– సినీ ఇండస్ట్రీలో కుదపు
– సీఎంను కలిసేందుకు నిర్మాతల ప్రయత్నాలు
– మధ్యవర్తిత్వం కోసం ఓ మంత్రికి ఆఫర్..?
– సీఎంను కలుస్తామన్న నిర్మాత నాగవంశీ
– బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా
– సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ అని టెన్షన్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అధిక ధరల విమర్శల కారణంగా ఇకనుంచి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించడం సంచలనం రేపింది. దీని ప్రభావం వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’పై పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే యోచనలో ఉన్నారు. దీనికోసం సీఎం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికోసం ఓ మంత్రిని మధ్యవర్తిత్వం కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ, సదరు మంత్రి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ధైర్యం చేయడం లేదని టాక్.
టాలీవుడ్లో టెన్షన్
పుష్ప వివాదం టాలీవుడ్ ను టెన్షన్ పెడుతోంది. ఈ ఘటన విషయంలో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని, అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచనని ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల సినిమా ఇండస్ట్రీ ఎదురు చెప్పలేదు.
కేవలం మౌనం మాత్రమే పాటిస్తున్నారు. ఎంతైనా సర్కారుతో పెట్టుకుంటే ఇండస్ట్రీకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రభుత్వం ముందు టార్గెట్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్వివాదం.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆందోళనలో పడేసింది.
మేం కలుస్తాం.. టైం ఇవ్వండి
ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూపీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు.
టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలపై చర్చిస్తామని నాగవంశీ అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకూ మహారాజ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ సినిమా విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడగ్గా ఆ నిమిషంలో జరిగే దాన్ని ఎవరూ అపలేరని ఈసారి నుంచి కస్త జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.
ఒక సినిమా ఎన్నో థియేటర్‌లలో రిలీజ్ అవుతుందని, ప్రతిచోటా మేం ఫాలోఅప్ చేయలం అన్నవారు ఒకవేళ అలా ఫాలోఅప్ చేస్తామని చెప్పినా అది నమ్మశక్యంగా ఉంటుందా అని తెలిపారు. వారి పరిధిలో ఉన్నంతవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు.
అంతేకాకుండా సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని, హైదరాబాద్ లో ఉంటుందని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని కుండబద్దలు కొట్టారు.
తాను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నానని, మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తానన్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇండస్ట్రీ సరిసమానంగా చూస్తోందని, ప్రభుత్వాలు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాయని నిర్మాత నాగవంశీ అన్నారు.
సంక్రాంతి కష్టాలు
మరోవైపు, సంక్రాంతికి మూడు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్న యి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లేకుంటే నిండా నష్టపోతామని నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్రాంతికి రాంచరణ్. నటించిన గేమ్ చేంజర్, బాలకృష్ణ సినిమా ఢాకుమహరాజ్, విక్టరీ వెంకటేశ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ కానున్నా యి.
ఈ సినిమాల్లో గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ మూవీ. దీనికితోడు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన ప్రకారం బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు ఉండదు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవనే భావన సినీ నిర్మాతల్లో నెలకొంది. అయితే, గేమ్ ఛేంజర్ కోసం ఇప్పటికే విదేశాల్లో సైతం ఈవెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ ధరలపై టెన్షన్ నెలకొన్నది.
బన్నీ తప్పు చేశాడా?
సీఎం ప్రకటన తర్వాత గంటల వ్యవధిలోఅల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి, తన వ్యక్తిత్వ హననం చేశారంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడటాన్ని సినీ నిర్మాతలు తప్పుపడుతున్నారు. అదంతా తప్పుడు ఆలోచనని, అల్లు అర్జున్‌కు రాంగ్ గైడ్లెన్స్ ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఎప్పటికైనా ప్రభుత్వం సహకరిస్తేనే ఇండస్ట్రీకి లాభం ఉంటుందని, ఒక్క సంఘటనను కారణంగా చూపించి, బేషజాలకు వెళ్తే.. ఇండస్ట్రీ మొత్తానికే నష్టమని భావిస్తున్నారు. నిజానికి, బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా గ్యాప్ పెర్ గిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఉండకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చేది కాదని సినీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.