Suryaa.co.in

Telangana

జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం ఆప్రజాస్వామికం

-బిజెపి పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
-రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బిజెపి
-మత ఘర్షణలు సృష్టించి ప్రశాంత వాతావరణం చెడగొట్టాలని చూస్తున్న మతోన్మాదులు
-సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రపూరితంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.

శనివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు‌. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యానికి బిజెపి పాలనలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గిరిజన నాయకుడు సీఎం స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఆ విధంగా కష్టపడి అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ ముఖ్యమంత్రి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చూడటం అత్యంత బాధాకరమని, ఇది సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు.

81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో కేవలం 28 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి అక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చివేసే కార్యక్రమానికి సిద్ధమవడం ప్రజాస్వామికమని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ను ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తున్న గిరిజన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజ్యాంగ సంస్థలను వాళ్లు దుర్వినియోగం చేయడం సరికాదన్నారు.

ఒక జార్ఖండ్ లోనే కాకుండా బిజెపేతర ప్రభుత్వాలు ఉన్న ప్రతి రాష్ట్రం పైన ఇదేవిధంగా ఒత్తిడి పెంచుతూ రాజ్యాంగ సంస్థలను వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి, సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. శాంతియుతంగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో మత ఘర్షణలు సృష్టించి, భావోద్వేగాలని రెచ్చగొట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వారే అధికారంలో ఉండాలని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు.

తెలంగాణలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి బిజెపి కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒక్కసారి అశాంతి వాతావరణం ఏర్పడడానికి వారే కారణమని వివరించారు. మత ఘర్షణలు సృష్టించి ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ,దేశ సమైక్యత, సమగ్రతకు విఘాతం కలిగించాలని దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ప్రగతిశీల వాదులు, ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు తిప్పికొట్టాలని కోరారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి లేకుండా బిజెపి చేస్తున్న పరిపాలన ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నదని తెలిపారు.

ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మధిర నియోజకవర్గం లో పారిశ్రామికీకరణ జరిగితే మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మధిర మండలం ఎండపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సేకరించిbhatti1 ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. మధుర నియోజకవర్గంలో చదువుకున్న రైతు కుటుంబాల పిల్లలు చిన్నపిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. దళిత బంధు కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అదేవిధంగా నియోజకవర్గంలో విత్తన అభివృద్ధి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు తాను కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాశానని వెల్లడించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకోవడానికి పింఛన్లు అందజేయడం ప్రభుత్వ సామాజిక బాధ్యత అన్నారు.

LEAVE A RESPONSE