ఆ వేదికపై అతను మైక్ పట్టుకున్నప్పుడు మాటలు కూడబలుక్కుంటున్నాయి… గొంతులో వణుకు కనిపిస్తోంది. అది మైక్ సమస్య అని సర్దబోయారు, కానీ అది మైక్ సమస్య కాదు! అది ఏళ్ల తరబడి గుండెల్లో దాచుకున్న కృతజ్ఞత ఉప్పొంగి వస్తున్న ఉద్వేగం. ఆ ఉద్వేగాన్ని చూసి ఆ ‘చదువుల తల్లి’ ఆశీర్వచనంగా చిరునవ్వు చిందించింది.
ప్రకాశం జిల్లా కనిగిరి మట్టిలో పుట్టిన ఆ పల్నాటి బాలుడికి, పదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన తీరని వేదన ఎదురైంది. తల్లి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, 2009లో గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అతనికి అమ్మలా ఆశ్రయమిచ్చింది. 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్ల పాటు అక్షరమే ఊపిరిగా ఆ సరస్వతి నిలయంలో ఎదిగాడు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అందించిన శిక్షణతో ఎంసెట్లో ఫ్రీ సీటు సాధించి, ఇంజనీరింగ్ పూర్తి చేసి, కఠినమైన GATE పరీక్షలో ఉత్తీర్ణుడై… దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన NIT సూరత్కల్లో మాస్టర్స్ (M.Tech) పూర్తి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన సెమీకండక్టర్ VLSI విభాగంలో నిష్ణాతుడయ్యాడు. Synopsys (సినాప్సిస్) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలో, AI (కృత్రిమ మేధ) వచ్చినా రీప్లేస్ చేయలేని అత్యున్నత సాంకేతిక బాధ్యతలు నిర్వహిస్తూ, నేడు తన కుటుంబాన్ని మహారాజులా పోషిస్తున్నాడు.
తను మూలాలను మర్చిపోలేదు. తాను వృక్షమై సమాజానికి ఫలాలు అందించడానికి సిద్ధమయ్యానని చెబుతూ, ఆనాడు తనను అక్కున చేర్చుకున్న నాయుడుకి కృతజ్ఞతగా ఒక మొక్కను అందించాడు. సమాజానికి ఫలాలు ఇచ్చే వృక్షంలా ఎదిగిన మొక్కను చూసి ఆయన ఆనందంగా ఆశీర్వాదం ఇచ్చాడు. దశాబ్దాలుగా రాజకీయ కక్షల వల్ల అనాథలైన వేలాది మంది పిల్లలను లాయర్లుగా, జడ్జీలుగా, ఐటీ ఇంజనీర్లుగా, ప్రభుత్వ అధికారులుగా, కంపెనీలు మేనేజ్ చేసే ఐఐఎం మేనేజ్మెంట్ నిపుణులుగా మార్చిన ఆ ‘అక్షర కర్మాగారం’ సాఫల్యతకు హరికృష్ణ ఒక సజీవ సాక్ష్యం.
కొన్ని క్షుద్ర రాజకీయాలు ప్రాణాలు తీయవచ్చు, కానీ ఒక దార్శనికత ప్రాణాలను పోయగలదు… భవిష్యత్తును ఇవ్వగలదు. పగను చల్లార్చి, పేదరికాన్ని తుడిచేసి, నిస్సహాయులైన బిడ్డలను అత్యున్నత శిఖరాలపై నిలబెట్టడం కేవలం సేవ కాదు, అది ఒక అద్భుతమైన సామాజిక విప్లవం. కోట్లు ఉన్నా.. కార్పొరేట్ చదువుల కోసం లక్షలు ఖర్చు చేసినా సాధ్యం కాని సంస్కారాన్ని, విజ్ఞానాన్ని ఆ చదువుల తల్లి తన ఒడిలోని మాణిక్యాలకు అందిస్తూ మురిసిపోతోంది. ఈ విప్లవ వీరుడు పల్నాటి హరికృష్ణ ప్రయాణం ప్రతి పేద విద్యార్థికి ఒక స్ఫూర్తి!
ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థల వార్షికోత్సవ మహోత్సవంలోని దృశ్యకావ్యానికి ఇదే నా అభినందనల అక్షరాంజలి.
– చాకిరేవు