Suryaa.co.in

Andhra Pradesh

కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు

టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం సంచలనం సృష్టించింది. జంతువుల కొవ్వు ఆధారాలు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్‌ నిర్ధారించడంతో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారి (ఈవో) జె. శ్యామలరావు స్పందించారు. లడ్డూ నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, తక్షణమే నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి, నివేదికలను పరిశీలించినట్టు వెల్లడించారు.

జులై 6న టీటీడీ నెయ్యి శాంపిల్స్‌ను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపింది. వారంలోనే నివేదికలు వచ్చాయని, వాటిని పరిశీలించినపుడు, 100 పాయింట్ల స్థాయిలో ఉండాల్సిన నెయ్యి నాణ్యత కేవలం 20 పాయింట్లుగా ఉన్నట్టు తేలింది. అంతేకాక, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఈవో శ్యామలరావు వివరించారు.

నెయ్యి నాణ్యతపై వివాదం నెలకొనడంతో, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని వేయడం జరిగిందని శ్యామలరావు తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యమైనదిగా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని, దాంతో గుజరాత్ లోని ఎన్ డీడీబీ ల్యాబ్ కు నెయ్యి శాంపిల్స్ పంపామని తెలిపారు. నెయ్యి కల్తీ పరీక్ష కోసం శాంపిల్స్ ఇలా బయటికి పంపడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఎన్ డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైనదని చెప్పారు.

తమిళనాడు ఏఆర్ ఫుడ్స్ నుండి సరఫరా చేసిన నెయ్యిలోనే కల్తీ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఈవో చెప్పారు. కిలో నెయ్యిని రూ. 320 నుండి రూ. 411 ధరకు సరఫరా చేశారని, ఆ ధరలో స్వచ్ఛమైన నెయ్యి లభ్యం కాదని అనుమానం వచ్చిందని తెలిపారు. నెయ్యి నాణ్యతపై టీటీడీ సిబ్బంది కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఈవో పేర్కొన్నారు. సరఫరాదారులకు ఈ సమస్యను తెలియజేసిన తర్వాత, వారు నెయ్యి నాణ్యతను మెరుగుపరిచినట్లు చెప్పారు.

రుమల లడ్డూ నాణ్యతపై ఎలాంటి రాజీపడేది లేదని, భవిష్యత్తులో నెయ్యి నాణ్యత నిర్ధారణకు మరింత కఠినమైన మార్గదర్శకాలు తీసుకొస్తామన్నారు.

LEAVE A RESPONSE