ని కుంగదీస్తుంటే.. కూటమి కార్యకర్తల్లో మాత్రం సంతోషం నింపుతున్నట్లు కనిపిస్తోంది. ఐదునెలల నుంచి తాము కోరుకుంటున్న న్యాయం ఇదేనంటున్నారు.
ఇది మంచి ప్రభుత్వం.. కక్ష సాధింపులకు మేం వ్యతిరేకం..వారిలా వేధిస్తే ప్రజలు మనలనూ మెచ్చుకోరు.. అన్న మాటలతో విసిగిపోయిన కూటమి కార్యకర్తల కోరి ను, పవన్‌కల్యాణ్ తీర్చినట్లు వారి మాటలతో అర్ధమవుతోంది. పవన్ కల్యాణ్ కన్నెర్ర చేయకపోతే.. ఖాకీలు కదిలేవారు కాదని, కాబట్టి ఈ గొప్పతనమంతా ఆయనదేనంటున్నారు.
ఏదైతేనేం.. వేట మొదలయింది. వైసీపీ ‘సోషల్’ శిబిరంలో ఆర్తనాదాలు.. హాహాకారాలు.. ఏడుపులు… పెడబొబ్బలు మొదలయ్యాయి. కూటమి కార్యకర్తల ఆత్మలు శాంతిస్తున్నాయి. ఇదీ ఇప్పటి చిత్రం.