అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల జాబితాలోకి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రస్టు సీఈఓ వినయ్‌చంద్ తెలిపారు. ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, ఆసుపత్రుల పనితీరుపై జిల్లాల సమన్వయకర్తలు, ఇతర అధికారులతో వినయ్‌చంద్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీలలో 725 ఆసుపత్రులు ఇప్పటికే ట్రస్టు నెట్‌వర్క్ జాబితాలో ఉన్నాయన్నారు. అన్ని ఆసుపత్రులను అనుబంధ జాబితాలోకి చేర్చితే అక్కడ జరిగే ప్రసవాలు, డెంగీ జ్వరాల వంటి వాటికి వైద్యులు చికిత్స అందించినా ట్రస్టు తరఫున చెల్లింపులు చేస్తామన్నారు. జిల్లాల్లో కొన్నిచోట్ల ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్ర పోస్టులను భర్తీ చేస్తామన్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల వారు రోగికి చికిత్స అందించేందుకు ట్రస్టుకు అరకొర వివరాలను పంపినప్పుడు మాత్రమే అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు.
అలాగే… అత్యవసర కేసులకు వెంటనే చికిత్స అందించేందుకు ఫోన్ ద్వారానే అనుమతి ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందిన రోగుల నుంచి ‘ఐవీఆర్‌ఎస్’ ద్వారా అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. స్పందన ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.